కేవలం కొన్ని రోజుల వ్యవధి... మూడు కేసులు, మూడు బెంచ్‌లు–అదే హైకోర్టు. కానీ యువతీయువ కుల సహజీవన సంబంధాల విషయంలో వేర్వేరు తీర్పులు. సమాజంలో ఇలాంటి సంబంధాల విషయంలో ఎలాంటి వైఖరులు వ్యక్తమవుతున్నాయో, అవి ఎంత పరస్పర విరుద్ధంగా వుంటున్నాయో చెప్పడానికి ఈ మూడు తీర్పులూ ఉదాహరణ. న్యాయస్థానాలను సమాజానికి అతీతంగా లేదా వెలు పల వుంచి ఆలోచించటం సాధ్యం కాదు. న్యాయమూర్తులు చట్టాన్ని, న్యాయాన్ని అర్థం చేసుకున్న తీరునుబట్టి, వారి వారి సామాజిక అనుభవాలనుబట్టి తమ ముందుకొచ్చిన కేసుల్ని అన్వయించి తీర్పు చెబుతారు. అయితే ఆ తీర్పులు పురోగామి దృక్పథంతో వుంటే సమాజంలోవుండే దురభిప్రా యాలు సడలుతూ, అది క్రమేపీ మెరుగుపడే అవకాశం వుంటుంది. న్యాయమూర్తులు సైతం కులాధి క్యత, పురుషాధిక్యత, వివక్ష వంటి అంశాల చట్రాన్ని దాటకపోతే ఆ మేరకు సమాజం నష్టపోతుంది. మూడు కేసుల్లోని సారాంశమూ ఒకటే.
పెళ్లీడు వచ్చిన ఆడ–మగ జంటలు తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా వెలుపలికొచ్చి సహజీవనం సాగిస్తున్నారు. పెద్దవాళ్లనుంచి ఆ జంటలకు ప్రమాదం ముంచు కొచ్చింది. ముందుగా పోలీసులను ఆశ్రయించి, అక్కడ సరైన స్పందన లేదన్న ఆందోళనతో పంజాబ్, హరియాణా కోర్టును ఆశ్రయించారు. మొదటి కేసులో ఈనెల 11న తీర్పు వెలువడింది. తమకు పెద్దవాళ్లనుంచి ప్రాణహాని వున్నదని, రక్షణ కల్పించాలని కోరిన పిటిషన్ జస్టిస్ హెచ్‌ఎస్ మదాన్ నేతృత్వంలోని ధర్మాసనంముందుకు రాగా, ‘ఇలాంటి సంబంధాలు సామాజికంగానూ, నైతికంగానూ అంగీకరించదగ్గవి కాదు. అందువల్ల పిటిషనర్లు కోరుతున్నట్టు రక్షణ కోసం ఆదేశాలివ్వలేం’ అంటూ తోసిపుచ్చింది.
ఆ మర్నాడు ఈ మాదిరి కేసులోనే జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ నాయకత్వంలోని ధర్మాసనం ఇలాంటి కారణాన్నే చెప్పి భద్రత కల్పించాలన్న మరో జంట వినతిని తోసిపుచ్చింది. ‘ఇలాంటివారికి రక్షణ కల్పిస్తే మొత్తం సమాజ నిర్మాణమే చెదిరిపోతుంది’ అంటూ కొంత కటువుగానే న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కానీ మూడో కేసులో జస్టిస్ సుధీర్ మిత్తల్ నాయకత్వంలోని ధర్మాసనం గురువారం పూర్తి భిన్నమైన తీర్పునిచ్చింది. పెళ్లీడు వచ్చినవారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని పరస్పర అంగీకారంతో కలిసివుండొచ్చని...అది పెళ్లి ద్వారానా లేక మరోవిధంగానా అనేది పూర్తిగా వారి ఇష్ట మని, పౌరులుగా అది వారికుండే ప్రాథమిక హక్కని తేల్చిచెప్పింది. అంతేకాదు... వివాహంతో ప్రమేయం లేని సహజీవన సంబంధాలు వర్తమానకాలంలో నగరాల్లోనేకాక గ్రామాల్లో కూడా పెరుగు తున్నాయని న్యాయమూర్తి చెప్పారు. ఏ సంబంధాన్నీ చట్టం నిషేధించనప్పుడు అలాంటి సంబం ధాల్లో వుండేవారికి రక్షణ కల్పించాల్సిందేనని తేల్చిచెప్పారు.
మన దేశంలో పెద్దలకు నచ్చని పెళ్లి చేసుకుని న్యాయస్థానాలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. వ్యక్తులుగా ఇలాంటి సంబంధాల విషయంలో న్యాయమూర్తులకు ఎలాంటి అభిప్రాయాలున్నా అవి తీర్పుల్లో ప్రతిబింబించకుండా వుండటమే మేలు. ఎందుకంటే మన రాజ్యాంగం చాలా అంశాల్లో సమాజం ఆచరించే విలువలకు భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంది. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ వివక్ష లేని సమాజం ఏర్పడాలని రాజ్యాంగం ఆకాంక్షించింది. అందుకనుగుణమైన అధికర ణలు అందులో పొందుపరిచారు. పైగా మూడేళ్లక్రితం ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పును వెలువరించింది.
అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఆ ధర్మాసనం వ్యక్తి స్వేచ్ఛ, ప్రతిష్టల్లో ఎంపిక చేసుకోవటమన్నది విడదీయలేని భాగమని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం అనుసరించిన ఆ వైఖరి దేశంలోని మారుమూలవుండే కిందిస్థాయి కోర్టు వరకూ... పోలీసులు, పాలనా యంత్రాంగం తోసహా అన్ని వ్యవస్థలకూ శిరోధార్యమైనది. హరియాణా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ప్రేమించుకోవడం, స్వతంత్రంగా పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడటం యువతీయువకుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నదని శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. అయినా పంజాబ్, హరియాణా హైకోర్టులో రెండు ధర్మాసనాలు అందుకు విరుద్ధమైన తీర్పులివ్వడం విచారించదగ్గ విషయం.
ఈ మూడు జంటలూ తాము కలిసి బతకాలనుకుంటున్నామని, కానీ పెద్దవాళ్లు అందుకు నిరా కరించి ప్రాణహాని తలపెడతామని హెచ్చరిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించాయి. రక్షణ కల్పిం చాలని కోరాయి. న్యాయమూర్తులు ఆ పరిమిత అంశానికి లోబడి అలాంటి పౌరుల భద్రతకు అవసరమైన ఆదేశాలివ్వాలి. కానీ అందుకు భిన్నంగా నైతికత గురించి, తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వల్ల సమాజానికి ఏర్పడే ఉపద్రవం గురించి ఉపన్య సించి, రక్షణ కల్పించలేమని తిరస్కరించడం ప్రమాదకరమైన ధోరణి. వాస్తవానికి పంజాబ్, హరి యాణా, మరికొన్ని ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా చాలాచోట్ల ఈమాదిరి జంటలు నిత్యం ప్రాణభయంతో బతుకుతున్నాయి. ఇలాంటి ఉదంతాల్లో తల్లిదండ్రుల వల్లమాలిన ప్రేమ, కుల మత వివక్ష, ఆర్థిక కారణాలు వగైరాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అనేక ఉదంతాల్లో పోలీసులు సైతం ఈ ప్రభావాలకు లోనై ఆ జంటలకు రక్షణ కల్పించడానికి నిరాకరిస్తుంటారు. ఇక న్యాయస్థానాలు సైతం అదే దృక్పథాన్ని ప్రదర్శిస్తే సమాజం ఎప్పటికీ వెనకబాటుతనాన్నే ప్రదర్శిస్తుంది. అది అవాంఛనీయం.
Comments
Please login to add a commentAdd a comment