సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ, మరమ్మతులు, సర్వీస్ కాంట్రాక్ట్ ఒప్పందం విషయంలో టెలీమ్యాటిక్ అండ్ బయో మెడికల్ సర్వీసెస్ (టీబీఎస్) సంస్థకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ.100 కోట్లకు పైగా బకాయిల చెల్లింపు వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. బకాయిల చెల్లింపు, ఒప్పందం అమలు విషయంలో ప్రభుత్వంతో నెలకొన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించాలని కోరుతూ టీబీఎస్ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టేసింది.
భవిష్యత్‌లో ఈ విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే దానిపై మధ్యవర్తిత్వానికి వెళ్లాలన్న నిబంధన ఏదీ ఇరుపక్షాలు మధ్య కుదిరిన ఒప్పందంలో లేదని తేల్చి చెప్పింది. బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) ఎంతమాత్రం ఒప్పందం కిందకు రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా ఇటీవల తీర్పు వెలువరించారు.
కేసు నేపథ్యమిదీ..
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ, సర్వీసు, మరమ్మతుల విషయంలో ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ, టీబీఎస్ మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. 2018 వరకు ఈ ఒప్పందం అమలైంది. పరికరాల నిర్వహణలో టీబీఎస్ రూ.కోట్లమేర అక్రమాలకు పాల్పడినట్టు నిరూపణ అయింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, కోర్టు ఏసీబీ విచారణకు ఆదేశించింది.
ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ బయో మెడికల్ పరకరాల నిర్వహణలో టీబీఎస్ అక్రమాలు నిజమేనంటూ హైకోర్టుకు నివేదించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టీబీఎస్‌కు చెల్లింపులను నిలిపేసింది. అనంతరం టీబీఎస్‌తో ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒప్పందం అమలుకు సంబంధించి భవిష్యత్‌లో ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్న ఒప్పందం ఏమీ ఇరుపక్షాల మధ్య లేదు.
అయినప్పటికీ టీబీఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన వస్తు సేకరణ మాన్యువల్‌లో మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని, అందువల్ల వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలని కోరుతూ హైకోర్టులో మధ్యవర్తిత్వ దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా విచారణ జరిపారు.
అక్రమాలకు పాల్పడి మధ్యవర్తిత్వానికి పిలవడమేంటి!
దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. బయో మెడికల్ పరికరాల నిర్వహణ విషయంలో టీబీఎస్ అక్రమాలను ఏసీబీ నిర్ధారించిందని, దీనిపై సీఐడీ కూడా కేసు నమోదు చేసిందని హైకోర్టుకు నివేదించారు. రూ.కోట్ల మేర అక్రమాలకు పాల్పడి మధ్యవర్తిత్వానికి పిలవడం దారుణమన్నారు. అక్రమాలు జరిగిన చోట మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదన్నారు.
అంతేకాక మధ్యవర్తిత్వానికి ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని, అందువల్ల మధ్యవర్తి నియామకమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. సుధాకరరెడ్డి వాదనలతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించారు. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వానికి ఒప్పందం లేనప్పుడు మధ్యవర్తి నియామకం సాధ్యం కాదంటూ టీబీఎస్ దరఖాస్తును కొట్టేశారు.
కేంద్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన ‘వస్తు సేకరణ మాన్యువల్’లో పేర్కొన్న అంశాలు కేవలం సలహా పూర్వకమైనవేనని, అందులో మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించినంత మాత్రాన, అది మధ్యవర్తిత్వ నిబంధన కాజాలదని హైకోర్టు తెలిపింది. అందువల్ల టీబీఎస్ దాఖలు చేసిన దరఖాస్తును కొట్టేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.
టీబీఎస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
Published Mon, Jul 18 2022 5:04 AM | Last Updated on Mon, Jul 18 2022 5:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment