అలంకరణ ప్రియులను ఆకట్టుకుంటున్న ఆకృతులు
కోర్సులు నేర్చుకోవడానికి నగరవాసుల ఆసక్తి
పర్యాటకం, స్టార్ హోటల్స్, ఉన్నత శ్రేణి ఇళ్లల్లో
ప్రపంచంలోని అద్భుతమైన ప్రకృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఇకెబనా కళకు హైదరాబాద్‌లో విశేష ఆధరణ లభిస్తోంది. జపాన్‌కు చెందిన ఈ కళ ప్రస్తుతం నగరంలో ట్రెండ్‌గానూ మారుతోంది. పర్యాటక ప్రాంతాలు, స్టార్ హోటల్స్, ఉన్నత శ్రేణి కుటుంబాల గృహాలంకరణ, శుభకార్యాలు, ఈవెంట్స్ ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేకమైన ఇకెబనా అలంకరణకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరంలోని కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఉపాధి కోణంలోనే కాకుండా అధిక సంఖ్యలో సంపన్న వర్గాల కుటుంబాలకు చెందిన మహిళలు తమ గృహాలంకరణ కోసం ఈ కళను నేర్చుకుంటున్నారు. ఇందుకోసం దేశ, విదేశాల నుంచి ప్రత్యేకమైన పూలను దిగుమతి చేసుకుంటారు. దీంతోపాటు మన పెరట్లో లభించే పూలు, మొక్కలతో సులభమైన పద్దతుల్లో అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో భాగ్యనగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి, స్టార్ హోటల్స్ వంటి ప్రదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న కళ ఇకెబనా. అయితే అధిక శాతం మంది తమ ఇంటిని అలంకరించుకోవడంలోనూ ఈ కళకు పదుపు పెడుతున్నారు. దీంతో పాటు పలువురు తమ ఆర్థికి స్థితిగతులకు సాయపడుతుందని, ఈ ఆకృతులు మనస్సుకు ఎంతగానో ప్రశాంతత ఇస్తున్నాయని మరి కొందరు ఈ కళపై మక్కువ పెంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభించే ప్రతి వస్తువుతోనూ ఈ ఆర్ట్‌లో అలంకరించొచ్చు. ప్రత్యేకించి ఈ వస్తువులే ఉండాలన్న నిబంధనలేమీ లేవు.
వృథాను అరికట్టే కళ..
వివిధ ఆకృతుల కోసం చెట్లను కొట్టేయడం, పూలను వృథా చేయడం వంటివాటికి స్వస్తిపలకాలని, ఉన్న వాటితోనే కనువిందైన ఆకృతులను తయారు చేయవచ్చంటున్నారు పలువురు ఆర్టిస్టులు. జపాన్‌కు చెందిన ఇకెబనా ఆర్ట్‌కు సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్‌లో గత 35 ఏళ్లుగా ఈ కళకు మంచి ఆదరణ లభిస్తోంది. కరోనా సమయంలో కాస్త నెమ్మదించినా, ప్రస్తుతం కళాకారులకు డిమాండ్ పెరిగింది. జపాన్‌కు చెందిన ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకెబానా సరి్టఫికెట్ కోర్సులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశంలో సబ్ గ్రాండ్ మాస్టర్లు నలుగురు ఉండగా అందులో ఓ ప్రముఖ మాస్టర్ మన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి రేఖారెడ్డి కావడం గమనార్హం.
ఆకులు, పూలతో సులువుగా..
నగరంలో ఇకెబనా ఆర్ట్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది హాబీ కోసం నేర్చుకుంటున్నారు. కళ విలువ తెలుసుకుంటున్నారు. ఆకులు, పూలతో ఇంత సులువుగా తయారు చేసిన ఆకృతులతో మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా ఆస్వాదించొచ్చనేది తెలుస్తుంది. మన సంప్రదాయం ప్రకారం ప్రకృతిలోని చెట్టు, పుట్టలను పూజిస్తాం. జపానీస్ కూడా అలాగే చేస్తారని పలువురు ఆరి్టస్టులు చెబుతున్నారు.
ఇంటికోసం..ఇష్టంగా..
‘ఇండియన్ రీసెర్చ్ అసిస్టెంట్ షిప్ దొరకాలన్నా చాలా కష్టమైన టాస్క్ ఉండేది. హారీ్టకల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఆర్ట్ ఒక భాగం. ఆ క్లాస్‌కి రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశాను. ఎన్ని గంటలు పనిచేస్తే దానికి అన్ని డబ్బులు వచ్చేవి. ప్రిపరేషన్ మెటీరియల్, క్లాస్‌లో సాయం వంటివి చేస్తుండేదాన్ని.. 2019లో హైదరాబాద్ వచ్చేశాక ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. నాకు సమయం చిక్కినపుడు ఇష్టమున్న ఆర్ట్‌ని ఇంట్లోనే ఎరేంజ్ చేస్తుంటాను. ఊరెళ్లినపుడు జొన్నలతో తయారు చేస్తాను. దేనితో అయినా ఈ ఆర్ట్ తయారు చేయొచ్చు. ఇంటిని అందంగా తయారు చేయడం, ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంటాను. నేను నేర్చుకున్న తొలినాళ్లలో పూలు కొనుగోలుచేసి కళాకృతిని తయారు చేసేదాన్ని.. అయితే ఇది అంత సులువు కాదు. ప్రస్తుతం ఫ్లవర్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. అవసరానికి మనకు పూలు దొరుకుతున్నాయి. అలా కాకుండా మన దగ్గర ఉన్న వాటితోనే మంచిగా డిజైన్ చేయొచ్చన్నది అలవాటైంది. మా నాన్నకి గార్డెనింగ్ ఇష్టం. ఎక్కడైనా కొంత మెటీరియల్ తెచ్చేవారు. దాన్ని నేను వినియోగించేదాన్ని’ అని చెప్పుకొచ్చారు నగరానికి చెందిన ఆరి్టస్ట్ దివ్య.
50 శాతం ఫీజు రాయితీ..
ఇకెబనా ఆర్ట్‌ని ఇంజినీరింగ్ చదివే సమయంలోనే నేర్చుకున్నాను. ఎప్పటికైనా ఉపయోగపడుతుందన్నారు. కోర్సుపూర్తి చేసి, జపాన్ నుంచి సరి్టఫికెట్స్ తీసుకున్నాను. వారాంతాల్లో, లేదా కుదిరినప్పుడు ఇంట్లో కళాకృతులు తయారు చేయడం అలవాటుగా మారింది. ఎగ్జిబిషన్స్ జరిగినపుడు పాల్గొనడం, మా గురువుకు సహకరించడం చేశాను. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లిపోయాను. మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సులో రీసెర్చ్ అసిస్టెంట్ స్కాలర్ కోసం హార్టీకల్చర్ విభాగం అధికారులు నాకున్న సరి్టఫికెట్స్, ఎగ్జిబిషన్ ఫొటోలు చూసి ఇంప్రెస్ అయ్యారు. ఉద్యోగం ఇచ్చారు. నాకున్న ఇకెబనా ఆర్ట్ సరి్టఫికెట్‌తో కోర్సు ఫీజులో సుమారు 50 శాతం తగ్గించారు. ఇది పెద్ద ఊరట కల్పించింది.
– దివ్య, హైదరాబాద్
ఏటా ఐదురోజుల వర్క్ షాప్..
ఇకెబనా ఆర్ట్‌ను ఇంట్లోనే నేర్చుకోవచ్చు. నా దగ్గర వైద్యులు, లాయర్లు, ప్రొఫెసర్లు, గృహిణులు, చాలా మంది నేర్చుకున్నారు. కళకు ఉన్న ప్రాముఖ్యత ఇటీవలె తెలుస్తోంది. చెట్లను కాపాడటం, అందుబాటులో ఉన్న వనరులతో గ్రీనరీని తయారు చేస్తాం. ప్రస్తుతం అందరూ నేర్చుకుంటారు. ఈ కళకు గుర్తింపు తెచ్చేందుకు ఏటా 5 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తాను. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వరకూ అందరూ వచ్చి నేర్చుకుంటారు. చివరల్లో మినీ ఎగ్జిబిషన్ మాదిరి ఏర్పాటు చేస్తాం. ఆకులు, పూలను గౌరవించడం నేర్చుకుంటారు. ఇదొక హాబీ, కమర్షియల్ కాదు. చెట్లను కట్ చేయకుండా ఎండిన కొమ్మలతోనూ కళను ప్రోత్సహించొచ్చు.
– రేఖారెడ్డి, హైదరాబాద్ చాప్టర్స్ అధ్యక్షురాలు.
Comments
Please login to add a commentAdd a comment