మత్స్యకార సంఘ పెద్దలతో చర్చిస్తున్న ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి
Fight Between Two Groups Of Fishermen In Jalaripeta ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మత్స్యకారుల మధ్య రాజుకున్న వివాదం బుధవారం మరోసారి రొడ్కెక్కింది. రింగు వలలతో వేట నేపథ్యంలో తీరంలోని మత్స్యకార గ్రామాల మధ్య మంగళవారం చిచ్చురేగిన విషయం తెలిసిందే. వాసవానిపాలెం, జాలరి ఎండాడ, మంగమారిపేటకు చెందిన కొందరు జాలర్లు రింగు వలలతో మంగళవారం వేటకు వెళ్లగా పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు అడ్డుకోవడంతో ఈ వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా పెదజాలరిపేటకు చెందిన 8 మందికి గాయాలుకాగా వాసవానిపాలెం, మంగమారిపేటకు చెందిన 6 బోట్లు దహనమయ్యాయి. అయితే బోట్లకు నిప్పు అంటించిన ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను మెరైన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ జాలరిపేటలో వాతావరణం వేడెక్కింది.
జాలరిపేటలోని మత్స్యకారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాలరిపేటను ఆనుకొని ఉన్న ఆర్‌టీసీ కూడలికి భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. మహిళలు, యువతతో సహా వేల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టయిన మత్స్యకారులను విడుదల చేయాలంటూ వారంతా కొద్దిసేపు నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా తెడ్డిరాజు, పరసన్న వంటి పలువురు మత్స్యకార సంఘ నాయకులు మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసిన మత్స్యకారులను తక్షణమే విడుదల చేయాలని హెచ్చరించారు. గంటలో విడుదల చేయకుంటే బీభత్సం సృష్టిస్తామని తెడ్డి రాజు బహిరంగంగా హెచ్చరించడం, కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ తీసేందుకు కొందరు మత్స్యకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని నిలువరించారు.
పెదవాల్తేర్ ఆర్టీసీ డిపో కూడలి వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు
చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం
మంత్రుల సదస్సుకు గైర్హాజరు
రింగు వలల వివాదంపై ఇప్పటికే పలు అవగాహన సదస్సులు, సమావేశాలు మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే తాజా వివాదంతో బుధవారం మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు సమక్షంలో మరోసారి సమావేశం నిర్వహించేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఇరువర్గాల మత్స్యకార గ్రామాల పెద్దలు కలెక్టర్ ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్‌లో నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సివుంది. అయితే ఇంతలో జాలరిపేట మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో సమావేశం నిలిచిపోయింది.
పూచీకత్తుతో నిందితుల విడుదల
ఈ ఘర్షణల్లో భాగంగా మంగళవారం 6 బోట్లు దహనం చేసిన విషయం తెసిందే. ఈ ఘటనకు సంబంధించి మెరైన్ పోలీసులు పిల్లా నూకన్న, వాడమదుల సత్యారావును అరెస్ట్ చేశారు. అయితే జాలరిపేట మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని విడిచిపెడుతున్నట్లు ద్వారకా ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. మెరైన్ పోలీసులు వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు 41 నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతోపాటు పూచీకత్తులు రాయించుకొని విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో రాత్రి 8గంటల సమయంలో నూకన్న, సత్యారావు విడుదలై నిరసన శిబిరానికి చేరుకోవడంతో ఆందోళన ముగిసింది. అయితే తీర ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు అధికారులు వెల్లడించారు.
హైకోర్టు ఉత్వర్వుల అమలుకు డిమాండ్
జిల్లాలో ఎంఎఫ్‌ఆర్ చట్టం – 1995 ప్రకారం రింగు వలలతో చేపల వేటపై వెంటనే నిషేధం అమలు చేయాలని పెదజాలారిపేట గ్రామ సేవా సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం పెదజాలరిపేట దరి కురుపాం సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ కుల పెద్ద తెడ్డు పరసన్న మాట్లాడుతూ కొత్తగా రింగు వలలకు అనుమతులు ఇవ్వరాదని కోరారు. తాము గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే సముద్రంలో 8 కిలో మీటర్లలోపు రింగు వలలతో వేట నిషేధం అమలు చేయాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. కోర్టు ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని తాము ఇప్పటికే రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ఆ శాఖ కమిషనర్‌ను కోరామని గుర్తు చేశారు.
అయినప్పటికీ రింగువలలతో వేట చేయవద్దని చెప్పినందున తమ గ్రామ మత్స్యకారులపై మంగళవారం దాడి చేసి గాయపరచడం అన్యాయమన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేని మత్స్యశాఖ అధికారులు తమను గంగవరం నుంచి పెదనాగమయ్యపాలెం బీచ్ వరకు చేపలవేట చేయరాదని నిబంధనలు విధించడం విడ్డూరంగా వుందని విమర్శించారు. కార్యక్రమంలో తెడ్డు రాజు, తెడ్డు సత్తయ్య, ఒలిశెట్టి గురయ్య, తెడ్డు సతీష్ పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంవీపీ స్టేషన్ సీఐ రమణయ్య పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు.
చదవండి: దంత కళాశాలలో కీచక వైద్యుల లీలలు!
Comments
Please login to add a commentAdd a comment