దేశంలో లోక్‌సభ ఎన్నికల తంతు పూర్తయ్యింది. ఇక ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలివుంది. ఈ నేపధ్యంలో దేశంలో పలు ఆసక్తిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు జరిగిన ఈ భేటీలో బీహార్ రాజకీయాలతో పాటు ఇతర ప్రాంతాల రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి అమిత్‌షాతో నితీష్ కుమార్ సమావేశం కానున్నారు.
ప్రధానితో సీఎం నితీశ్ కుమార్ భేటీ వెనుక అనేక అంశాలు ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. బీహార్ సహా దేశవ్యాప్తంగా ఎన్డీఏ సీట్లను అంచనా వేయడం, నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్యాబినెట్‌లో జేడీయూ పాత్ర ఎలా ఉండనుంది? భవిష్యత్తులో రెండు ప్రభుత్వాలు కలిసి ఎలా పని చేయాలి? అనే అంశాలపై వీరిమధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ నుంచి పాట్నాకు తిరిగి వెళ్లనున్నారు. సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనలో ఆయన వెంట జేడీయూ రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా కూడా ఉన్నారు. రేపు (శనివారం) లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment