నటీమణులతో స్టార్‌ హోటళ్లలో దందా | Prostitution Scandal With Bengali And Telugu TV Actress In Hyderabad- Sakshi
Sakshi News home page

హైటెక్‌ వయా వాట్సప్‌

Published Mon, Jul 9 2018 8:41 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

prostitution Scandal With Bengali And Telugu TV Actress In Hyderabad - Sakshi

జానీ

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): రాజధానిలోని స్టార్‌ హోటళ్లు అడ్డాగా నటీమణులను ట్రాప్‌ చేసి వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నడిపించే జనార్దన్‌రావు అలియాస్‌ జానీ నగర పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్‌ హోటల్‌పై దాడి చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. విటుడిగా వచ్చిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ను సైతం పట్టుకొని, భోజ్‌పురి నటిని రెస్క్యూ చేశారు. గతేడాది డిసెంబర్‌లోనూ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం బంజారాహిల్స్, పంజగుట్ట పరిధుల్లో రెండు స్టార్‌ హోటళ్లపై ఏక కాలంలో దాడులు చేసింది. ఇద్దరు పాత్రధారుల్ని అరెస్టు చేసి తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన ఇద్దరు నటీమణుల్ని రెస్క్యూ చేసింది. ఈ కేసులోనూ జానీ వాంటెడ్‌గా ఉన్నాడు. సినీ అవకాశాల పేరుతో వర్ధమాన తారలను ట్రాప్‌ చేసే జానీ... వారి ఫొటోలను వాట్సప్‌లో విటులకు షేర్‌ చేసి, స్టార్‌ హోటళ్లలో దందా నడిపించేవాడు.  

అవకాశాల పేరుతో ట్రాప్‌...  
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జానీ సిటీలోని పద్మారావునగర్‌లో స్థిరపడ్డాడు. 2010 నుంచి స్టార్‌ హోటల్స్‌ అడ్డాగా నటీమణులతో వ్యభిచార దందా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కాడు. ఇతడిపై బంజారాహిల్స్, పంజగుట్ట, చందానగర్‌ తదితర ఠాణాల్లోనూ కేసులు ఉన్నాయి. మరికొన్ని కేసుల్లోనూ మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన డి.వెంకట్‌రావు, మోనిష్‌లను సహాయకుడిగా ఏర్పాటు చేసుకొని స్టార్‌ హోటల్స్‌ కేంద్రంగా వ్యభిచార దందాలు నిర్వహించాడు. డిసెంబర్‌లో మిగిలిన ఇద్దరూ దొరికినా జానీ మాత్రం చిక్కలేదు. తెలుగు, హిందీ, భోజ్‌పురి, బెంగాలీ సినీ రంగానికి చెందిన వర్ధమాన హీరోయిన్లతో పాటు కొందరు టీవీ ఆర్టిస్టులనూ ముంబై, కోల్‌కతాల నుంచి రప్పిస్తుంటాడు. సినిమాల్లో అవకాశాల పేరుతో ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత వారిని వ్యభిచార ఊబిలోకి దింపి తన సహాయకులతో కథ నడిపిస్తుంటాడు. 

వాట్సాప్‌ ద్వారా దందాలు...
జానీతో పాటు అతడి అనుచులు సైతం ఎవరికి వారుగా ‘కస్టమర్ల’తో కూడిన 40–50 వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా సినీ, టీవీ నటిని ఉచ్చులోకి దింపిన వెంటనే వారి ఫొటోలను వాట్సప్‌లో కస్టమర్లకు షేర్‌ చేస్తుంటారు. వారు చూపించిన ఆసక్తి మేరకు ఆయా బాధితురాళ్లను విమానాల్లో తరలిస్తుంటారు. అప్పటికే స్టార్‌ హోటళ్లలో రూమ్స్‌ సిద్ధం చేసే ఈ నిర్వాహకుడు, వాటి లాబీల్లో ఎదురు చూస్తుంటాడు. కస్టమర్‌ వచ్చిన తర్వాత లాబీల్లోనే నగదు లావాదేవీలు పూర్తి చేస్తారు. అప్పటికే బాధితురాళ్లను ఆయా గదుల్లో సిద్ధంగా ఉంచుతారు. డబ్బు తీసుకున్న వెంటనే కస్టమర్లకు వారు వెళ్లాల్సిన హోటల్‌లో ఫ్లోర్, గది నెంబర్‌ చెప్పి యాక్సెస్‌ కార్డిచ్చి పంపిస్తుంటారు. స్టార్‌ హోటల్స్‌లోకి పోలీసులు సహా ఎవరూ తేలిగ్గా ప్రవేశించే అవకాశం లేకపోవడంతో వాటినే అడ్డాలుగా చేసుకున్నారు. వీరి వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తుంటారు. సాధారణంగా వీకెండ్స్‌లోనే వీరి దందాలు జోరుగా సాగుతుంటాయి. 

ఉలిక్కిపడ్డ ఆర్మీ...  
శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో జానీతో పాటు భోజ్‌పురి నటి, విటుడు ఉన్నారని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో పట్టుబడిన విటుడు ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌గా పనిచేస్తున్న అమిత్‌ మహేంద్ర శర్మగా తేలింది. వీరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన శర్మ ప్రస్తుతం అసోం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శిక్షణ నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌కు వచ్చారు. ఈయన వ్యభిచార కేసులో చిక్కారని తెలియడంతో ఆర్మీతో పాటు కేంద్ర నిఘా వర్గాలూ ఉలిక్కిపడ్డాయి. ఈ వ్యవహారం వెనుక ‘హనీట్రాప్‌’ ఉందా? అనే కోణంలో ఆరా తీశారు. ఉగ్రవాద సంస్థలు సైనిక రహస్యాలను కాజేయడానికి యువతుల్ని ఎరగా వేస్తుంటాయి. గతంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఇలాంటి ఉదంతాలు రెండు వెలుగు చూశాయి.

2009లో  బిహార్‌ పోలీసులు సుధాంశు సుధాకర్‌ అలియాస్‌ గోరఖ్‌ అలియాస్‌ చోటూను పట్టుకున్నారు. ఇతడు సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిచేస్తూ హనీట్రాప్‌లో పడ్డాడు. అలాగే 2014లో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు సుబేదార్‌ పతన్‌కుమార్‌ పోద్దార్‌ను అరెస్టు చేశారు. ఇతడు కూడా అనుష్క శర్మ అనే మహిళ ట్రాప్‌లో పడి సైనిక రహస్యాలు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఉదంతాల నేపథ్యంలో తాజాగా లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ శర్మ చిక్కిన వెంటనే ఆర్మీతో పాటు కేంద్ర నిఘా వర్గాలు అప్రతమత్తమయ్యాయి. హుటాహుటిన బంజారాహిల్స్‌ ఠాణాకు వచ్చి శర్మను విచారించాయి. అతడి కాల్‌ డిటేల్స్‌తో పాటు వాట్సప్‌ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. అయితే ఇందులో అలాంటి కోణం లేదని, ముంబైకి చెందిన ఇతడి స్నేహితుడు సంతోష్‌ ద్వారా జనార్దన్‌ అనుచరుడు శ్రీరామ్‌ పరిచయమైనట్లు, అతడి ద్వారా జనార్దన్‌ నంబర్‌ తీసుకున్నట్లు తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. శర్మపై కోర్టు మార్షల్‌ నిర్వహించడానికి ఆర్మీ సన్నాహాలు చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement