పోదాం పద... వన జాతరకు
♦ నేటి నుంచి మేడారం జాతర
♦ సాయంత్రం గద్దెలపైకి రానున్న సారలమ్మ
♦ గోవిందరాజులు, పగిడిద్దరాజులు సైతం...
♦ ఇప్పటికే 32 లక్షల మంది మొక్కులు
గత జాతరలో కోటి మంది
2014 జాతరకు కోటి మంది భక్తులు వచ్చారు. ప్రస్తుత జాతరలో ఇప్పటికే 32 లక్షల మంది భక్తులు మేడారంలో మొక్కులు సమర్పించుకున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భారీగా భక్తులు రానున్నారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్: వనం జనంతో నిండుతోంది. మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారం చేరుకుంటున్నారు. సారలమ్మ మేడారంలోని గద్దెపై కొలువుదీరే గడియలు దగ్గరపడుతున్నాయి. వన దేవతల వడ్డెలు(పూజారులు) దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలవుతుంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతరం ఆదివాసీ పూజారులు, వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్, ములుగు ఏఎస్పీలు కలసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే... పూజారులు, అధికారులు కలిసి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల పడిగిద్దరాజును మేడారం గద్దెల వద్దకు చేరుస్తారు. వరాల తల్లిగా కొలిచే సమ్మక్క గురువారం మేడారం గద్దెలపై చేరనుంది. ఇద్దరు వన దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. వన దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో శనివారం జాతర ముగుస్తుంది.
భారీ ఏర్పాట్లు...
మేడారం జాతరకు ఈసారి కోటీ పది లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,605 బస్సులను నడుపుతోంది. జాతర నిర్వహణ కోసం 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సాంకేతికంగా ఉపయోగపడేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. జంపన్న వాగుకు ఇరు వైపులా 3.6 కిలో మీటర్ల పొడవున స్నానఘట్టాలను నిర్మించారు. వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధం చేసింది.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో..
దేవాదాయ శాఖ పలు కొత్త నిర్ణయాలను తీసుకుంది. దర్శనం, ఎత్తు బంగారం, క్యూలైను ఏర్పాటు చేసింది. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వచ్చే అన్ని వర్గాల భక్తులకు పూర్తి ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. రూ.100 ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసింది. మొత్తం ఐదు క్యూలైన్లు ఉచిత దర్శనం కోసమే ఉండనున్నాయి. వికలాంగుల కోసం, వీవీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. భక్తులు మొక్కుల రూపంలో వనదేవతలకు బెల్లం(బంగారం) సమర్పించే ప్రక్రియను ఈసారి పూర్తిగా ఉచితం చేసింది. గతంలో దేవతలకు బెల్లం మొక్కు సమర్పించేందుకు రూ.1,116 రుసుముతో టికెట్ ఉండేది. ప్రస్తుత జాతరలో ఈ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా మార్చారు.