టీటీడీ చైర్మన్గా చదలవాడ!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని నియమించనున్నట్లు సమాచారం. చదలవాడ కృష్ణమూర్తిని ఏడాది కాలానికి నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి అత్యంత సన్నిహితుడైన బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి జి. భానుప్రకాష్‌రెడ్డిని పాలక మండలి సభ్యుడిగా నియమించడం కూడా దాదాపుగా ఖరారైంది. తొలుత భానును తుడా చైర్మన్‌గా నియమించి, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ, తుడాను మరొకరికి ఇచ్చేందుకు వీలుగా భానును బోర్డు సభ్యుడిగా నియమించడానికి చంద్రబాబు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తిరుపతికి చెందిన టీడీపీ నాయకుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కూడా బోర్డు సభ్యత్వం కోసం సినీ నటుడు పవన్ కల్యాణ్ ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరితోపాటు సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు, టీటీడీ మాజీ జేఈవో పి, బాలసుబ్రమణ్యంకు బోర్డులో చోటు ఖరారైనట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ప్రస్తుత చైర్మన్ కనుమూరి బాపిరాజు.. తన పదవీ కాలం వచ్చే నెల 25వ తేదీ వరకు ఉన్నందున అప్పటిదాకా కొనసాగించాలని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి, తన బంధువు ద్వారా చంద్రబాబుకు విన్నవించుకున్నట్లు సమాచారం. ఇక ఇటీవలే హస్తానికి చేయిచ్చి, సైకిల్ ఎక్కిన ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా టీటీడీ చైర్మన్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆయన ఇప్పటికే చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇక టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా ఈ పోస్ట్ పై ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)