పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిహార్ ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కార్యక్రమాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గతంలో పలు పిటీషన్‌లు నమోదయ్యాయి. వీటిని కొట్టివేస్తూ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది.
బిహార్‌లో కుల గణన మొదటి సర్వే జనవరి 7 నుంచి 21 వరకు జరిగింది. రెండో దఫాలో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ కార్యక్రమంపై మే 4నే హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది. కుల గణన చేపట్టాలని గత ఏడాది జూన్ 21నే రాష్ట్ర అసెంబ్లీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
కాగా.. బిహార్ సీఎం నితీష్ కుమార్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని నిర్మించడానికి ఆయన ప్రధాన వ్యక్తిగా నిలిచారు. ఎన్డీయే కూటమికి దేశంలో ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఇండియా అనే కూటమిని నిర్మించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు..
Comments
Please login to add a commentAdd a comment