సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే చాలు.. విజేతలు ఎవరో తేలిపోతుంది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోకసభ స్థానాల ఫలితాలు 23వ తేదీన వెలువడనున్నాయి. గెలుపు తమదే అంటే.. తమదే అన్న ధీమాను ఇరు పార్టీల నేతలూ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర శాసన సభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి అధికార టీఆర్‌ఎస్ రెండు స్థానాల్లో తమ అభ్యర్థుల విజయంపై విశ్వాసంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ స్థానంగా ఉన్న భువనగిరితో పాటు, గత ఎన్నికల్లో తమకు దక్కకుండా పోయిన నల్లగొండనూ ఈ సారి కైవసం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు.
మరోవైపు శాసనసభ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు సంబంధమే ఉండదని, కేంద్రంలో ఏ ప్రభుత్వం కావాలన్న ఎజెండాతో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పూర్తి అవకాశాలు ఉంటాయని, తమ సిట్టింగ్ స్థానమైన నల్లగొండను నిలబెట్టుకోవడంతో పాటు, గతెన్నికల్లో స్వల్ప తేడాతో కోల్పోయిన భువనగిరిపై జెండా ఎగురేస్తామన్నది కాంగ్రెస్ నేతల ధీమా. మొత్తానికి ఇరు పార్టీల నాయకులు, శ్రేణులు రెండు స్థానాల్లో గెలుపై భారీ అంచనాల్లో ఉన్నారు. రెండు పార్టీల నేతల ప్రకటలు ఎలా ఉన్నా.. ఎవరి విశ్వాసం మాటెలా ఉన్నా.. ఇంతకూ ఇక్కడ గెలిచేదెవరన్న ప్రశ్న అంతకంతకూ ఉత్కంఠ రేపుతోంది. ఫలితాల కోసం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో పెరిగిన రాజకీయ వేడి
నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల విజయంపై ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీలకు ఉన్నా.. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొత్త చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నల్లగొండనుంచి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయడం వల్ల కూడా ఈ రెండు నియోజకవర్గాల గురించి కాంగ్రెస్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఆయా సంస్థలు, జాతీయ మీడియా చానళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్‌కు దక్కనున్న స్థానాలపై వచ్చిన వార్తలతో ఆ పార్టీ వర్గాల్లో గెలుపై ధీమా పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో అటు టీఆర్‌ఎస్ నాయకత్వమూ ఆత్మవిశ్వాసంతో ఉంది. రెండు నియోజకవర్గాల్లో ఫలితాలు ఏకపక్షం కాదని, ఇరు పార్టీల మధ్య çలోక్‌సభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగిందని తేల్చడంతో ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఫలితాలతో విశ్లేషణ
మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాల మాటెలా ఉన్నా.. డిసెంబర్‌లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు, మెజారిటీ తదితర గణాంకాలను ముందేసుకుని విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం.. రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌కే అనుకూల ఫలితాలు రావాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో హుజూర్‌నగర్ సెగ్మెంట్ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో చేరింది. అది కూడా స్వల్ప మెజారిటీతో మాత్రమే. ఇక్కడినుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్న కోదాడ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నల్లగొండలను కోల్పోయింది.
ఓట్ల మెజారిటీ కూడా భారీగానే ఉంది. ఈ ఫలితాలను బట్టి లోక్‌సభ ఫలితమూ తమకే అనుకూలంగా వస్తుందని, తమ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి విజయం సాధిస్తారని టీఆర్‌ఎస్ అంటోంది. ఇక, భువనగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఐదు చోట్ల టీఆర్‌ఎస్ గెలిచింది. అయితే.. తుంగతుర్తి, ఇబ్రహీంపట్న (రంగారెడ్డి జిల్లా) అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ తక్కువ మెజారిటీతో ఓడిపోయింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడినుంచి తమ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది కాంగ్రెస్ విశ్లేషణ. ఇక్కడినుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ రెండోసారీ పార్లమెంట్‌లో అడుగుపెట్టడం ఖాయమన్నది టీఆర్‌ఎస్ అభిప్రాయం. మొత్తంగా ఇరు పార్టీ లెక్కలు, సమీకరణలు, విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు లోక్‌సభ ఫలితాలపై మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment