సాక్షి, అమరావతి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని హైకోర్టు సమర్థించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది.
ఈ మేరకు ఒక కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో జీవో 174 జారీ చేసింది. కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో కొన్ని నిబంధనలు తెచి్చంది.
దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బహుళ పెన్షన్ల విషయంలో నిబంధనలు రూపొందించిందని ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు.
తీర్పులో ముఖ్యాంశాలు ఇవీ..
ఈ గణాంకాలు చూశాక..
‘కేంద్రం రూ.288 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.19,161 కోట్లు చెల్లిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆసక్తికరమైన గణాంకాలను మా ముందుంచాయి. వృద్ధాప్య పెన్షన్ల కోసం కేంద్రం తన వాటా కింద ఏటా రూ.188.74 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.10,164 కోట్లు చెల్లిస్తోంది. వితంతు పెన్షన్ల కోసం కేంద్రం రూ.91.07 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.4,129.44 కోట్లు ఇస్తోంది. దివ్యాంగులకు కేంద్రం రూ.9.05 కోట్లు ఇస్తుంటే రాష్ట్రం రూ.2,594.31 కోట్లు చెల్లిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెన్షన్ల కింద వివిధ వర్గాలకు మొత్తం రూ.19,161.66 కోట్లు చెల్లిస్తోంది. ఈ గణాంకాలను చూసిన తరువాత జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదన్న పిటిషనర్ వాదనను మేం ఏమాత్రం అంగీకరించడం లేదు.
ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం
అశ్వనీకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వృద్ధులకు ఆర్థిక సాయం, పెన్షన్లు, నివాసం, మెడికల్ ఖర్చుల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వృద్ధుల దయనీయ పరిస్థితిని సానుభూతి కోణంలో పరిశీలించి పెన్షన్ ఇవ్వటాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే పెన్షన్ మంజూరు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న నిధులు, ఆరి్థక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం.
అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం. దివ్యాంగులకు పెన్షన్లు మంజూరులో కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక కోణంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఇది. దీన్ని పునఃసమీక్షించేందుకు మేం అధికరణ 226 కింద మాకున్న అధికారాన్ని వినియోగించలేం. ఆ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాం.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment