మే 1 నుంచి ఆన్‌లైన్‌ | Indrakaran Reddy Take Charge As Telangana Minister | Sakshi
Sakshi News home page

మే 1 నుంచి ఆన్‌లైన్‌

Published Tue, Feb 26 2019 3:07 AM | Last Updated on Tue, Feb 26 2019 3:07 AM

Indrakaran Reddy Take Charge As Telangana Minister - Sakshi

బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అన్ని ప్రముఖ దేవాలయాల్లో వచ్చే మే 1 నుంచి ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. 3,645 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద ప్రతి నెల రూ.2.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. న్యాయశాఖకు సంబంధించి సీఎం కేసీఆర్‌ కృషితో హైకోర్టు విభజన సమస్య తీరిపోయిందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం సచివాలయం డీ బ్లాక్‌లోని తన చాంబర్‌లో మంత్రిగా ఇంద్రకరణ్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌ రెండోసారి తనను మంత్రిగా నియమించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడతానన్నారు. దేవాదాయ మంత్రిగా ఉన్నవారు మళ్లీ ఎన్నికల్లో గెలవరనే సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేశా నని, అదే శాఖకు మంత్రిగా బాధ్య తలను అప్పగించడం సంతృప్తినిచ్చిందన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అరణ్య భవన్‌లో ఉన్నతాధికారులతో ఇంద్రకరణ్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

అటవీ చట్టం మరింత కఠినతరం...
అడవుల సంరక్షణకు అటవీ చట్టంలో సమూల మార్పులు తీసుకొచ్చి, వాటిని మరింత కఠినతరం చేస్తామని ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు. అటవీ శాఖపై కేసీఆర్‌ ఇప్పటికే సమీక్ష నిర్వహించారని... జంగల్‌ బచావో, జంగల్‌ బడావో పేరుతో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. అడవులను కాపాడటం, పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్‌ రెడ్డి, రాథోడ్‌ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌ రెడ్డి, ఈ.ఎఫ్‌.ఎస్‌–టీ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ మిశ్రా, పీసీసీఎఫ్‌ ప్రశాంత్‌ కుమార్‌ ఝా, దేవాదాయ కమిషనర్‌ అనిల్‌ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌ రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement