గాంధీ మహాత్ముడి జయంతి రోజైన సోమవారం బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. గత తొమ్మిది నెలల్లో రెండు దఫాలుగా నిర్వహించిన కులగణనలో వెల్లడైన గణాంకాలను ప్రజల ముందుంచింది. ఇందులో ఆర్థిక స్థితిగతుల సర్వే కూడా ఉంది. మొన్న జనవరిలోనూ, ఏప్రిల్‌లోనూ నిర్వహించిన ఈ కుల గణన మండల్ రాజకీయాలకు అంకురార్పణ పడిన బిహార్‌లోనే చోటు చేసుకోవటం గమనించదగ్గది. ఈ విషయంలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ చొరవను అభినందించాలి. నిజానికి రాజకీయ పక్షాలేవీ బాహాటంగా దీన్ని వ్యతిరేకించలేదు.
2021లో బిహార్ నుంచి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అఖిలపక్ష బృందంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని ఆ ప్రతినిధి బృందం డిమాండు చేసింది. కానీ బీజేపీ కేంద్ర నాయ కత్వం దీనిపై మౌనంగానే ఉంది. బిహార్ గణాంకాలు వెల్లడిస్తున్న అంశాలు ఈ సర్వే అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు మొదలై దశాబ్దాలు గడుస్తున్నా ఈనాటికీ అనేక వెనకబడిన కులాలు అభివృద్ధికి ఎంతో దూరంలో ఉన్నాయని ఈ గణన రుజువు చేస్తోంది.
ఎప్పుడో వలస పాలనలో దేశవ్యాప్తంగా 1931లో తొలిసారి కులగణన నిర్వహించగా తొమ్మిది దశాబ్దాల అనంతరం ఇన్నాళ్లకు నితీష్‌కుమార్ ఈ సాహసం చేశారు. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుల గణన పేరిట ఒక ప్రయత్నం చేయకపోలేదు. 130 కోట్లమంది ప్రజానీకం నుంచి వివరాలు కూడా సేకరించారు. కానీ దాని నిర్దుష్టతపై సందేహాలున్నాయంటూ నాటి పాల తకులు ఆ గణాంకాలను అటకెక్కించారు. దీని వెనకున్న నిజానిజాలేమిటో ఎవరికీ తెలియదు.
విమర్శల మాటెలావున్నా, ఎదుర్కొన్న అవరోధాలు ఎలాంటివైనా బిహార్ గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఏ కులానికి ఆ కులం తమ జనాభా ఎక్కువని చెప్పుకోవటం ఎన్నికల సమయంలో రివాజే అయినా మొత్తంగా చూసుకుంటే దేశ జనాభాలో ఓబీసీల శాతం అత్యధికమన్నది అందరూ ఎప్పటినుంచో అంగీకరిస్తున్న సత్యం.
బిహార్ గణాంకాలు ఆ సంగతినే ధ్రువీకరించాయి. అయితే అభివృద్ధి ఫలాలు ఈనాటికీ అందుకోలేని అశక్తతలో అనేక కులాలున్నాయని ఈ గణన వెల్లడిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. బిహార్ లోని 13.07 కోట్ల జనాభాలో ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ) సంఖ్య మూడున్నర కోట్లు (27 శాతం) కాగా, అత్యంత వెనకబడిన వర్గాలు 4.70 కోట్లు (36 శాతం) అని నివేదిక వెల్లడిస్తోంది.
అంటే మొత్తంగా వెనకబడిన వర్గాల జనాభా 63 శాతం! రాష్ట్ర జనాభాలో 2.6 కోట్లమంది (20 శాతం) ఎస్సీలు, 22 లక్షలమంది (1.6 శాతం) ఎస్టీలు. జనరల్ క్యాటగిరీలో ఉన్న ఆధిపత్య కులాలు 15.5 శాతం అని కుల గణన చెబుతోంది. జనాభాలో హిందువులు 81.99 శాతం కాగా, ముస్లింలు 17.7 శాతం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలవారూ ఒక శాతంలోపేనని నివేదిక తెలిపింది.
దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన పర్యవసానంగా దేశవ్యాప్తంగా కుల వృత్తులు తీవ్ర సంక్షోభంలో పడి నిరసనల వెల్లువెత్తాక అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు కొత్త విధానాలు రూపొందించాయి. కానీ ఈ మొత్తం వ్యవహారం చీకట్లో తడుములాటగానే ఉంటున్న దన్న విమర్శలు ఆనాటినుంచీ ఉన్నాయి. ఎందుకంటే సాధికారకమైన గణాంకాలు లేకపోవటంతో 1979లో కేంద్రంలోని అప్పటి జనతాపార్టీ ప్రభుత్వం నియమించిన మండల్ కమిషన్ నివేదిక అంచనాలనే అన్ని ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి.
ఓబీసీలు 52 శాతం ఉంటారని ఆ నివేదిక అంచనా వేసింది. అయితే ఈ శాతం మరింత ఎక్కువుండొచ్చని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ వచ్చారు. ఇప్పుడు బిహార్ గణాంకాలు ఆ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. బహుశా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తే ఇదే రుజువయ్యే అవకాశం ఉంది.
కుల గణనకు పూనుకొని నితీష్ సర్కారు కొత్త ఆలోచనలు రేకెత్తించింది. దీనివల్ల ఆయన పార్టీకీ లేదా అక్కడి సామాజిక న్యాయ రాజకీయాలకూ వెనువెంటనే కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పలేం. ఓబీసీల హక్కుల కోసం మాట్లాడే పార్టీలు ఎటూ కొత్త ఆలోచనలు చేయక తప్పదు. ఆ కులాల్లో సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఇన్ని వ్యత్యాసాలున్నాయని గ్రహించాక వాటికి తమ దగ్గరున్న పరిష్కారాలేమిటన్నది పార్టీలు తేల్చుకుంటాయి.
వీటన్నిటికన్నా ప్రధానమైనదేమంటే... ఓబీసీ కులాల్లో కొన్ని మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నాయనీ, ఇప్పటికీ అందుకు దూరంగావుంటున్న కులాలు అనేకం ఉన్నాయనీ, వాటి జనాభాయే ఎక్కువనీ నివేదిక వెల్లడించిన వాస్తవం పాలనావ్యవస్థ కళ్లు తెరిపిస్తుంది. ఇప్పుడు అమలు చేస్తున్న విధానాల, పథ కాల లోపాలను సరిదిద్ది, వాటిని పదునెక్కించటంతోపాటు కొత్తగా చేయాల్సిందేమిటన్న అంశంపై దృష్టి సారిస్తుంది. బహుశా రిజర్వేషన్ల శాతం 50 శాతం మించరాదన్న నిబంధనపై సైతం న్యాయ స్థానాలు పునరాలోచన చేయవచ్చు.
శతాబ్దాలుగా మన దేశంలో వేళ్లూనుకున్న నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వల్ల సామాజిక అభివృద్ధికి మెజారిటీ వర్గాలు దూరంగా ఉండిపోయాయని బ్రిటిష్ వలస పాలనలోనే గుర్తించారు. కానీ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటూ వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచాక కూడా అత్యంత వెనకబడిన కులాలున్నాయంటే అది మన పాలనా వ్యవస్థ లోపాన్ని పట్టి చూపుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలు సైతం కులగణనకు అనుకూలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో చొరవ తీసుకుని జనగణనతోపాటు కుల గణనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే అట్టడుగు వర్గాలవారిని ఉద్ధరించటానికి ఆ చర్య దోహదపడుతుంది.
చరిత్ర సృష్టించించిన బిహార్ సర్కార్.. ప్రజల ముందుకు కులగణన ఫలితాలు
Published Tue, Oct 3 2023 3:57 AM | Last Updated on Tue, Oct 3 2023 4:09 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment