సాక్షి, అమరావతి: వివిధ శాఖలకు చెందిన జీవోలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ సాధారణ ప్రజల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచే విషయంలో ఎలాంటి నిషేధం విధించలేదని, గతంలో జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో ఉంచితే, ఇప్పుడు ఈ–గెజిట్ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని తెలిపింది. అలాగే చిన్నచిన్న ఖర్చులు, చెల్లింపుల బిల్లులు కూడా వెబ్‌సైట్‌లో ఉంచే వాళ్లమని, ఇప్పుడు వాటిని వెబ్‌సైట్‌లో ఉంచటంలేదని పేర్కొంది. దీనివల్ల వెబ్‌సైట్‌లో ఉంచే జీవోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలకు సంబంధించిన జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని తెలిపింది.
గతంలో జీవో నంబర్లను కంప్యూటరే నిర్ణయించేదని, ఇప్పుడు ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్, ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం మాన్యువల్‌గానే జీవో నంబర్లు ఇస్తున్నట్లు వివరించింది. గత ఏడాది ఆగస్టు 17 నుంచి గత నెల 28 వరకు 33 శాఖలకు చెందిన జీవోల్లో 620 జీవోలను ఈ–గెజిట్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం రహస్య, అతి రహస్య, ఇతర జీవోల్లో 7,837 జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచలేదంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టును కోరింది. జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడంపై దాఖలైన వ్యాజ్యాల్లో ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవని తెలిపింది.
ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ కోర్టు రికార్డుల్లోకి చేరకపోవడంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సమాచారహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జి.ఎం.ఎన్.ఎస్.దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు దాఖలు చేయలేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ అభ్యంతరం తెలుపుతూ తాము ఇప్పుడే అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. న్యాయవాది బాలాజీతోపాటు ఇతర న్యాయవాదులకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా పంపామన్నారు. ప్రభుత్వ అఫిడవిట్ హైకోర్టు రికార్డుల్లోకి రాకపోవడంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేసింది.
ప్రజల నుంచి ఫిర్యాదుల్లేవు
Published Tue, Feb 1 2022 4:55 AM | Last Updated on Tue, Feb 1 2022 8:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment