![Ministry of Endowments land in problems - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/9/dfsafas.jpg.webp?itok=VaP8iVdH)
సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక హామీలు గుప్పించిన విషయం విదితమే. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఒక సామాజిక వర్గం ఓట్లన్నింటినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వేయిస్తే మహానందిలో ఆ సామాజిక వర్గం పేరిట సత్రం నిర్మాణానికి పార్టీ, ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గం కోసం సత్రం నిర్మాణానికి మహానందిలో 47 సెంట్ల దేవుడి భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాసింది. ఆలయ భూముల అమ్మకం, ఇతరులకు ప్రభుత్వం బదలాయించే అధికారాలపై హైకోర్టు ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలియజేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెంటనే జవాబిచ్చారు.
ఆ సమాధానంతో ప్రభుత్వ పెద్దలు తృప్తి చెందకపోవడంతో తక్షణమే అన్ని వివరాలతో ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్, ఆ శాఖకు చెందిన ఇతర అధికారులను సీఎం కార్యాలయ అధికారులు ఆదేశించారు. ఈ వ్యవహారం దేవాదాయ శాఖలో దుమారం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment