చెక్‌డ్యామ్‌ల తరహా నిర్మాణం
ఆయకట్టుకు నీరు, లీకేజీల నియంత్రణ లక్ష్యంగా నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న స్నాన ఘట్టాలకు తుది రూపకల్పన జరిగింది. గతంలో మాదిరి ఇసుక బస్తాలను అడ్డంగా వేసి నీటిని నిల్వ చేసేలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చెక్‌డ్యామ్‌లను నిర్మించేలా ప్రణాళిక తయారైంది. జంపన్నవాగుపై నాలుగు చోట్ల చెక్‌డ్యామ్‌లను నిర్మించి స్నానాలతోపాటు ఇరిగేషన్ అవసరాలకు ఉపయోగపడేలా వీటిని డిజైన్ చేశారు. రూ.20 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ పనులను పదిహేను రోజుల్లో ఆరంభించే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకోసం తగిన స్నాన ఘట్టాలను డిజైన్ చేసే బాధ్యతను ప్రభుత్వం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు అప్పగించింది. దీనిపై అధ్యయనం చేసిన సీడీఓ జంపన్నవాగుపై నాలుగు చోట్ల చెక్‌డ్యామ్‌లను ప్రతిపాదించింది. పడిగాపూర్ వద్ద 110 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తుతో తొలి చెక్‌డ్యామ్‌ను ప్రతిపాదించారు. దీనికి 1.5 కిలోమీటర్ల దూరంలో రెడ్డిగూడెం వద్ద 110 మీటర్ల పొడవుతో 2 మీటర్ల ఎత్తుతో రెండో చెక్‌డ్యామ్‌ను ప్రతిపాదించారు. దీనికి 700 మీటర్ల దూరంలో మేడారం వద్ద మరో చెక్‌డ్యామ్, దీనికి 380 మీటర్ల దూరంలో ఊరట్టం వద్ద మరో చెక్‌డ్యామ్‌ను ప్రతిపాదించారు. ఇసుక బస్తాలకు బదులు చెక్‌డ్యామ్‌ల తరహా నిర్మాణం చేయడం వల్ల స్నాన ఘట్టాలకు తోడు 1,200 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటిని అందించే వెసలుబాటు ఉంటుంది. దీనికి తోడు స్నానఘట్టాలకు ప్రతిసారి వదిలే 250 ఎంసీఎఫ్‌టీ నీటిలో లీకేజీ నష్టాలు ఉండేవి. ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో 150 ఎంసీఎఫ్‌టీల నీరు సరిపోతుంది.
మేడారం జాతరకు శాశ్వత స్నాన ఘట్టాలు
Published Tue, Dec 8 2015 4:25 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement