సంస్థాన్‌ నారాయణపురం ఠాణాకు అరుదైన గౌరవం | Samsthan NarayanPur Police Station Is In BPRD Top 20 List | Sakshi
Sakshi News home page

సంస్థాన్‌ నారాయణపురం ఠాణాకు అరుదైన గౌరవం

Published Thu, Jun 27 2019 10:51 AM | Last Updated on Thu, Jun 27 2019 10:52 AM

Samsthan NarayanPur Police Station Is In BPRD Top 20 List - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం ఠాణా

సంస్థాన్‌ నారాయణపురం : యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌సేష్టన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ ఉత్తమ పోలీస్‌స్టేషన్‌లకుగాను 2018లో చేసిన సర్వే ఆధారంగా బుధవారం ఫలితాలు విడుదల చేసింది. సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు 14వ ర్యాంకు రాగా.. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు 24వ ర్యాంకు వచ్చింది. దీంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌ టాప్‌ 20లో ర్యాంకు సాధించడంతో అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా మొదటి స్థానం రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌ జిల్లా పరిధిలోని కలు పోలీస్‌ స్టేషన్‌కు దక్కింది. సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌లు రెండు ఉండడంతో పోలీసుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. 

భయం నుంచి జనంలోకి..
సంస్థాన్‌నారాయణపురం పోలీస్‌స్టేషన్‌ నిజాంకాలంలో ఏర్పాటయింది. 5 ఎకరాల విస్తీరణంలో ఉంది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కూడా గ్రామీణ స్థాయిలో అధిక విస్తీర్ణం కలిగిన పోలీస్‌స్టేషన్‌లలో ఇది ఒక్కటి. 1995లో దీనికి నూతన భవనం నిర్మించారు. గత 23 సంవత్సరాల్లో 13 మంది ఎస్‌ఐలు మారారు. ఈ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రాచకొండ అటవీ ప్రాంతం ఉంది. నక్సల్స్‌ ప్రాబల్యం ఉన్న రోజుల్లో రాచకొండ పేరుతో ఒక దళం కూడా ఉండేది.

ప్రజలు పోలీసులంటే భయంతో ఉండేవారు. కాలక్రమేణా వస్తున్న మార్పులు, ప్రభుత్వం, పోలీస్‌ శాఖ అనుసరిస్తున్న పాలన సంస్కరణలతో ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ పెరిగింది. అందుకోసం ఆనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత ఎస్‌ఐ నాగరాజు ప్రజలకు భద్రత కల్పించడం కోసం అన్ని వేళల్లో పని చేస్తున్నారు. పలు కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలతో మమేకమువుతున్నారు.

సంస్థాన్‌ స్టేషన్‌లో సేవా కార్యక్రమాలు..
సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉద్యోగం కోసం శిక్షణ, కేసుల సత్వర పరిష్కారం, వైద్య సేవలు, ఫిర్యాదుపై తక్షణం స్పందించడం, పోలీస్‌ స్టేషన్‌లో పచ్చదనం ఇలా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. 10 సంవత్సరాల క్రితం ఎస్‌ఐగా పనిచేసిన ఆదిరెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో మొక్కలు పెంచి, పచ్చటి పోలీస్‌స్టేషన్‌గా తీర్చదిద్దాడు. అలా మొదలైన పచ్చదనం ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నారు.

ఇంతకు ముందు పనిచేసిన ఎస్‌ఐ మల్లీశ్వరి (ప్రస్తుతం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మహిళ పోలీస్‌ సేష్టన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తుంది.) పనిచేసిన కాలంలో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ రాచకొండ గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాచకొండ ప్రాంతంలో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయడం, యీ ప్రాంతానికి బస్సు సౌకర్యం, గిరిజన యువతకు పోలీస్‌ శిక్షణ ఇవ్వడం నిర్వహించారు. ఆసక్తి ఉన్న 300 మందికి సర్వేల్‌ ఫిజికల్‌ శిక్షణ ఇచ్చారు. 

నేరాల తీరు.. 
సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో 2018 సంవత్సరానికి గాను 147 కేసులు నమోదు అయితే అందులో 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని కేసులు సత్వర పరిష్కారం చేశారు. ఇందుకు గాను ఐటీ వినియోగం, సీసీ కెమెరాలను వాడారు. లోక్‌ అదాలత్‌లో 43 కేసులను పరిష్కరించి రాచకొండ కమిషన్‌రేట్‌ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పుట్టపాకలో కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ రూ.68లక్షలు తప్పుడు పేర్లుతో అవినీతికి పాల్పడితే అ కేసును నిగ్గు తేల్చారు. 

సర్వేలో పరిశీలించిన అంశాలు...
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ  2018సంవత్సరానికి గాను సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో సర్వే నిర్వహించారు. సర్వేలో స్మార్ట్‌ పోలీసింగ్, కేసుల పరిష్కరంలో ఐటీ వినియోగం, ఆన్‌లైన్‌లో స్పందించడం, నేర నివారణ, పరిశోధన, పరిశీలన, ఛేదించడం, పోలీస్‌లకు ప్రజల సంబంధాలు, భద్రత, నిర్వహణ, పోలీస్‌ల వ్యవహార, పనితీరు తదితర అంశాలపై సర్వే నిర్వహించారు. సర్వేలో సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌ సేష్టన్‌కు దేశవ్యాప్తంగా 14వ ర్యాంకు వచ్చింది.

ప్రజలతో మమేకమయ్యాం 
14వ ర్యాంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో మమేకమయినప్పుడు ప్రజల ఇబ్బందులు తెలిశాయి. వెంటనే స్పందించడం, నాతో పని చేసిన ప్రతి ఒక్కరు పరిశోధనతో పాటు , కేసుల దృష్టి సారించడం, అందుకు అవసరమైన సాంకేతికతను ఉపయోగించేకునే వాళ్లం. సీపీ మహేష్‌భగవత్‌తో పాటు, ఆధికారులు ఇచ్చిన సలహాలను పాటించాం. 
                                                                                                                                                                                              – మల్లీశ్వరి (గతంలో పనిచేసిన ఎస్‌ఐ)

ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తాం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలతో మమేకమవుతున్నాం. సీపీ, ఇతర ఉన్నాతాధికారుల సహకారంతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తాం. స్టేషన్‌లో సమష్టిగా పని చేయడంతో ఈ ర్యాంకు వచ్చింది. ఇంది మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది.
                                                                                                                                                                                              – నాగరాజు, ఎస్‌ఐ, సంస్థాన్‌ నారాయణపురం
ఎస్పీ రంగనాథ్‌ హర్షం
నల్లగొండ క్రైం : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దేశంలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్ల జాబితాలో నల్లగొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌కు 24వ ర్యాంకు దక్కింది. 2018 సంవత్సరానికి దేశంలోని ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబి తాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన ఉత్తమ పోలీస్‌ స్టేషన్ల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చోటు లభించడం పట్ల  ఎస్పీ రంగనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement