వేంకటేశ్వరునికే శఠగోపం...
Published Wed, Aug 24 2016 6:42 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
- అక్రమ మార్గంగా డబ్బులు వసూలు కల్యాణ మండపం నిర్వాహకులు
- పదినెలలుగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించని వైనం
- నిబంధనలకు విరుద్దంగా పలు ఎగ్జిబిషన్‌ల ఏర్పాటు..
సాక్షి,సిటీబ్యూరో:
కలియుగ దైవం వేంకటేశ్వరునికీ అక్రమార్కులు శఠగోపం పెట్టారు. హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో ఈ అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా మండపాన్ని పలు ఎగ్జిబిషన్లకు అద్దెకిస్తూ ఇటు టీటీడీ ఖజనాకు అటు భక్తుల జేబులకు చిల్లుపెడుతున్నారు. దీనిని నిరోధించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి మిన్నకుండిపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలిలా.. తితిదే కల్యాణ మండపంలో నిబంధనలకు విరుద్ధంగా పలు ఎగ్జిబిషన్‌లకు అద్దెకిస్తోన్న ఓ సంస్థ ఆయా ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో స్టాల్ నుంచి రోజుకు రూ.1000 అద్దె వసూలు చేస్తోంది. ఇలా ఒక్కొ ఎగ్జిబిషన్‌లో 30నుంచి 40స్టాల్స్ ఉంటాయి ఇవి నెలలో సుమారు పక్షం రోజుల పాటు నడుస్తాయి.
దీంతో ఆయా స్టాళ్ల నిర్వాహకుల నుంచి నెలకు రూ.5 నుంచి 6 లక్షలు వసూలు చేయడంతోపాటు ఈ అక్రమార్జనలో టీటీడీ అధికారులకు సైతం మామూళ్లు ముట్టజెబుతుండడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఆలయాలు, వాటికి అనుసంధానంగా కల్యాణమండపాలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ అంతా టీటీడీ నుంచే కొనసాగుతుంది. నిబంధనల ప్రకారం కల్యాణ మండపాలను ఆలయానికి సంబంధించిన అధికారులే నిర్వహించాలి. అయితే హిమాయత్‌నగర్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. అక్రమ మార్గంలో లక్షలు వెచ్చించి పై స్థాయిలో పైరవీలు నడిపి ఎస్.వైష్ణవి’ లెసైన్స్ పేరుతో ఓ వ్యక్తి రూ.63.14 లక్షలు చెల్లించి కల్యాణ మండప నిర్వహణ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.
ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కల్యాణ మండపాన్ని పలు ఎగ్జిబిషన్లకు అద్దెకిస్తూ పెట్టిన పెట్టుబడికి నాలుగురెట్లు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సేవాపన్నుకూ ఎగనామమే..! వైష్ణవి పేరుతో 2015అక్టోబర్ 22వ తేదీన టిటిడి లెసైన్సును మంజూరు చేసింది. అయితే కల్యాణ మండపంను నిర్వహిస్తున్నందుకు గాను టిటిడి నిబంధనల ప్రకారం ప్రతి నెలా సేవాపన్ను చెల్లించాల్సి ఉంది. పది నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఈ పన్ను చెల్లించలేదు. టిటిడి అధికారులు లెసైన్సుదారులను ప్రశ్నిస్తే తన పేరుపై లెసైన్సు నంబర్ ఉంది కాబట్టి నేను కట్టాల్సిన అవసరం లేదని మొండికేయడం గమనార్హం. ఇద్దరి మధ్య వైరంతో దేవుని ఖాతాలో జమ కావాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబులు నింపుతోందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇంజినీరింగ్ అధికారి ఏమంటున్నారంటే... టిటిడి కల్యాణ మండపంలో బహిరంగంగా జరుగుతోన్న ఈ అవినీతిభాగోతంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.చంద్రశేఖర్‌ను..సాక్షి’ ప్రశ్నించగా అడ్డగోలుగా వసూలు చేస్తున్న విషయం తమ దష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. సర్వీస్ ట్యాక్స్‌ను చెల్లించే విషయంలో ఉన్నత అధికారులు సైతం కఠినంగా ఉన్నారన్నారు.
Advertisement