తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టినవారికి గుర్తింపు రావటం అంత సులభం కాదు. ప్రసంగించే అవకాశం లభించటం, దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అరుదు. మహిళా ఎంపీల విషయంలో దాదాపు అసాధ్యం. కానీ రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్దికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికై లోక్‌సభలో ప్రవేశించిన మహువా మొయిత్రా చాలా త్వరగానే ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యారు. తీరా నాలుగేళ్లయ్యే సరికల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఏం జరిగిందో అందరూ గ్రహించే లోగానే ఉరుము లేని పిడుగులా, ఊహించని ఉత్పాతంలా వచ్చిపడిన వివాదం చివరికామె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరుపెట్టేలా పరిణమించింది.
సభ్యుల నైతిక వర్తనను నియంత్రించే లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరుతూ గురువారం నివేదికను ఆమోదించింది. ఇందుకు ప్రధానంగా అనైతిక వర్తన, తీవ్ర తప్పిదాలకు పాల్పడటం కారణాలుగా చూపింది. అంతేకాదు... ఈ విషయంలో సంస్థాగత విచారణ, చట్టపరంగా గట్టి చర్యలు అవసరమని సిఫార్సు చేసింది.
పార్లమెంటు సభ్యులు సభలో ప్రశ్నలు వేయటానికి వినియోగించే ఎన్‌ఐసీ వెబ్‌సైట్ లాగిన్, పాస్‌వర్డ్ ఆమె తన స్నేహితుడైన దుబాయ్ రియలెస్టేట్ వ్యాపారి దర్శన్ హీరానందానీకి ఇచ్చారనీ, ఆయన నుంచి కోటి రూపాయల ముడుపులు తీసుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థలపై ప్రశ్నలు సంధించారనీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణలు. ఆ ప్రశ్నలు అదానీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసేంత తీవ్రమైనవా? అందువల్ల హీరానందానీకి ఒరిగేదేమిటి? ముడుపుల సంగతిని మొయిత్రా తోసి పుచ్చారు. లాగిన్, పాస్‌వర్డ్ ఇచ్చినట్టు అంగీకరించారు. అందుకుగల కారణాలు చెప్పారు.
ఇదంతా దేశభద్రతకు ముప్పు తెచ్చే చర్య అనీ, లంచం తీసుకుని ప్రశ్నలేయటం అనైతికమనీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత నెలలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ ఇప్పటికే మొయిత్రా ఓం బిర్లాకు లేఖ రాశారు. కమిటీ తనను ప్రశ్నించిన తీరు ‘వస్త్రాపహరణం’ మాదిరిగా వున్నదంటూ దుయ్యబట్టారు.
మొయిత్రా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వలె ఆంగ్ల భాషాప్రావీణ్యం వుండటం వల్లనే త్వరగా ఆమెకు పేరుప్రతిష్టలు సాధ్యమైనాయని అనుకోవటానికి లేదు. ప్రసంగించదల్చుకున్న అంశంపై పట్టు సంపాదించటం ఒక్కటే మొయిత్రా ప్రత్యేకతని చెప్పడానికి కూడా లేదు. విషయ పరిజ్ఞానంతోపాటు విస్ఫులింగాలు విరజిమ్మే స్వభావం, నిర్భీతిగా పాలక పక్షాన్ని నిలదీసే తత్వం ఆమెకొక విశిష్టతను తీసుకొచ్చాయి. అంతకుముందు మూడేళ్లు ఆమె తృణమూల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మొయిత్రా గురించి దేశానికంతకూ తెలిసింది
ఈ నాలుగేళ్ల కాలంలోనే. సభలోనే కాదు... వెలుపల కూడా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిప్పులు చిమ్ముతారు. మూకుమ్మడి అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షపడిన గుజరాత్ దోషులకు క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎథిక్స్ కమిటీ విచారణలో నిర్ధారించిన అంశాలేమిటో, అవి ఏరకంగా తీవ్రమైన స్వభావంతో కూడుకున్నవో ఇంకా తెలియాల్సి వుంది. ఎన్‌ఐసీ లాగిన్, పాస్‌వర్డ్ ఇవ్వటం విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా సరైంది కాదనుకుంటే ఆమెను మందలించవచ్చు.
కమిటీలోని విపక్ష సభ్యులు చెబుతున్న ప్రకారం 800 మంది ఎంపీల్లో అనేకులు సగటున కనీసం ఇద్దరు ముగ్గురికి ఇలా ఇస్తారు. కంప్యూ టర్‌ల వాడకం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం ఇందుకు కారణం. ఈ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. ఆ సంగతలా వుంచితే ఫిర్యాదు, విచారణ వగైరాలన్నీ ఆదరా బాదరాగా సాగినట్టు కనబడుతోంది. అక్టోబర్ 26న కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ నెల 2న జరిగిన రెండో సమావేశం మధ్యలోనే ముగిసింది. అడిగినవాటికి జవాబివ్వకుండా ఆమె దుర్భాషలాడారని కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ ఆరోపిస్తే... ఫిర్యాదుతో సంబంధం లేని ప్రశ్నలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వేధించారన్నది మొయిత్రా ఆరోపణ.
దుబాయ్ వెళ్తే ఏ హోటల్‌లో దిగుతారు... మీతో ఎవరుంటారు... మీరు మీ మిత్రులతో మాట్లాడుతున్నట్టు వారి భార్యలకు తెలుసా అని అడిగారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి నిరసనగా ఆమె, విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కమిటీ విచారణ గోప్యం కనుక ఆరోపణలు, ప్రత్యారోపణల్లో నిజానిజాలేమిటో తెలియదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నది మాత్రం వాస్తవం.
అసలు దూబే ఫిర్యాదుకు మొయిత్రా మాజీ సహచరుడు దేహద్రాయ్ లేఖ ఆధారమన్న సంగతి కమిటీకి తెలుసా? కమిటీకిచ్చిన అఫిడవిట్‌లో మొయిత్రాకు ముడుపులు చెల్లించానని హీరానందానీ అంగీకరించారా? లేదని విపక్ష సభ్యులు చెబుతున్నారు. విడిపోయిన జంట పరస్పరం ఆరోపించుకోవటం సర్వసాధారణం. ఇప్పటికే పెంపుడు కుక్క విషయంలో వారిద్దరూ కేసులు పెట్టుకున్నారు. కనుక దేహద్రాయ్ ఫిర్యాదు అంశంలో దూబే, ఎథిక్స్ కమిటీ ఆచితూచి అడుగు లేయాల్సింది.
మహిళ గనుకే ఇలా చేశారన్న అపవాదు రానీయకుండా చూసుకోవాల్సింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతం, రాజకీయం కలగాపులగం చేశారన్న అప్రదిష్ట కలగడమూ మంచిది కాదు. ఏదేమైనా వ్యవస్థను ఢీకొట్టేవారు నిరంతరం అత్యంత జాగురూకతతో మెలగాలని మొయిత్రా ఇప్పటికే గుర్తించి వుంటారు. ఈ వివాదంలో పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి అనుగుణమైన నిర్ణయం వెలువడాలని అందరూ కోరుకుంటారు.
ఇదీ చదవండి: అమలు గ్యారంటీ
Comments
Please login to add a commentAdd a comment