సాక్షి, మేడ్చల్ జిల్లా: దేవరయాంజాల్ శ్రీరామచంద్రస్వామి ఆలయ భూముల వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ‘రాములోరి భూములు.. రాబందుల పాలు’అనే శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంతో జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ భూముల వ్యవహారంపై రెవెన్యూ శాఖ నుంచి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వివరాలు కోరారు. దీంతో శామీర్‌పేట్ ఇన్‌చార్జి తహసీల్దార్, లా అధికారి ధర్మారామచంద్రారెడ్డి శ్రీరామచంద్రస్వామి ఆలయ భూముల వివాదంపై కలెక్టర్‌కు నివేదిక అందజేశారు.
ఈ భూముల వ్యవహారం దేవాదాయ శాఖకు, కొంతమంది రైతులకు మధ్య నెలకొన్న వివాదంగా నివేదికలో జిల్లా రెవెన్యూ శాఖ పేర్కొన్నట్లు సమాచారం. దేవరయాంజాల్‌లోని ఓ సర్వే నంబర్‌లో ఉన్న 1,521.13 ఎకరాల భూమిపై ఇరు వర్గాలు కోర్టుకు వెళ్లాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివాదంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ, భూపరిపాలన శాఖ కార్యదర్శి ఎ.రఘోత్తమరావును ప్రభుత్వం విచారణాధికారిగా నియమించినట్లు నివేదికలో ప్రస్తావించాయి. ఈ భూముల వివాద అంశాలతో కూడిన నివేదికను అప్పట్లో సీసీఎల్‌ఏ ప్రభుత్వానికి(1,425.17 ఎకరాలకు సబంధించి) నివేదించినట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది.
ఈ భూములపై తుది నిర్ణయం ప్రకటించే అధికారం ప్రభుత్వానికే ఉందని కలెక్టర్‌కు రెవెన్యూ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడేంత వరకు ఈ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపేస్తూ అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చినట్లు నివేదికలో ప్రస్తావించారు. దీంతో దేవరయాంజాల్ భూముల సమస్య అప్పటి నుంచి అపరిష్కృతంగా ఉండిపోయిందని వెల్లడించినట్టు సమాచారం. ఈ భూముల విషయంలో దేవాదాయ శాఖకు రెవెన్యూ శాఖ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో ఆ శాఖ వర్గాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment