Ministry of Forestry
-
మే 1 నుంచి ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రముఖ దేవాలయాల్లో వచ్చే మే 1 నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. 3,645 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద ప్రతి నెల రూ.2.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. న్యాయశాఖకు సంబంధించి సీఎం కేసీఆర్ కృషితో హైకోర్టు విభజన సమస్య తీరిపోయిందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం సచివాలయం డీ బ్లాక్‌లోని తన చాంబర్లో మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ రెండోసారి తనను మంత్రిగా నియమించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడతానన్నారు. దేవాదాయ మంత్రిగా ఉన్నవారు మళ్లీ ఎన్నికల్లో గెలవరనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేశా నని, అదే శాఖకు మంత్రిగా బాధ్య తలను అప్పగించడం సంతృప్తినిచ్చిందన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అరణ్య భవన్లో ఉన్నతాధికారులతో ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అటవీ చట్టం మరింత కఠినతరం... అడవుల సంరక్షణకు అటవీ చట్టంలో సమూల మార్పులు తీసుకొచ్చి, వాటిని మరింత కఠినతరం చేస్తామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అటవీ శాఖపై కేసీఆర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారని... జంగల్ బచావో, జంగల్ బడావో పేరుతో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. అడవులను కాపాడటం, పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, ఈ.ఎఫ్.ఎస్–టీ స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. -
‘పాలమూరు’తో వన్యప్రాణులకు నష్టం లేదు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జరగడం లేదని, ఈ నిర్మాణంతో వన్యప్రాణులకు ఎలాంటి హాని ఉండదని రాష్ట్ర అటవీ శాఖ కేంద్రానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం అంతా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతానికి అవతలే జరుగుతోందని వివరణ ఇచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టుకు స్టేజ్–1 అటవీ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.ఝా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 205.48 హెక్టార్ల అటవీ భూమి అవసరం అవుతోంది. ఇక ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అంజనగిరి రిజర్వాయర్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కి 11.95 కిలోమీటర్ల అవతల ఉంది. బఫర్‌జోన్‌కు సైతం 2.50 కిలోమీటర్లు, ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్)కు 1.56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అటవీ భూములకు సంబంధించి అనుమతులు ఇవ్వాలని ఈ ఏడాది జూలైలో కేంద్ర అటవీ సలహా కమిటీ (ఎఫ్ఏసీ)ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై విచారించిన ఎఫ్ఏసీ వన్యప్రాణులకు జరిగే నష్టాన్ని తేల్చాల్సిన బాధ్యతను రాష్ట్ర అటవీ అధికారులకు అప్పగించింది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు, 1980 అటవీ చట్టాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం రక్షిత వన్యప్రాణి ప్రాంతాలకు 10 కిలోమీటర్ల అవతల ఉండాలి. ప్రస్తుతం టైగర్రిజర్వ్కి 11.95 కిలోమీటర్ల అవతలే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే స్టేజ్–1 క్లియరెన్స్‌లు ఇవ్వాలని రాష్ట్ర అటవీ శాఖ కేంద్రాన్ని కోరింది. కాళేశ్వరం స్టేజ్–1కు అటవీ అనుమతులు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి స్టేజ్–1 అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో అటవీ సలహా కమిటీ(ఎఫ్ఏసీ) తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ నిశీత్ సక్సేనా రాష్ట్రానికి కేంద్రం నిర్ణయాన్ని తెలియజేస్తూ లేఖ పంపారు. గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించేలా 150 టీఎంసీల సామర్థ్యంతో 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80వేల ఎకరాల భూసేకరణ చేయనున్నారు. ఇందులో 3,168.13 హెక్టార్ల మేర అటవీ భూమి జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అవసరం ఉంది. ఎఫ్ఏసీ ముందు వివరణ ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఎఫ్ఏసీ ఎదుట హాజరై అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూములు, ఆ భూముల్లో మొక్కల పెంపకం, జంతు సంరక్షణవంటి అంశాలపై రాష్ట్రం వివరణ ఇచ్చింది. అలాగే ఎన్జీటీ కేసును అటవీ భూ సేకరణతో ముడి పెట్టరాదన్న విషయాన్ని ఎఫ్‌ఏసీకి వివరించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఎఫ్ఏసీ అటవీ అనుమతులకు అంగీకారం తెలిపింది. కాగా, 3,168 హెక్టార్ల అటవీ భూమిలో 900 హెక్టార్లలో మేడిగడ్డ వద్ద కాల్వల పనులు జరగాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన మేడిగడ్డ నుంచే గోదావరి నీటిని కన్నెపల్లికి ఎత్తి పోస్తారు. అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల, బండపల్లి బ్యారేజ్‌కు నీటిని తరలిస్తారు. ఇక 3,168 హెక్టార్ల అటవీ భూమికి బదులు రాష్ట్ర ప్రభుత్వం 3,400 హెక్టార్ల భూమిని ప్రభుత్వం అటవీ శాఖకు ఇవ్వనుంది. -
‘యాదాద్రి’ ప్లాంటు తరలింపు!
దామరచర్ల నుంచి తరలించాలన్న కేంద్రం ♦ ప్రతిపాదిత స్థలం గుండా మూసీ వెళ్తుండటమే కారణం ♦ నదీ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన ♦ పరిశీలనకు నిపుణులతో కమిటీని పంపాలని నిర్ణయం ♦ ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి ♦ రామగుండం ఎన్టీపీసీ విస్తరణపై సైతం కొర్రీలు.. ‘సాక్షి’కి ప్రత్యేకం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్ పూర్లలో నిర్మించ తలపెట్టిన యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం చిక్కుల్లో పడింది. 4,000 (5ఁ800) మెగావాట్ల భారీ సామర్థ్యంతో తెలంగాణ జెన్కో తలపెట్టిన ఈ ప్రాజెక్టును దామరచర్ల నుంచి మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని పరిశీలిం చాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిం చింది. ప్రతిపాదిత స్థలం మీదుగా కృష్ణా ఉప నది (మూసీ) వెళ్తున్నందున అక్కడ థర్మల్ ప్రాజెక్టు నిర్మిస్తే ఈ జల వనరు ప్రభావితం కావచ్చని ఆందోళన వెలిబుచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నేతృత్వం లోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) గత నెల 29న ఢిల్లీలో సమావేశమై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అనుమతులు జారీ చేసే అంశంపై ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన ‘మినిట్స్’ కాపీని ‘సాక్షి’ సంపా దించింది. వివిధ కారణాలతో దామరచర్లలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంతో పాటు కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 1,600 (2ఁ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులను వాయిదా వేస్తూ ఈ సమావేశంలో ఈఏసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు త్వరలో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దామరచర్లకు పంపిస్తామని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర అధికారుల బృందానికి తెలియజేసింది. తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డెరైక్టర్ సి.రాధాకృష్ణ ఈ సమావేశానికి హాజరై ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ ముందు ఉంచారు. ప్రతిపాదిత స్థలానికి సమీపంలో కృష్ణా ఉప నది వెళ్తుంది గనుక ప్రాజెక్టు అవసరాలకు సరిపడా నీళ్ల లభ్యత సైతం ఉందని రాష్ట్ర అధికారులు వివరించి నట్లు సమాచారం. ఇదే అంశాన్ని పట్టుకున్న కేంద్ర నిపుణుల కమిటీ.. ఉప నది సమీపంలో థర్మల్ కేంద్రాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించి నట్లు తెలిసింది. ప్రాజెక్టును మరోచోటికి తరలించే అంశంపై ఈ సమావేశంలో జెన్కో అధికారులతో విస్తృతంగా చర్చించామని ఈ మినిట్స్ నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని జెన్కో అధికారులు విజ్ఞప్తి చేయగా, సబ్ కమిటీని పంపాలని ఈ నిపుణుల కమిటీ నిర్ణయించింది. దామరచర్లలో థర్మల్ ప్రాజెక్టు నిర్మాణా నికి 4,334 హెక్టార్ల అటవీ భూములను పరస్పర భూముల బదలాయింపు విధా నంలో వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం నుంచి అను మతులు సైతం పొందింది. దామరచర్లలో థర్మల్ ప్రాజెక్టు నిర్మిస్తే స్థానికులకు ఉద్యో గాలు వస్తాయని నల్లగొండ జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం నిపుణుల సబ్ కమిటీ తీసుకునే నిర్ణయమే దామరచర్ల విద్యుత్ కేంద్రం భవితవ్యాన్ని తేల్చనుంది. ఈ అంశంపై జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన ఫోన్ కాల్‌పై స్పందించలేదు. ఎన్టీపీసీ విస్తరణకు అడ్డంకే విభజన చట్టం హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలి విడతగా రామగుండంలో 1,600 మెగావాట్లతో ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణకు సైతం నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) అనుమతులను వాయిదా వేసింది. ఈ ప్రాజెక్టును 44 నెలల్లో పూర్తి చేసేందుకు ఇటీవలే ఎన్టీపీసీ నిర్ణయం తీసుకోగా, తాజా పరిణామాలతో మరింత ఆలస్యం జరగ నుంది. ఎన్టీపీసీ ప్రతిపాదనలపై కమిటీ ఏకంగా 14 కొర్రీలు వేసింది. ఎన్టీపీసీ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై పడుతున్న ప్రభావంపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రాజెక్టుకు బొగ్గు కేటాయింపులకు సంబం ధించి సమగ్ర వివరాలు సమర్పించాలని ఆ కమిటీ సూచించింది.