టీటీడీ బడ్జెట్ రూ.2,678 కోట్లు | TTD budget of Rs .2,678 crore | Sakshi
Sakshi News home page

టీటీడీ బడ్జెట్ రూ.2,678 కోట్లు

Published Sun, Jan 31 2016 5:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

టీటీడీ బడ్జెట్ రూ.2,678 కోట్లు

టీటీడీ బడ్జెట్ రూ.2,678 కోట్లు

♦ 2016-17 వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం
♦ రూ.వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు
♦ రూ.18 కోట్లతో మహామణి మండపం
♦ ఆర్జితసేవల టికెట్ల ధరల పెంపు వాయిదా
 
 సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.2,678 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.2,530 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి (2015-16) పెరిగిన అంచనాలతో కలిపి మొత్తం రూ.2,621 కోట్లతో ముగించారు. శనివారం తిరుమలలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదిత బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్, జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుమలేశుని ఆర్జిత సేవలు, వీఐపీ టికెట్ల ధరల పెంపు వాయిదా పడింది. ధరల పెంపు లడ్డూలకు కూడా ముడిపడి ఉండటంతో వెనువెంటనే పెంచటం వల్ల ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో చైర్మన్, ఈవో వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

 ముఖ్యమైన తీర్మానాలు
► వేయికాళ్ల మండపం నిర్మాణానికి కొత్త డిజైన్లతో రూ.18 కోట్ల అంచనాలతో మండపం నిర్మించేందుకు టెండర్లు ఖరారు
► శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి రూ.10లక్షల ఖర్చుతో బంగారు తాపడం పనులు
► ఇతర ప్రాంతాల్లో శ్రీవారి వైభవోత్సవాలను తొమ్మిది నుంచి ఐదు రోజులకు కుదింపు
► తిరుపతి కోదండరామాలయంలో ప్రతి అమావాస్యరోజున హనుమంత వాహన సేవ
► అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద యాత్రీసదన్ నిర్మాణానికి రూ.4.90 కోట్ల టెండరు పనులు, ప్రకాశం జిల్లా జారుగుమల్లి మండపం పచ్చవ గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.22.5 లక్షలు కేటాయించారు.  
 
 వసూళ్ల అంచనా
 2016-17లో హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు రూ.1,010 కోట్లురావచ్చని అంచనా వేశారు. పెట్టుబడులపై వడ్డీ రూ.778.93 కోట్లు, రూ.500 వీఐపీ దర్శనం, రూ.50 సుదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టి కెట్ల విక్రయం ద్వారా రూ.209 కోట్లు, ఆర్జితసేవా టికెట్ల ద్వారా రూ.55 కోట్లు, లడ్డూ, ఇతర ప్రసాదాల విక్రయంతో రూ.175 కోట్లు, గదుల అద్దె వసూళ్లతో రూ.114.5 కోట్లు రావొచ్చని అంచనా వేశారు. తలనీలాల విక్రయం ద్వారా రూ.150 కోట్లు, దుకాణాలు, జనతా హోటళ్ల అద్దెలు, టోల్‌గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 133.25 కోట్లు రావొచ్చని అంచనావేశారు.
 
 వ్యయాల అంచనా
 ఉద్యోగులు (రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్) జీతాల కోసం రూ.500 కోట్లు, పెట్టుబడులకు రూ.757.06 కోట్లు, ఆలయాలకు సరుకుల కొనుగోళ్లు రూ.320 కోట్లు, ఇతర కొనుగోళ్లు రూ.42.60 కోట్లు, పెన్షన్ ట్రస్టుకు రూ.120 కోట్లు, పెన్షన్ ఫండ్‌కు రూ.75 కోట్లు కేటాయించారు. గ్రాంట్లు రూ.165.50 కోట్లు, స్థిరాస్తులు, ఔట్ సోర్సింగ్ ఖర్చులు రూ.199.25 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.55 కోట్లు, స్థిరాస్తుల నిర్వహణ ఖర్చులు రూ.80.20 కోట్లు, ఇతర చిల్లర ఖర్చులు రూ.129.96 కోట్లు కేటాయించారు. ఇంజనీరింగ్ పనుల కోసం రూ.160 కోట్లు, హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలకు రూ.121 కోట్లు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement