పుర ‘ఫలితం’ నేడే
సాక్షి, కర్నూలు : ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం బట్టబయలు కానుంది. 43 రోజుల ఉత్కంఠకు సోమవారంతో తెరపడనుంది. మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సస్పెన్స్ వీడనుంది. జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలతో పాటు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలకు గత మార్చి 30న పోలింగ్ నిర్వహించడం తెలిసిందే. ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావితం చూపుతాయంటూ పలు పార్టీలు కోర్టును ఆశ్రయించడంతో కౌంటింగ్ ఈనెల 12వ తేదీకి వాయిదా పడింది. మొత్తం 219 వార్డుల్లో.. ఆళ్లగడ్డలోని రెండు (3, 4) వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 217 వార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు తలపడ్డారు.
సోమవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు చెందిన ఈవీఎంలను కర్నూలు శివారులోని సెయింట్ జోసెఫ్ బాలికల కళాశాలకు తరలించి స్ట్రాంగ్‌రూములో భద్రపరిచారు. ఇక్కడే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు నెలన్నర రోజులుగా ఫలితం కోసం అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. వరుస ఎన్నికల నేపథ్యంలో వీరంతా క్షణమొక యుగంగా గడిపారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం మొట్టమొదటగా వెలువడుతున్న ఫలితాలు మున్సిపల్ ఎన్నికలవే కావడం అన్ని పార్టీలను కలవరపరుస్తోంది. వెనువెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అందరి దృష్టి ఈ ఫలితాలపైనే కేంద్రీకృతమైంది. పురపోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఆశావహుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో ఆఖరి క్షణం వరకు బరిలో ఎవరుంటారనే విషయంలో సందిగ్ధం తలెత్తింది. దీంతో పలు మున్సిపాలిటీల్లో చైర్మన్‌గిరిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎట్టకేలకు సోమవారం మున్సిపల్ ఫలితాలు వెల్లడి కానున్న దృష్ట్యా అభ్యర్థుల్లో వణుకు మొదలైంది. ఇదిలా ఉండగా రాష్ట్రపతి పాలన నేపథ్యంలో చైర్మన్ల ఎంపిక వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.