టీటీడీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లో శ్రీవారి దేవాలయం నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులకు టీటీడీ పాలక మండలి సభ్యులు కె. రాఘవేంద్రరావు, చింతల రాంచంద్రారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సుచరిత, అరికెల నర్సారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది వ్యవధిలో ఇక్కడ శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. తిరుమలలో జరిగే ప్రతి వేడుకలాగే ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
తిరుమలలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని గత కొన్ని నెలల నుంచి తిరుమల భక్త జనసందోహంతో ఊటీలా కిటకిటలాడుతున్నదని అన్నారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగించడమే లక్ష్యంగా సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. తిరుమలలో తెల్లవారుజామున 3 గంటలకు పూజలు ప్రారంభమైనట్టుగానే జూబ్లీహిల్స్ ఆలయంలో కూడా ఆ తరహాలో ప్రారంభమవుతాయని చెప్పారు. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు టీటీడీ చేస్తున్న కషిని కొనియాడారు. భావితరాలకు వేదాలను అందించేందుకు తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
కురుక్షేత్ర, కన్యాకుమారిలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, తెలంగాణ ప్రాంత సలహా మండలి చైర్మన్ చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ తన నియోజక వర్గంలో భారీ ఎత్తున శ్రీవారి ఆలయం నిర్మితం కావడం ఆనందంగా ఉందన్నారు. తాను చెప్పగానే నిధులు మంజూరు చేయించి ఆలయ భూమి పూజకు విచ్చేసిన చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం నిర్మాణంతో జూబ్లీహిల్స్‌కే ఆధ్యాత్మిక శోభ వస్తుందని పేర్కొన్నారు.