సాక్షి, చెన్నై: బైక్ రేసులో దూసుకెళ్లిన ఓ యువకుడికి హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నెల రోజులు స్టాన్లీ ఆసుపత్రి అత్యవసర చికిత్సా విభాగంలో వార్డుబాయ్‌గా పనిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలు.. చెన్నై నగరంలో, శివారుల్లోని బైపాస్, ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్ మార్గాల్లో రాత్రుల్లో యువత బైక్ రేసు పేరిట దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. వీరిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న ఈ యువకులు మాత్రం తగ్గడం లేదు.
ఈ పరిస్థితుల్లో మార్చి 21వ తేదీ బైక్ రేసులో దూసుకెళ్లిన కొరుక్కుపేటకు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను హైకోర్టులో ఆ యువకుడి తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. గురువారం పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, అతడికి వినూత్న శిక్షను విధించింది.
మానసిక పరివర్తన కోసమే..
బైక్ రేసులో దూసుకెళ్లే యువకుల కారణంగా రోడ్డున వెళ్తున్న వారు ఎందరో ప్రమాదాల బారిన పడుతున్నారని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఆస్పత్రుల్లోని అత్యవసర చికిత్సా విభాగాలకు తరలించడం జరుగుతోందని, అక్కడ వారు పడే వేదన వర్ణాణాతీతం అని పేర్కొన్నారు. అందుకే ప్రవీణ్ చెన్నై స్టాన్లీ ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో నెల రోజులు వార్డు బాయ్‌గా పనిచేయాలని ఆదేశించారు. ప్రమాదాల బారిన పడే వారి బాధల్ని చూసైనా ఇతడిలో మార్పు వచ్చేనా అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment