Nalgonda district police
-
అవినీతి ఆరోపణలపై ఎస్సై సస్పెండ్
సాక్షి, మిర్యాలగూడ : అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సైదాబాబును పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. సైదాబాబుపై పలు అవినీతి ఆరోపణలతో పాటు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం, సాండ్ టాక్స్ సక్రమంగా అమలు చేయకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సై సైదాబాబు కాల్‌డేటాతో పాటు పూర్తిస్థాయి విచారణ జరిపిన ఎస్పీ రంగనాథ్ ఎస్సైని సస్పెండ్ చేయమంటూ డీఐజీకి సిఫారసు చేశారు. ఎస్పీ సిఫారసు మేరకు హైద్రాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి సైదాబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
సంస్థాన్ నారాయణపురం ఠాణాకు అరుదైన గౌరవం
సంస్థాన్ నారాయణపురం : యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీస్‌సేష్టన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్డీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) సంస్థ ఉత్తమ పోలీస్స్టేషన్లకుగాను 2018లో చేసిన సర్వే ఆధారంగా బుధవారం ఫలితాలు విడుదల చేసింది. సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు 14వ ర్యాంకు రాగా.. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు 24వ ర్యాంకు వచ్చింది. దీంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్ టాప్ 20లో ర్యాంకు సాధించడంతో అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా మొదటి స్థానం రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లా పరిధిలోని కలు పోలీస్ స్టేషన్‌కు దక్కింది. సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పోలీస్ స్టేషన్లు రెండు ఉండడంతో పోలీసుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. భయం నుంచి జనంలోకి.. సంస్థాన్‌నారాయణపురం పోలీస్‌స్టేషన్ నిజాంకాలంలో ఏర్పాటయింది. 5 ఎకరాల విస్తీరణంలో ఉంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా గ్రామీణ స్థాయిలో అధిక విస్తీర్ణం కలిగిన పోలీస్స్టేషన్లలో ఇది ఒక్కటి. 1995లో దీనికి నూతన భవనం నిర్మించారు. గత 23 సంవత్సరాల్లో 13 మంది ఎస్ఐలు మారారు. ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాచకొండ అటవీ ప్రాంతం ఉంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న రోజుల్లో రాచకొండ పేరుతో ఒక దళం కూడా ఉండేది. ప్రజలు పోలీసులంటే భయంతో ఉండేవారు. కాలక్రమేణా వస్తున్న మార్పులు, ప్రభుత్వం, పోలీస్ శాఖ అనుసరిస్తున్న పాలన సంస్కరణలతో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ పెరిగింది. అందుకోసం ఆనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత ఎస్ఐ నాగరాజు ప్రజలకు భద్రత కల్పించడం కోసం అన్ని వేళల్లో పని చేస్తున్నారు. పలు కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలతో మమేకమువుతున్నారు. సంస్థాన్ స్టేషన్లో సేవా కార్యక్రమాలు.. సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉద్యోగం కోసం శిక్షణ, కేసుల సత్వర పరిష్కారం, వైద్య సేవలు, ఫిర్యాదుపై తక్షణం స్పందించడం, పోలీస్ స్టేషన్లో పచ్చదనం ఇలా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. 10 సంవత్సరాల క్రితం ఎస్ఐగా పనిచేసిన ఆదిరెడ్డి పోలీస్ స్టేషన్లో మొక్కలు పెంచి, పచ్చటి పోలీస్‌స్టేషన్‌గా తీర్చదిద్దాడు. అలా మొదలైన పచ్చదనం ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతకు ముందు పనిచేసిన ఎస్ఐ మల్లీశ్వరి (ప్రస్తుతం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మహిళ పోలీస్ సేష్టన్‌లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తుంది.) పనిచేసిన కాలంలో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. రాచకొండ సీపీ మహేష్‌భగవత్ రాచకొండ గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాచకొండ ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం, యీ ప్రాంతానికి బస్సు సౌకర్యం, గిరిజన యువతకు పోలీస్ శిక్షణ ఇవ్వడం నిర్వహించారు. ఆసక్తి ఉన్న 300 మందికి సర్వేల్ ఫిజికల్ శిక్షణ ఇచ్చారు. నేరాల తీరు.. సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో 2018 సంవత్సరానికి గాను 147 కేసులు నమోదు అయితే అందులో 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని కేసులు సత్వర పరిష్కారం చేశారు. ఇందుకు గాను ఐటీ వినియోగం, సీసీ కెమెరాలను వాడారు. లోక్ అదాలత్‌లో 43 కేసులను పరిష్కరించి రాచకొండ కమిషన్‌రేట్ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పుట్టపాకలో కెనరా బ్యాంక్ మేనేజర్ రూ.68లక్షలు తప్పుడు పేర్లుతో అవినీతికి పాల్పడితే అ కేసును నిగ్గు తేల్చారు. సర్వేలో పరిశీలించిన అంశాలు... కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్డీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) సంస్థ 2018సంవత్సరానికి గాను సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో సర్వే నిర్వహించారు. సర్వేలో స్మార్ట్ పోలీసింగ్, కేసుల పరిష్కరంలో ఐటీ వినియోగం, ఆన్లైన్లో స్పందించడం, నేర నివారణ, పరిశోధన, పరిశీలన, ఛేదించడం, పోలీస్‌లకు ప్రజల సంబంధాలు, భద్రత, నిర్వహణ, పోలీస్‌ల వ్యవహార, పనితీరు తదితర అంశాలపై సర్వే నిర్వహించారు. సర్వేలో సంస్థాన్ నారాయణపురం పోలీస్ సేష్టన్‌కు దేశవ్యాప్తంగా 14వ ర్యాంకు వచ్చింది. ప్రజలతో మమేకమయ్యాం 14వ ర్యాంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో మమేకమయినప్పుడు ప్రజల ఇబ్బందులు తెలిశాయి. వెంటనే స్పందించడం, నాతో పని చేసిన ప్రతి ఒక్కరు పరిశోధనతో పాటు , కేసుల దృష్టి సారించడం, అందుకు అవసరమైన సాంకేతికతను ఉపయోగించేకునే వాళ్లం. సీపీ మహేష్‌భగవత్‌తో పాటు, ఆధికారులు ఇచ్చిన సలహాలను పాటించాం. – మల్లీశ్వరి (గతంలో పనిచేసిన ఎస్ఐ) ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తాం ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలతో మమేకమవుతున్నాం. సీపీ, ఇతర ఉన్నాతాధికారుల సహకారంతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తాం. స్టేషన్లో సమష్టిగా పని చేయడంతో ఈ ర్యాంకు వచ్చింది. ఇంది మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. – నాగరాజు, ఎస్ఐ, సంస్థాన్ నారాయణపురం ఎస్పీ రంగనాథ్ హర్షం నల్లగొండ క్రైం : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో నల్లగొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు 24వ ర్యాంకు దక్కింది. 2018 సంవత్సరానికి దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబి తాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చోటు లభించడం పట్ల ఎస్పీ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. -
మరో.. 24 గంటలు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే చాలు.. విజేతలు ఎవరో తేలిపోతుంది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోకసభ స్థానాల ఫలితాలు 23వ తేదీన వెలువడనున్నాయి. గెలుపు తమదే అంటే.. తమదే అన్న ధీమాను ఇరు పార్టీల నేతలూ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర శాసన సభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి అధికార టీఆర్ఎస్ రెండు స్థానాల్లో తమ అభ్యర్థుల విజయంపై విశ్వాసంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. దీంతో టీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానంగా ఉన్న భువనగిరితో పాటు, గత ఎన్నికల్లో తమకు దక్కకుండా పోయిన నల్లగొండనూ ఈ సారి కైవసం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు. మరోవైపు శాసనసభ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు సంబంధమే ఉండదని, కేంద్రంలో ఏ ప్రభుత్వం కావాలన్న ఎజెండాతో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పూర్తి అవకాశాలు ఉంటాయని, తమ సిట్టింగ్ స్థానమైన నల్లగొండను నిలబెట్టుకోవడంతో పాటు, గతెన్నికల్లో స్వల్ప తేడాతో కోల్పోయిన భువనగిరిపై జెండా ఎగురేస్తామన్నది కాంగ్రెస్ నేతల ధీమా. మొత్తానికి ఇరు పార్టీల నాయకులు, శ్రేణులు రెండు స్థానాల్లో గెలుపై భారీ అంచనాల్లో ఉన్నారు. రెండు పార్టీల నేతల ప్రకటలు ఎలా ఉన్నా.. ఎవరి విశ్వాసం మాటెలా ఉన్నా.. ఇంతకూ ఇక్కడ గెలిచేదెవరన్న ప్రశ్న అంతకంతకూ ఉత్కంఠ రేపుతోంది. ఫలితాల కోసం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో పెరిగిన రాజకీయ వేడి నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల విజయంపై ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీలకు ఉన్నా.. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొత్త చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నల్లగొండనుంచి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయడం వల్ల కూడా ఈ రెండు నియోజకవర్గాల గురించి కాంగ్రెస్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఆయా సంస్థలు, జాతీయ మీడియా చానళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్‌కు దక్కనున్న స్థానాలపై వచ్చిన వార్తలతో ఆ పార్టీ వర్గాల్లో గెలుపై ధీమా పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో అటు టీఆర్ఎస్ నాయకత్వమూ ఆత్మవిశ్వాసంతో ఉంది. రెండు నియోజకవర్గాల్లో ఫలితాలు ఏకపక్షం కాదని, ఇరు పార్టీల మధ్య çలోక్‌సభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగిందని తేల్చడంతో ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలతో విశ్లేషణ మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాల మాటెలా ఉన్నా.. డిసెంబర్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు, మెజారిటీ తదితర గణాంకాలను ముందేసుకుని విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్కే అనుకూల ఫలితాలు రావాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో హుజూర్నగర్ సెగ్మెంట్ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో చేరింది. అది కూడా స్వల్ప మెజారిటీతో మాత్రమే. ఇక్కడినుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్న కోదాడ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నల్లగొండలను కోల్పోయింది. ఓట్ల మెజారిటీ కూడా భారీగానే ఉంది. ఈ ఫలితాలను బట్టి లోక్‌సభ ఫలితమూ తమకే అనుకూలంగా వస్తుందని, తమ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి విజయం సాధిస్తారని టీఆర్ఎస్ అంటోంది. ఇక, భువనగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఐదు చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. అయితే.. తుంగతుర్తి, ఇబ్రహీంపట్న (రంగారెడ్డి జిల్లా) అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్కు స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ తక్కువ మెజారిటీతో ఓడిపోయింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడినుంచి తమ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది కాంగ్రెస్ విశ్లేషణ. ఇక్కడినుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ రెండోసారీ పార్లమెంట్లో అడుగుపెట్టడం ఖాయమన్నది టీఆర్ఎస్ అభిప్రాయం. మొత్తంగా ఇరు పార్టీ లెక్కలు, సమీకరణలు, విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు లోక్‌సభ ఫలితాలపై మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. -
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు. దీంతో సదరు నిందితుడు.. ముగ్గురు పేర్లను వెల్లడించాడు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ముఠాలోని సభ్యులంతా గుంటూరు జిల్లా జంగులకుంటకు చెందిన వారని పోలీసులు వివరించారు. అలాగే నిందితుల నుంచి 3 లక్షల నకిలీ నోట్లతోపాటు ముద్రణ యంత్రాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
నల్గొండ: నల్గొండ జిల్లా పోలీసులపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్గొండలో నిప్పులు చెరిగారు. జిల్లాలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలు, ఇసుక దందాల్లో పోలీసులే ముందు వరుసలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 10 జాతీయ రహదారులు దిగ్బంధిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. -
కళేబరాలతో నూనె తయారీ ముఠా అరెస్ట్
నల్గొండ: నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మోటకొండూరులో జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కి తరలిచారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే జంతు కళేబరాల నుంచి తయారు చేసిన నూనెను పోలీసులు ధ్వంసం చేశారు. జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్నట్లు స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేసి... నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
కోళ్లదాణాలో రూ.కోటిన్నర!
నాగార్జున సాగర్ హైవేపై నల్గొండ జిల్లా పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా వైపు కోళ్ల దాణాతో వెళ్తున్న వాహనాన్ని చింతపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాణా అడుగున్న ఉంచి సుమారు కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు స్వాధీనం చేసుకుని రెండు రోజులు దాటిన పోలీసులు మాత్రం ఆ విషయాన్ని దాచి పెట్టారు. ఈ విషయంపై విలేకర్లు పోలీసులను ప్రశ్నించారు. నగదు దొరికిన మాట వాస్తవమేనని... ఆ నగదు ఆర్డీవోకు అందజేశామని పోలీసులు వెల్లడించారు. అయితే భారీ మొత్తంలో నగదు పట్టుబడిన పోలీసు మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది.