మీడియాతో మాట్లాడుతున్న బాధితురాలు
డాబాగార్డెన్స్(విశాఖపట్నం): తన భర్త రెండు నెలలుగా కనిపించడం లేదని అల్లిపురం వేంకటేశ్వరమెట్ట ప్రాంతానికి చెందిన తాటిపూడి మహేశ్వరి వాపోయింది. ఈ విషయమై రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని మీడియాను ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో తన గోడు వెలిబుచ్చింది.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం ప్రాంతానికి చెందిన మహేశ్వరి తండ్రి 30 ఏళ్ల కిందట చనిపోవడంతో తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ చేరుకున్నారు. అల్లిపురం వేంకటేశ్వరమెట్ట వద్ద తల్లితో నివసిస్తూ సమీపంలోని గాజుల షాపులో మహేశ్వరి పనిచేసేది. ఈ క్రమంలో ఆమెకు పెందుర్తి చిన్నతాడివలస ప్రాంతానికి చెందిన అశోక్‌తో పరిచయం ఏర్పడి, అది శారీరక బంధానికి దారి తీసింది.
తర్వాత పెళ్లికి అశోక్ ముఖం చాటేయడంతో ఆమె పెద్దలను ఆశ్రయించగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప సంతానం. ఈ క్రమంలో రెండు నెలల కిందట వేరే మహిళ నుంచి ఫోన్ వచ్చిందని, అప్పటి నుంచి అశోక్ కనిపించకుండా పోయాడని మహేశ్వరి వాపోయింది. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని, ఇప్పటికైనా నా భర్తను అప్పగించాలని ఆమె వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment