ఆదాయం తక్కువగా ఉండే ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు సజావుగా జరిగేందుకు దేవాదాయ శాఖ ఒక్కో ఆలయానికీ ఇచ్చే సాయాన్ని రూ. 5 వేలకు పెంచింది.
సాక్షి, హైదరాబాద్: ఆదాయం తక్కువగా ఉండే ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు సజావుగా జరిగేందుకు దేవాదాయ శాఖ ఒక్కో ఆలయానికీ ఇచ్చే సాయాన్ని రూ. 5 వేలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతి నెలా ఒక్కో ఆలయానికి రెండున్నర వేల రూపాయలు సాయం అందజేస్తుండగా.. అందులో రూ. 1500 ఆలయ అర్చకుని గౌరవ వేతనంగా, వెయ్యి రూపాయలు ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు కేటాయించారు.
ఇక నుంచి అర్చకుని గౌరవ వేతనం మూడు వేలకు, నైవేద్యం ఖర్చు రెండు వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 23,834 ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా ప్రస్తుతం కేవలం 1367 ఆలయాలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007కు ముందు ఆదాయం లేని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు కొరవడటంతో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.