
అందుకు సమాజం, ఆలయ కమిటీలే చొరవ తీసుకోవాలి
సుప్రీంకోర్టు వెల్లడి
న్యూఢిల్లీ: దేవాలయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులకు(వీఐపీలు) అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాచమర్యాదలు చేస్తూ ప్రత్యేక దర్శనాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. బృందావన్‌లోని శ్రీరాధా మదన్‌మోహన్ ఆలయంలో సేవాయత్‌గా పని చేస్తున్న విజయ్‌కిశోర్ గోస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయడం, సామాన్యులు ప్రత్యేక దర్శనం చేసుకోవాలంటే అదనంగా రుసుము వసూలు చేయడాన్ని ఆయన సవాలు చేశారు. 12 జ్యోతిర్లాంగాల్లో వీఐపీ దర్శనాల సంస్కృతి విపరీతంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పౌరులంతా సమానమేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 సూచిస్తున్నట్లు గుర్తుచేశారు. దర్శనాలకు అదనంగా రుసుము వసూలు చేయడం సమానత్వ హక్కులను, మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.
విజయ్‌కిశోర్ గోస్వామి పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశిస్తూ తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. సమస్యను పరిష్కరించడానికి సమాజం, ఆలయ మేనేజ్‌మెంట్ కమిటీలే చొరవ తీసుకోవాలని సూచించింది. ఆలయాల్లో ప్రముఖులకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వకూడదని, భక్తులందరినీ సమానంగా చూడాలన్న అభిప్రాయం తమకు కూడా ఉందని పేర్కొంది.
కానీ, మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేమని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పరిధిలోకి ఈ కేసు వస్తుందని తాము భావించడం స్పష్టంచేసింది. పిటిషన్‌ను విచారించలేం కాబట్టి తిరస్కరిస్తున్నామని తెలియజేసింది. అయితే, పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం అనేది వీఐపీ సంస్కృతిని అరికట్టే సంబంధిత అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేదని ఉద్ఘాటించింది. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయకుండా స్థానికంగా చర్యలు తీసుకోవచ్చని పరోక్షంగా తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment