రాష్ర్ట ఆదాయానికి స్టార్ హోటల్స్ గండి | Star hotel in the state 's income shrinking | Sakshi
Sakshi News home page

రాష్ర్ట ఆదాయానికి స్టార్ హోటల్స్ గండి

Published Thu, Aug 4 2016 11:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

రాష్ర్ట ఆదాయానికి స్టార్ హోటల్స్ గండి - Sakshi

రాష్ర్ట ఆదాయానికి స్టార్ హోటల్స్ గండి

సాక్షి, సిటీబ్యూరో: హోటల్‌లో ఆహారం తిన్నందుకు కస్టమర్‌ నుంచి వసూలు చేస్తున్న సేవా పన్ను (సర్వీస్‌ ట్యాక్స్‌) ప్రభుత్వానికి చేర డం లేదు. ఇలా పన్ను కట్టని ప్రముఖ రెస్టారెంట్లు నగరంలో చాలానే ఉన్నాయి. ఇవి చెల్లించాల్సిన పన్ను బకాయిల మొత్తం రూ.100 కోట్లకు పైనే. మరికొన్ని సంస్థలైతే కనీసం ఈ విభాగం వద్ద రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోలేదు.

ఈ అంశాలను సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగం తీవ్రంగా పరిగణించింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇలాంటి హోటళ్లపై సేవల పన్ను (ఎస్టీ) విభాగం చర్యలకు సిద్ధమైంది. ఆయా సంస్థల జాబితా సిద్ధం చేసిన అధికారులు దాడులకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా యాజమాన్యాల్లో ‘అర్హులైన’ వారిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది.

కమర్షియల్‌ సేవలన్నీ ‘ఎస్టీ’ పరిధిలోకి..
వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్స్‌ ఇచ్చే బిల్లులో వస్తువు విలువకు అదనంగా ‘సర్వీసు ట్యాక్స్‌’ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్‌ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. కానీ చాలా సంస్థలు అందుకు దూరంగా ఉంటున్నాయి.

రెస్టారెంట్స్‌కు 5.6 శాతం పన్ను
సాధారణంగా వాణిజ్య సేవలు చేసేవారు విక్రయించే వస్తు విలువకు అదనంగా 14 శాతం (సెస్‌తో 15 శాతం) సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు. అయితే రెస్టారెంట్స్‌లో ఆహారం, పానీయాలు సరఫరా చేస్తుండడం, వాటి రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటికి సర్వీస్‌ ట్యాక్స్‌ 5.6 శాతంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు జంట నగరాల్లోని 1500 రెస్టారెంట్లు సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగంలో రిజిస్టర్‌ చేయించుకోవడంతో పాటు వార్షిక రిటర్న్స్‌ దాఖలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని రెస్టారెంట్ల ఆర్థిక లెక్కలు పక్కాగా లేవని, వినియోగదారుడి నుంచి వసూలు చేసిన సర్వీస్‌ ట్యాక్స్‌ మొత్తాన్ని ఎస్టీ విభాగానికి విభాగానికి చెల్లించట్లేదని అధికారులు గుర్తించారు. మరికొన్ని రెస్టారెంట్లు కనీసం రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకోలేదని తేల్చారు.

‘ఏసీ’ ఉంటే ‘ఎస్టీ’ వర్తింపు
సిటీలో ఉన్న ప్రతి రెస్టారెంట్‌ ఎస్టీ పరిధిలోకి రాదు. కేవలం ఎయిర్‌ కండిషన్డ్‌ (ఏసీ) సదుపాయం ఉన్నవే సర్వీస్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయి. ఏసీ రెస్టారెంట్‌లోని నాన్‌–ఏసీ భాగంలో కూర్చుని ఆహారం స్వీకరించినవారి నుంచి సైతం సర్వీసు ట్యాక్స్‌ వసూలు చేయవచ్చు. నగరంలో ఉన్న ఆయా రెస్టారెంట్లు ఏటా సరైన రిటర్న్స్‌ దాఖలు చేయట్లేదని, లెక్కల్లో చెప్పిన మొత్తాన్ని సర్వీసు ట్యాక్స్‌గా చెల్లించట్లేదని సేవల పన్ను విభాగం అనుమానించింది. ఆయా యాజమాన్యాలకు చెందిన ఆదాయ పన్ను రిటర్న్‌్సతో పాటు బ్యాంక్‌ లావాదేవీలను సేకరించి విశ్లేషించింది. తీవ్రస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో ఎస్టీ విభాగం ‘వాంటెడ్‌’ జాబితాలను రూపొందించింది.

‘పరిమితి’ దాటితే జైలుకే...
వీటిలో ఇప్పటికే బంజారాహిల్స్, పంజగుట్టల్లో ఉన్న రెండు ప్రముఖ రెస్టారెంట్స్‌పై సర్వీస్‌ ట్యాక్స్‌ అధికారులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడలో ఉన్న మరో మూడు ప్రముఖ రెస్టారెంట్స్‌ లావాదేవీలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. భారీ బకాయిదారులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో వీరి జాబితాను సిద్ధం చేసిన విభాగం అధికారులు ఆయా సంస్థలు, వ్యక్తులకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు.

ఆర్థిక చట్ట ప్రకారం రూ.2 కోట్లకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అధికారం కూడా సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలో సమన్లకు స్పందించని వారిపై వరుస దాడలు చేయడంతో పాటు అరెస్టులు చేయాలని నిర్ణయించారు. వచ్చే వారం నుంచి రెస్టారెంట్స్‌పై సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగం వరుస దాడులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement