chadalavada krishna murthy
-
టీటీడీ పాలకవర్గ సమావేశం ప్రారంభం
టీటీడీ పాలకవర్గ సమావేశం మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య సమావేశ మందిరంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ప్రధాన ఎజెండాగా రానుంది. -
హుండీకి సీలువేయడంలో నిర్లక్ష్యం
-శ్రీవారి ఆలయ అధికారులపై మండిపడ్డ టీటీడీ చైర్మన్ - విజిలెన్స్ విచారణకు ఆదేశం సాక్షి, తిరుమల భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ముడుపులు, కానుకల రూపంలో చెల్లించిన హుండీ భద్రపరిచే విషయంలో తిరుమల ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. కానుకలతో నిండిన హుండీకి ఆలయ నిబంధనల ప్రకారం సీలు వేయకుండా వదిలేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. దీనిపై టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆలయంలో రోజూ రూ.2 నుండి 3.5 కోట్ల వరకు హుండీ (కొప్పెర) కానుకలు లభిస్తున్నాయి. ఇలా ఏటా టీటీడీకి రూ.వెయ్యికోట్ల నగదు, రూ.300 కోట్ల విలువైన బంగారు, వెండి, ఇతర ఆస్తులు లభిస్తున్నాయి. భక్తుల రద్దీ బట్టి ఆలయంలో 7 నుండి 10 హుండీలు కానుకలతో నిండుతుంటాయి. ఇలా కానుకలతో నిండిన హుండీని సోమవారం ఉదయం 10.20 గంటలు తొలగించి, దానిస్థానంలో కొత్త హుండీ ఏర్పాటు చేశారు. తొలగించిన హుండీని ఆలయ నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో ఉన్న సంబంధిత ఆలయ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో హుండీకి తాడుతో గట్టిగా కట్టాలి. అధికారితోపాటు భక్తుల సమక్షంలో లక్కతో ఆలయ అధికారిక సీలు వేయాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు పాటించలేదు. నిర్లక్ష్యంగా కేవలం జనపనార పురిదారంతో హుండీని చుట్టి పక్కన పెట్టేశారు. తర్వాత ఉదయం 11.20 గంటలకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హుండీ వద్దకు వచ్చి కానుకలు సమర్పించారు. సమీపంలోనే నిండిన హుండీ సీలు లేకుండా , కేవలం పురిదారంతో మాత్రమే ఉండటాటాన్ని గుర్తించారు. ఈ ఘటనపై చైర్మన్ సంబంధిత ఆలయ అధికారులపై మండిపడ్డారు. వీఎస్వో రవీంద్రారెడ్డిని అక్కడికి పిలిపించి జరిగిన సంఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. భక్తులు సమర్పించే కానుకల్లోనూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? అంటూ అక్కడి సిబ్బందిని మందలించారు. భక్తులు సమర్పించే కానుకలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. హుండీ కానుకలు భద్రత, లెక్కింపుల్లో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక సూచనలు చేసినప్పటికీ ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించటం గమనార్హం. -
షుగర్ ఫ్యాక్టరీ వద్ద టీటీడీ ఛైర్మన్ హల్చల్
తిరుపతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకలకు పాల్పడుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో సాక్షాత్తూ టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఆయన అనుచరులు హల్చల్ సృష్టించారు. నిండ్రలోని ప్రొడన్షియల్ షుగర్ ఫ్యాక్టరీపై చదలవాడ, ఆయన అనుచరులు గురువారం దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షుగర్ ఫ్యాక్టరీ తాళాలు పగులగొట్టి లోపలికి చొచ్చుకెళ్లిందుకు యత్నించడంతో పాటు గెస్ట్‌హౌస్ అద్దాలు ధ్వంసం చేశారు. చదలవాడ, తన అనుచరులతో గెస్ట్హౌస్లోనికి ప్రవేశించి తిష్ట వేశారు. కవరేజికి వెళ్లిన మీడియా సిబ్బందిపై చదలవాడ అనుచరుల దాడికి దిగారు. దీనిపై ఫ్యాక్టరీ సిబ్బంది నగరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా ఆయన దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్ తీరుపై ఫ్యాక్టరీ సిబ్బంది, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. -
జూబ్లీహిల్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
టీటీడీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లో శ్రీవారి దేవాలయం నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులకు టీటీడీ పాలక మండలి సభ్యులు కె. రాఘవేంద్రరావు, చింతల రాంచంద్రారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సుచరిత, అరికెల నర్సారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది వ్యవధిలో ఇక్కడ శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. తిరుమలలో జరిగే ప్రతి వేడుకలాగే ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తిరుమలలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని గత కొన్ని నెలల నుంచి తిరుమల భక్త జనసందోహంతో ఊటీలా కిటకిటలాడుతున్నదని అన్నారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగించడమే లక్ష్యంగా సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. తిరుమలలో తెల్లవారుజామున 3 గంటలకు పూజలు ప్రారంభమైనట్టుగానే జూబ్లీహిల్స్ ఆలయంలో కూడా ఆ తరహాలో ప్రారంభమవుతాయని చెప్పారు. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు టీటీడీ చేస్తున్న కషిని కొనియాడారు. భావితరాలకు వేదాలను అందించేందుకు తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. కురుక్షేత్ర, కన్యాకుమారిలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, తెలంగాణ ప్రాంత సలహా మండలి చైర్మన్ చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ తన నియోజక వర్గంలో భారీ ఎత్తున శ్రీవారి ఆలయం నిర్మితం కావడం ఆనందంగా ఉందన్నారు. తాను చెప్పగానే నిధులు మంజూరు చేయించి ఆలయ భూమి పూజకు విచ్చేసిన చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం నిర్మాణంతో జూబ్లీహిల్స్‌కే ఆధ్యాత్మిక శోభ వస్తుందని పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్‌లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అరికెల నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, చింతల రామచంద్రరారెడ్డి హాజరయ్యారు. -
టీటీడీ బడ్జెట్ రూ.2,678 కోట్లు
♦ 2016-17 వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం ♦ రూ.వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు ♦ రూ.18 కోట్లతో మహామణి మండపం ♦ ఆర్జితసేవల టికెట్ల ధరల పెంపు వాయిదా సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.2,678 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.2,530 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి (2015-16) పెరిగిన అంచనాలతో కలిపి మొత్తం రూ.2,621 కోట్లతో ముగించారు. శనివారం తిరుమలలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదిత బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుమలేశుని ఆర్జిత సేవలు, వీఐపీ టికెట్ల ధరల పెంపు వాయిదా పడింది. ధరల పెంపు లడ్డూలకు కూడా ముడిపడి ఉండటంతో వెనువెంటనే పెంచటం వల్ల ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో చైర్మన్, ఈవో వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యమైన తీర్మానాలు ► వేయికాళ్ల మండపం నిర్మాణానికి కొత్త డిజైన్లతో రూ.18 కోట్ల అంచనాలతో మండపం నిర్మించేందుకు టెండర్లు ఖరారు ► శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి రూ.10లక్షల ఖర్చుతో బంగారు తాపడం పనులు ► ఇతర ప్రాంతాల్లో శ్రీవారి వైభవోత్సవాలను తొమ్మిది నుంచి ఐదు రోజులకు కుదింపు ► తిరుపతి కోదండరామాలయంలో ప్రతి అమావాస్యరోజున హనుమంత వాహన సేవ ► అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద యాత్రీసదన్ నిర్మాణానికి రూ.4.90 కోట్ల టెండరు పనులు, ప్రకాశం జిల్లా జారుగుమల్లి మండపం పచ్చవ గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.22.5 లక్షలు కేటాయించారు. వసూళ్ల అంచనా 2016-17లో హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు రూ.1,010 కోట్లురావచ్చని అంచనా వేశారు. పెట్టుబడులపై వడ్డీ రూ.778.93 కోట్లు, రూ.500 వీఐపీ దర్శనం, రూ.50 సుదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టి కెట్ల విక్రయం ద్వారా రూ.209 కోట్లు, ఆర్జితసేవా టికెట్ల ద్వారా రూ.55 కోట్లు, లడ్డూ, ఇతర ప్రసాదాల విక్రయంతో రూ.175 కోట్లు, గదుల అద్దె వసూళ్లతో రూ.114.5 కోట్లు రావొచ్చని అంచనా వేశారు. తలనీలాల విక్రయం ద్వారా రూ.150 కోట్లు, దుకాణాలు, జనతా హోటళ్ల అద్దెలు, టోల్గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 133.25 కోట్లు రావొచ్చని అంచనావేశారు. వ్యయాల అంచనా ఉద్యోగులు (రెగ్యులర్, ఔట్సోర్సింగ్) జీతాల కోసం రూ.500 కోట్లు, పెట్టుబడులకు రూ.757.06 కోట్లు, ఆలయాలకు సరుకుల కొనుగోళ్లు రూ.320 కోట్లు, ఇతర కొనుగోళ్లు రూ.42.60 కోట్లు, పెన్షన్ ట్రస్టుకు రూ.120 కోట్లు, పెన్షన్ ఫండ్‌కు రూ.75 కోట్లు కేటాయించారు. గ్రాంట్లు రూ.165.50 కోట్లు, స్థిరాస్తులు, ఔట్ సోర్సింగ్ ఖర్చులు రూ.199.25 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.55 కోట్లు, స్థిరాస్తుల నిర్వహణ ఖర్చులు రూ.80.20 కోట్లు, ఇతర చిల్లర ఖర్చులు రూ.129.96 కోట్లు కేటాయించారు. ఇంజనీరింగ్ పనుల కోసం రూ.160 కోట్లు, హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలకు రూ.121 కోట్లు కేటాయించారు. -
వేయికాళ్ల మండపం నమూనాలు సిద్ధం
సాక్షి, తిరుమల: పునః నిర్మాణానికి వేయికాళ్ల మండపం నమూనాల చిత్రాలు సిద్ధమయ్యాయి. శ్రీవారి ఆలయం వద్ద చారిత్రాత్మక కట్టడమైన వేయికాళ్ల మండపాన్ని 2003లో కూల్చివేసిన సంగతి తెలిసిందే. అనేక వివాదాల అనంతరం ఈ మండపాన్ని ఆలయానికి నైరుతి దిశలోని నారాయణగిరి ఉద్యావనంలో పున ః నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త వేయికాళ్ల మండపంలోనే శ్రీపద్మావతి పరిణయోత్సవం వంటి ఉత్సవాల నిర్వహిస్తారు. మండపం చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక, భక్తి భావాలు స్పృశించేలా నిర్మించాలని అధికారులు సంకల్పించారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థలతో పలు నమూనాలు రూపొందింపచేశారు. దీనిపై శనివారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, చీఫ్ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి తదితరులు చర్చించారు. తుది నమూనాను త్వరలోనే ఖరారు చేయనున్నారు. -
చదలవాడ చైర్మన్‌గా టీటీడీ నిర్ణయాలు
తిరుమల: అలిపిరి సమీపంలో తలనీలాల గిడ్డంగి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తలనీలాల కోసం కోటి 50 లక్షల రూపాయలతో బ్లేడ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తిరుమలలో నీటి కొరత లేకుండా చేయాలని తీర్మానించినట్లు చదలవాడ తెలిపారు. -
టీటీడీ చైర్మన్‌గా చదలవాడ!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని నియమించనున్నట్లు సమాచారం. చదలవాడ కృష్ణమూర్తిని ఏడాది కాలానికి నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి అత్యంత సన్నిహితుడైన బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి జి. భానుప్రకాష్‌రెడ్డిని పాలక మండలి సభ్యుడిగా నియమించడం కూడా దాదాపుగా ఖరారైంది. తొలుత భానును తుడా చైర్మన్‌గా నియమించి, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ, తుడాను మరొకరికి ఇచ్చేందుకు వీలుగా భానును బోర్డు సభ్యుడిగా నియమించడానికి చంద్రబాబు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తిరుపతికి చెందిన టీడీపీ నాయకుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కూడా బోర్డు సభ్యత్వం కోసం సినీ నటుడు పవన్ కల్యాణ్ ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరితోపాటు సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు, టీటీడీ మాజీ జేఈవో పి, బాలసుబ్రమణ్యంకు బోర్డులో చోటు ఖరారైనట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత చైర్మన్ కనుమూరి బాపిరాజు.. తన పదవీ కాలం వచ్చే నెల 25వ తేదీ వరకు ఉన్నందున అప్పటిదాకా కొనసాగించాలని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి, తన బంధువు ద్వారా చంద్రబాబుకు విన్నవించుకున్నట్లు సమాచారం. ఇక ఇటీవలే హస్తానికి చేయిచ్చి, సైకిల్ ఎక్కిన ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా టీటీడీ చైర్మన్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆయన ఇప్పటికే చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇక టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా ఈ పోస్ట్ పై ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)