
దేవాదాయశాఖలో ‘నిధి’ చిచ్చు!
పరిపాలన నిధి నుంచి అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలిచ్చే యోచనలో ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయశాఖ పరిధిలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం... ఆ శాఖలో మరో వివాదానికి తెరతీసింది. దేవాదాయశాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం సర్కారు నేరుగా వేతనాలు చెల్లిస్తోంది. ఈ సొమ్మును దేవాదాయశాఖ తన పరిపాలన నిధి నుంచి తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తోంది. అయితే తాజాగా అర్చకులు, దేవాలయాల్లోని ఉద్యోగులకూ పరిపాలనా నిధి నుంచే వేతనాలు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది ఆ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు- దేవాలయాల్లోని ఉద్యోగులు, అర్చకులకు మధ్య చిచ్చు రాజేసింది. అర్చకులు, దేవాలయాల్లోని ఉద్యోగుల నియామకం ఒక పద్ధతి అంటూ లేకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో జరిగిందని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా లెక్కకట్టే వీలే లేదని.. భవిష్యత్‌లో తమకు ఇబ్బందులు కలి గించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు.
వేతనాల కోసమే..
తమకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలంటూ అర్చకులు, ఆలయ ఉద్యోగుల జేఏసీ సమ్మె చేసింది. ఈ డిమాండ్‌పై ప్రభుత్వం వేసిన కమిటీ పరిశీలన జరిపి పలు ప్రతిపాదనలు చేసింది. ఆలయాల నుంచి వసూలు చేస్తున్న పరిపాలన నిధి వాటాను 12% నుంచి 15 శాతానికి పెంచాలని, ఆ పెరిగే మొత్తాన్ని అర్చకులు, ఉద్యోగుల వేతనాలకయ్యే మొత్తానికి కలపాలని సూచించింది. అంటే ఆలయ ఆదాయంలో వేతనాలకు కేటాయించిన 30 శాతానికి ఇది అదనంగా చేరుతుంది. ఇక ఆ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సొమ్మును ప్రభుత్వానికి రీయింబర్స్ చేయడాన్ని దేవాదాయ శాఖ నిలిపేస్తుంది.
దీనికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినా... దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఓ పద్ధతంటూ లేకుండా ఆలయ కమిటీల ద్వారా ఉద్యోగులు నియమితులయ్యారని, వారికి ఈ నిధిని ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి రీయింబర్స్ చేయటం ఆపేస్తే.. నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించినట్లు అవుతుందని... దీన్ని ఇతర మతాల వారు ప్రశ్నిస్తే న్యాయపర చిక్కులొస్తాయని స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు దీనివల్ల భవిష్యత్తులో తమ వేతనాలకు ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. ఈ మేరకు వారు శనివారం సమావేశమై కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. నిధి నుంచి చెల్లింపు ప్రతిపాదనను విరమించుకోకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ సమస్య..
దేవాదాయశాఖ పరిధిలోని ప్రతి ఆలయ ఆదాయం నుంచి ఏటా 12 శాతం చొప్పున వసూలు చేసి... దేవాదాయశాఖ పరిపాలనా నిధికి జమచేస్తారు. ఇలా ఏటా దాదాపు రూ. 23 కోట్ల వరకు సమకూరుతుంది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాల యం, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది, ఆలయాల ఈవోలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరికి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని ఏటా పరిపాలన నిధి నుంచి దేవాదాయ శాఖ తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇలా చెల్లించగా ఏటా కొంత మొత్తం మిగులుతోంది. ఆ మిగులు నిధు లు రూ.90 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆలయాల్లోని సాధారణ ఉద్యోగులు, అర్చకులకు వాటికి వచ్చే ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తారు. ఆలయానికి వచ్చే మొత్తం ఆదాయంలో వేతనాలకు 30 శాతం కేటాయిస్తారు. ఈ 30 శాతానికి లోబడే అర్చకులు, సిబ్బంది వేతనాలు ఉండాలి.