సాక్షి, అమరావతి: కరోనా చికిత్సకోసం ఆనందయ్య అందిస్తున్న మూలికా వైద్యంలోని నాలుగు రకాల మందుల పంపిణీకి అభ్యంతరం లేదని, అయితే కళ్లల్లో వేసే చుక్కల(ఐ డ్రాప్స్) పంపిణీకి మాత్రం ప్రస్తుతానికి అనుమతినివ్వలేమని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య ఐ డ్రాప్స్ పరిశుభ్ర వాతావరణంలో తయారు కావట్లేదని నిపుణుల కమిటీ తేల్చిందని వివరించింది. ఈ డ్రాప్స్‌ను వేసుకునేవారి కళ్లు దెబ్బతినే వీలుందని కూడా చెప్పిందని, అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్ పంపిణీకి అనుమతినివ్వలేమంది. ఐ డ్రాప్స్‌పై తదుపరి పరీక్షలు అవసరమని, ఇందుకు నెలకుపైగా సమయం పట్టే వీలుందని తెలిపింది.
మీరు అనుమతిని ఇవ్వొద్దని, అయితే తమకు అవసరముందంటూ తమంతట తాముగా వచ్చేవారికి ఐ డ్రాప్స్ ఇచ్చేందుకు అడ్డుచెప్పవద్దని హైకోర్టు సూచించగా, ఆ పని తాము చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ దిశగా ఐ డ్రాప్స్ పంపిణీకి హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలివ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని తెలిపింది. దీంతో ఐ డ్రాప్స్ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని ఆదేశించాలని, అలాగే ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వర నాయుడులు వేర్వేరుగా పిల్‌లు దాఖలు చేశారు.
అలాగే తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు తగిన భద్రత కల్పించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ ఆనందయ్య పిటిషన్ వేశారు. వీటిపై జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.
ఐ డ్రాప్స్‌పై పూర్తిస్థాయి పరీక్షలు అవసరం...
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. మందు తయారీకి ఐదు రోజుల సమయం పడుతుందని ఆనందయ్య చెప్పారని, వెబ్‌సైట్ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు అందించే విషయంలో ఆనందయ్యకు అటవీశాఖ సాయం చేస్తుందని, గిరిజన కార్పొరేషన్ ద్వారా తేనె అందిస్తామని వివరించారు. కృష్ణపట్నం పోర్టులో ఖాళీగా ఉన్న ఓ గోదాములో మందు తయారు చేసుకోవచ్చునన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఐ డ్రాప్స్ సంగతేంటని ప్రశ్నించింది.
నిపుణుల కమిటీ ఆనందయ్య ఇచ్చిన కే రకం మందు శాంపిల్స్‌ను పరీక్షించిందని, దీన్ని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని సుమన్ తెలిపారు. అయితే ఐ డ్రాప్స్‌పై కమిటీ అభ్యంతరాలు లేవనెత్తిందని, ప్రమాణాలకనుగుణంగా తయారీ లేదని తెలిపిందన్నారు. పూర్తిస్థాయి పరీక్షల నిమిత్తం 1–3 నెలల సమయం పట్టే వీలుందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్ పంపిణీకి అనుమతినివ్వలేమన్నారు. నెల రోజులంటే ఎక్కువ సమయమని, ఎలాంటి వాతావరణంలో చేయాలో చెబితే దానిప్రకారం ఆనందయ్య తయారు చేస్తారని ధర్మాసనం చెప్పగా.. అలా చేస్తున్నారో లేదో మళ్లీ నిపుణుల కమిటీ పరిశీలించాల్సి ఉంటుందని సుమన్ తెలిపారు.
కోర్టును నిందించే పరిస్థితి రాకూడదు...
ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ స్పందిస్తూ, ఐ డ్రాప్స్ అప్పటికప్పుడు తయారుచేసి వినియోగిస్తున్నారని, అందువల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) హరినాథ్ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్ భద్రత, సమర్థత చాలా ముఖ్యమని, గుజరాత్‌లో ఇలాంటి మందే తయారు చేస్తే సమర్థత, భద్రత కారణాలతో హైకోర్టు దాని పంపిణీని ఆపేసిందన్నారు. రేపు జరగరానిది జరిగితే అందుకు కోర్టును నిందించే పరిస్థితి ఉండకూడదన్నారు. తుది పరీక్షలు వేగవంతం చేయలేరా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. పలు సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, ఒక్కో సంస్థ నుంచి అనుమతి వచ్చేందుకు వారంపైగా పడుతుందని ఎస్‌జీపీ సుమన్ తెలిపారు.
పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని అక్కడకొచ్చి వేసుకోనివ్వాలని, అలాంటి వారిని ఆపొద్దని ధర్మాసనం సూచించగా.. కరోనా తీవ్రంగా ఉన్నవారు అక్కడికి వస్తే కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుందని సుమన్ తెలిపారు. తయారుచేసిన ఐ డ్రాప్స్‌ను ఎంతకాలం వరకు భద్రపరచవచ్చునని ధర్మాసనం అడుగగా.. కొద్ది నిమిషాల వరకేనని అశ్వనీకుమార్ చెప్పారు. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఐ డ్రాప్స్‌కోసం 15–20 మంది వరకు వచ్చారని, ఇప్పుడు అంతకన్నా తక్కువమంది వచ్చే అవకాశముంటుందని ధర్మాసనం అడిగిన మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అలాగైతే ఐ డ్రాప్స్ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment