best police station
-
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీఎస్‌కు అవార్డు
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా 2023కుగాను ఎంపికైన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్)కు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన అఖిలభారత డీజీపీ, ఐజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) బి. నాగేంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 17 వేల పోలీస్స్టేషన్ల నుంచి ప్రతిపాదనలు వెళ్లగా ఇందులో 74 పోలీస్ స్టేషన్లను కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో కేంద్ర హోంశాఖ వెల్లడించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో రాజేంద్రనగర్ పీఎస్ తొలి స్థానంలో నిలవడం తెలిసిందే. స్టేషన్లో పోలీసులు చేపడుతున్న విధులు, కేసుల నమోదు, వాటి పరిష్కారంలో చూపుతున్న శ్రద్ధ, భార్యభర్తల గొడవల్లో కౌన్సెలింగ్, మహిళా భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని మృతదేహాల విషయంలో తీసుకుంటున్న చర్యలు.. స్టేషన్‌కు వచ్చిన వారిపట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు.. పీఎస్ పరిధిలో నమోదైన క్రైం రేట్.. దొంగతనాలు, దొంతనాల్లో రికవరీ శాతం వంటి అంశాల్లో ఈ స్టేషన్‌కు అవార్డు లభించింది. కాగా, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్హెచ్ఓ బి. నాగేంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అభినందనలు తెలియజేశారు. -
ప్రజల మనసు గెలిచి.. పురస్కారం పొంది.. హనుమంతునిపాడు పీఎస్ కు పట్టం
హనుమంతునిపాడు / ఒంగోలు టౌన్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్‌స్టేషన్. 9 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల అభిప్రాయాలను సేకరించి 2022 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డీజీపీ చేతుల మీదుగా ఎస్పీ మల్లికా గర్గ్, ఎస్ఐ కృష్ణ పావని, సిబ్బంది పురస్కారాన్ని అందుకున్నారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్నా.. 1927వ సంవత్సరం బ్రిటీషు పాలనలో కొండ శివారు గ్రామమైన నందనవనంలో పోలీస్సేష్టన్ను ఏర్పాటు చేశారు. 1984లో మండలాలు ఏర్పాటైన తర్వాత దీనిని హనుమంతునిపాడు మండల కేంద్రానికి మార్చారు. అయితే పురాతన భవనంలో తుపాకులు, ఇతర సామగ్రికి, సిబ్బందికి నక్సల్స్ నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2004లో కనిగిరి పాత పోలీస్‌స్టేషన్‌లోకి మార్చారు. దాదాపు పదేళ్లకుపైగా మండల కేంద్రానికి దూరంగా నియోజకవర్గ కేంద్రంలో హెచ్‌ఎంపాడు పీఎస్ కొనసాగుతోంది. స్టేషన్ పరిధిలో 23 గ్రామ పంచాయతీల్లో 14 సచివాలయాల కింద 62 హ్యాబిటేషన్ గ్రామాలున్నాయి. కనిగిరిలోని పోలీస్‌స్టేషన్ భవనం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిబ్బంది మండలానికి దూరంగా ఉన్నా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించారు. ఉన్నతాధికారుల సూచనలతో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ శక్తిమేర సేవలందించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి సెభాష్ అనిపించుకున్నారు. గతేడాది ఆగస్టు 28వ తేదీన కేంద్ర బృందం సర్వే చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కేంద్ర బృందం ద్వారా ప్రశంసలందుకుని పురస్కారానికి అర్హత సాధించారు. శ్రమకు గుర్తింపు లభించింది హనుమంతునిపాడు పోలీసు స్టేషన్‌కు ఉత్తమ పోలీసు స్టేషన్‌గా కేంద్ర హోం శాఖ నుంచి అవార్డు రావడం ప్రకాశం జిల్లా పోలీసుల శ్రమకు తగిన గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాను. ముఖ్యంగా హనుమంతునిపాడులో ఎస్ఐగా విధులు నిర్వహించిన కృష్ణ పావని నిబద్ధత కలిగిన అధికారి. ఆమె పనితీరు చాలా బాగుంది. ఆమెతో పాటుగా అక్కడ పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయడంతోనే ప్రజల, ప్రభుత్వ ప్రశంసలు పొందారు. – ఎస్పీ మలికా గర్గ్ మరింత స్ఫూర్తినినిచ్చింది ఈ అవార్డు నాకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఎస్పీ మలికా గర్గ్ ఇచ్చిన మద్దతు, సూచనలు, సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించడం, ప్రజలతో సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా బాధితులకు న్యాయం చేయడానికి శక్తిమేర ప్రయత్నించడం మా పోలీసు స్టేషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ విషయాన్ని మండల ప్రజలు కేంద్ర హోం శాఖ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అవార్డు రావడానికి సహచర పోలీసు సిబ్బంది, మండల ప్రజల తోడ్పాటును ఎప్పటికీ మరచిపోలేను. – కృష్ణ పావని, ఎస్ఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకున్న అంశాలు: ● నేరాల నియంత్రణ ● లా అండ్ ఆర్డర్ నిర్వహణ ● చట్టాల అమలు ● కేసుల దర్యాప్తు, విశ్లేషణ ● కోర్టు సమన్లు, కోర్టు మానిటరింగ్ ● ప్రోయాక్టివ్ పోలీసింగ్ ● కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ● పెట్రోలింగ్ నిర్వహణ ● పచ్చదనం, పరిశుభ్రత -
Best Police Station: ఏపీలో ఉత్తమ పోలీస్‌స్టేషన్ ఇదే..
ఒంగోలు(ప్రకాశం జిల్లా): రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసుస్టేషన్‌గా వలేటివారిపాలెం పోలీసుస్టేషన్ (ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఏటా కొన్ని పరిమితుల ఆధారంగా దేశంలో టాప్ 10లో ఉన్న పోలీసుస్టేషన్లను ఎంపిక చేస్తుంది. చదవండి: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే.. అందులో భాగంగా చుండి (వలేటివారిపాలెం) పోలీసుస్టేషన్ 2021 సంవత్సరానికి రాష్ట్రంలోనే నంబర్ 1స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోం శాఖ సెక్రటరీ సంతకంతో కూడిన సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీని జారీ చేశారు. ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ.. ఉత్తమ పోలీసుస్టేషన్‌గా వలేటివారిపాలెం పోలీసు స్టేషన్ నిలవడం గర్వకారణమన్నారు. -
ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి
సాక్షి, చొప్పదండి: చొప్పదండి పోలీస్‌స్టేషన్‌కు జాతీయస్థాయి గుర్తింపు లభించేందుకు మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో టాప్–3లో చోటు లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న15,666 పోలీస్ స్టేషన్లలో ఎంపిక చేసిన 70స్టేషన్లలో ఒకటిగా చొప్పదండి పోలీస్ స్టేషన్‌కు ఇప్పటికే ఘనత లభించింది. ఈ డెబ్భైస్టేషన్లలో మూడు ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసి ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీసీటీఎన్ఎస్ కృషి చేస్తోంది. దేశవ్యాప్త పోలీస్స్టేషన్లను ఆన్లైన్ ద్వారా ఒకే గొడుగు కిందకు తెచ్చి ఉత్తమ పోలీస్స్టేషన్లను ఎంపిక చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. పలు అంశాలలో పరిశీలన జాతీయస్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్ ఎంపికకు సీసీటీఎన్ఎస్ సంస్థ పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఎంపిక చేసిన డెబ్భై పోలీస్స్టేషన్లను దశలవారీగా సందర్శిస్తారు. దివ్యాంగులకు స్టేషన్లోకి రావడానికి ర్యాంపు, ప్లాస్టిక్ బ్యాగ్ డస్ట్‌బిన్, మహిళలకు ప్రత్యేక సహాయ కేంద్రం, వైర్లెస్ సదుపాయానికి ప్రత్యేకస్థలం, కేసులను ఆన్లైన్లో వెంటవెంట అప్డేట్ చేయడం, రిసెప్షన్ కార్యక్రమాలు, స్వచ్ఛభారత్ అమలు, స్టేషన్ ఆవరణను సుందరీకరించడం వంటి అంశాలతో చొప్పదండి ఉత్తమ స్టేషన్ల జాబితాలో చేరింది. ఒక్కో రాష్ట్రం నుంచి మూడు పోలీస్స్టేషన్లు ఈ జాబితాలో ఉండగా, తెలంగాణ నుంచి చొప్పదండి పోలీస్‌స్టేషన్ టాప్‌లో నిలిచింది. ఎంపిక విధానం ఇలా ఒక రాష్ట్రంలో 750కి పైగా పోలీస్స్టేషన్లుంటే మూడుస్టేషన్లను, తక్కువుంటే రెండుస్టేషన్లను, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక స్టేషన్‌ను పోటీకి ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా గల 15 వేలకు పైగా పోలీస్స్టేషన్ల నుంచి ఉత్తమ స్టేషన్ల జాబితాలో ఎంపికకు సీసీటీఎన్ఎస్ సంస్థలో స్టేషన్‌కు సంబంధించిన కేసుల వివరాల నమోదును ప్రాతిపాదికగా తీసుకున్నారు. మహిళపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, ఆస్తుల స్వాధీనం వంటి అంశాలను పరిశీలించారు. స్టేషన్ల వారిగా కేసుల నమోదు, చార్జ్షీట్ల తయారీ, అరువై రోజుల్లో దాఖలు వంటి అంశాలను కూడా పరిశీలంచారు. క్రైం ప్రివెన్షన్, పనితీరు, కేసుల పరిష్కారం, నేరాల అదుపునకు చర్యలు, కమ్యూనిటీ పోలీసింగ్‌పై పరిశీలన జరుగనుంది. సదుపాయాలు, అభివృద్ధి పనుల ద్వారా 80 శాతం, ప్రజల ఫీడ్‌బ్యాకు ద్వారా 20 శాతం మార్కులు రానున్నాయి. తొలిసారిగా సీసీ కెమెరాలు కరీంనగర్ పోలీస్‌కమిషనర్‌గా కమలాసన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక సీసీ కెమెరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. చొప్పదండిలో ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశానికి స్పందన రావడంతో జిల్లాలోనే తొలిసారిగా సీసీ కెమెరాలుచొప్పదండిలో ప్రారంభించారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనం, రిసెప్షన్ సుందరీకరణ, ఆన్లైన్ విధానం అమలు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల పరిష్కారానికి ప్రత్యేక క్రైం బృందం వంటి అంశాలలో చొప్పదండి పోలీసులు ముందున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎంపిక చేసిన 70 పోలీస్ స్టేషన్లలో పరిశీలన అనంతరం ఎంపిక చేసే మూడు పోలీస్ స్టేషన్లలో చొప్పదండి స్టేషన్ నిలువాలని ఆశిద్దాం. ఆన్లైన్ ద్వారా కేసులు పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసుల వివరాలను ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్త పరిశీలనకు భాగస్వాములమయ్యాం. చొప్పదండి స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాల బిగింపుతో నేరాలను అదుపు చేస్తున్నాం. కమిషనర్ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నంబర్‌వన్‌గా నిలుస్తామని ఆశిస్తున్నాం. – బి చేరాలు, ఎస్సై, చొప్పదండి -
బెజ్జంకి పోలీస్ భేష్..
సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి పోలీసులు అందిస్తున్న సేవలు, విధులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు 41వ స్థానం లభించినందుకు బెజ్జంకి పోలీసులు, మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 86 పోలీస్స్టేషన్లను పరిగణలోకి తీసుకున్న వాటిలో మెరుగైన ఫలితాలు సాధించిన బెజ్జంకి పోలీసులు రానించడం అబినందనీయం. శిక్షణలో 53మంది ఎంపిక.. జిల్లా సీపీ జోయల్ డేవిస్ సూచనలతో ఎస్ఐ అభిలాష్ మండలంలో గ్రామ గ్రామాన ప్రజలతో కలిసి పనిచేశారు. వాహనదారులకు లైసన్స్‌లను ఇప్పించడంతో పాటు పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం యువతను చైతన్య పరిచి ఎక్కువ సంఖ్యలో పోలీస్ శాఖలో దరఖాస్తు చేసుకునేలా చేశారు. వారికి శిక్షణ ఇచ్చి 53 మంది ఎంపికయ్యేలా కృషిచేశారు. ప్రస్తుతం వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది ప్రజలతో మమేకమవుతున్నారు.. ఇటీవల మండలంలో ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసులు, క్రైంరేటు, తగ్గించడంతో పాటు మండల స్థాయిలో సీసీ కెమెరాలను బిగించడం, సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమై ఉండటంతో మంచి ఫలితాలు వచ్చాయి. సీసీటీఎన్ఎస్ ఆన్లైన్, ఎఫ్ఐఆర్ల నమోదులోను బెజ్జంకి పోలీసులు ముందున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర కమిటీ బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌ను అత్యుత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో చోటిచ్చింది. రాష్ట్రంలోనే మూడు పోలీస్స్టేషన్లు కేంద్ర జాబితాలో ఉండగా సీఎం కేసీఆర్ జిలా, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండలమైన సిద్దిపేటలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు 41వ స్థానం లబించినందుకు మండల ప్రజాప్రతినిధులు. ప్రజలు అభినందిస్తున్నారు. సంతోషంగా ఉంది జాతీయ స్థాయి ఉత్తమ పోలీస్ స్టేషన్లో బెజ్జంకి పోలీస్ స్టేషన్ 41వ స్థానం లభించడం సంతోషంగా ఉంది. సిద్దిపేట సీపీ జోయల్‌డేవిస్, జిల్లా అధికారులు, మాపోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో ఈ ఫలితాలు సాధించాం. పలు చోరీ కేసులను వేగంగా చేధించాము. ప్రజలకు సేవలందిస్తు వారిలో మమేకమై పని చేస్తున్న మాసిబ్బంది చాలా సంతోషంగా ఉన్నారు. – పుల్ల అభిలాష్, ఎస్ఐ బెజ్జంకి పోలీసుల కృషికి ఫలితం బెజ్జంకి ఎస్ఐ అభిలాష్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది మండలంలో చురకుగా పని చేస్తున్నారు. ప్రజల్లో మమేకమై బాదితులకు సహాయం అందిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో మండలంలో ఎలాంటి అవాంతర సంఘటనలు జరకుండా అప్రమత్తంగా చూస్తున్నారు. వీరు చేసిన కృషికి కేంద్ర హోంశాఖ నిర్వహించిన అత్యుత్తమ పోలీస్స్టేషన్లలో 41వ స్థానం లభించడం అభినందనీయం. – లింగాల నిర్మల లక్ష్మణ్, నూతన ఎంపీపీ, బెజ్జంకి -
సంస్థాన్ నారాయణపురం ఠాణాకు అరుదైన గౌరవం
సంస్థాన్ నారాయణపురం : యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీస్‌సేష్టన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్డీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) సంస్థ ఉత్తమ పోలీస్స్టేషన్లకుగాను 2018లో చేసిన సర్వే ఆధారంగా బుధవారం ఫలితాలు విడుదల చేసింది. సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు 14వ ర్యాంకు రాగా.. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు 24వ ర్యాంకు వచ్చింది. దీంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్ టాప్ 20లో ర్యాంకు సాధించడంతో అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా మొదటి స్థానం రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లా పరిధిలోని కలు పోలీస్ స్టేషన్‌కు దక్కింది. సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పోలీస్ స్టేషన్లు రెండు ఉండడంతో పోలీసుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. భయం నుంచి జనంలోకి.. సంస్థాన్‌నారాయణపురం పోలీస్‌స్టేషన్ నిజాంకాలంలో ఏర్పాటయింది. 5 ఎకరాల విస్తీరణంలో ఉంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా గ్రామీణ స్థాయిలో అధిక విస్తీర్ణం కలిగిన పోలీస్స్టేషన్లలో ఇది ఒక్కటి. 1995లో దీనికి నూతన భవనం నిర్మించారు. గత 23 సంవత్సరాల్లో 13 మంది ఎస్ఐలు మారారు. ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాచకొండ అటవీ ప్రాంతం ఉంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న రోజుల్లో రాచకొండ పేరుతో ఒక దళం కూడా ఉండేది. ప్రజలు పోలీసులంటే భయంతో ఉండేవారు. కాలక్రమేణా వస్తున్న మార్పులు, ప్రభుత్వం, పోలీస్ శాఖ అనుసరిస్తున్న పాలన సంస్కరణలతో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ పెరిగింది. అందుకోసం ఆనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత ఎస్ఐ నాగరాజు ప్రజలకు భద్రత కల్పించడం కోసం అన్ని వేళల్లో పని చేస్తున్నారు. పలు కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలతో మమేకమువుతున్నారు. సంస్థాన్ స్టేషన్లో సేవా కార్యక్రమాలు.. సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉద్యోగం కోసం శిక్షణ, కేసుల సత్వర పరిష్కారం, వైద్య సేవలు, ఫిర్యాదుపై తక్షణం స్పందించడం, పోలీస్ స్టేషన్లో పచ్చదనం ఇలా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. 10 సంవత్సరాల క్రితం ఎస్ఐగా పనిచేసిన ఆదిరెడ్డి పోలీస్ స్టేషన్లో మొక్కలు పెంచి, పచ్చటి పోలీస్‌స్టేషన్‌గా తీర్చదిద్దాడు. అలా మొదలైన పచ్చదనం ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతకు ముందు పనిచేసిన ఎస్ఐ మల్లీశ్వరి (ప్రస్తుతం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మహిళ పోలీస్ సేష్టన్‌లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తుంది.) పనిచేసిన కాలంలో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. రాచకొండ సీపీ మహేష్‌భగవత్ రాచకొండ గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాచకొండ ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం, యీ ప్రాంతానికి బస్సు సౌకర్యం, గిరిజన యువతకు పోలీస్ శిక్షణ ఇవ్వడం నిర్వహించారు. ఆసక్తి ఉన్న 300 మందికి సర్వేల్ ఫిజికల్ శిక్షణ ఇచ్చారు. నేరాల తీరు.. సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో 2018 సంవత్సరానికి గాను 147 కేసులు నమోదు అయితే అందులో 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని కేసులు సత్వర పరిష్కారం చేశారు. ఇందుకు గాను ఐటీ వినియోగం, సీసీ కెమెరాలను వాడారు. లోక్ అదాలత్‌లో 43 కేసులను పరిష్కరించి రాచకొండ కమిషన్‌రేట్ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పుట్టపాకలో కెనరా బ్యాంక్ మేనేజర్ రూ.68లక్షలు తప్పుడు పేర్లుతో అవినీతికి పాల్పడితే అ కేసును నిగ్గు తేల్చారు. సర్వేలో పరిశీలించిన అంశాలు... కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్డీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) సంస్థ 2018సంవత్సరానికి గాను సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో సర్వే నిర్వహించారు. సర్వేలో స్మార్ట్ పోలీసింగ్, కేసుల పరిష్కరంలో ఐటీ వినియోగం, ఆన్లైన్లో స్పందించడం, నేర నివారణ, పరిశోధన, పరిశీలన, ఛేదించడం, పోలీస్‌లకు ప్రజల సంబంధాలు, భద్రత, నిర్వహణ, పోలీస్‌ల వ్యవహార, పనితీరు తదితర అంశాలపై సర్వే నిర్వహించారు. సర్వేలో సంస్థాన్ నారాయణపురం పోలీస్ సేష్టన్‌కు దేశవ్యాప్తంగా 14వ ర్యాంకు వచ్చింది. ప్రజలతో మమేకమయ్యాం 14వ ర్యాంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో మమేకమయినప్పుడు ప్రజల ఇబ్బందులు తెలిశాయి. వెంటనే స్పందించడం, నాతో పని చేసిన ప్రతి ఒక్కరు పరిశోధనతో పాటు , కేసుల దృష్టి సారించడం, అందుకు అవసరమైన సాంకేతికతను ఉపయోగించేకునే వాళ్లం. సీపీ మహేష్‌భగవత్‌తో పాటు, ఆధికారులు ఇచ్చిన సలహాలను పాటించాం. – మల్లీశ్వరి (గతంలో పనిచేసిన ఎస్ఐ) ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తాం ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలతో మమేకమవుతున్నాం. సీపీ, ఇతర ఉన్నాతాధికారుల సహకారంతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తాం. స్టేషన్లో సమష్టిగా పని చేయడంతో ఈ ర్యాంకు వచ్చింది. ఇంది మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. – నాగరాజు, ఎస్ఐ, సంస్థాన్ నారాయణపురం ఎస్పీ రంగనాథ్ హర్షం నల్లగొండ క్రైం : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో నల్లగొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు 24వ ర్యాంకు దక్కింది. 2018 సంవత్సరానికి దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబి తాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చోటు లభించడం పట్ల ఎస్పీ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. -
దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ పంజగుట్ట
సాక్షి, హైదరాబాద్: దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ కమిషనరేట్‌లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ అవార్డు దక్కించుకుంది. కేంద్ర హోంశాఖ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా వందకు పైగా స్టేషన్లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, దర్యాప్తు.. ఇలా 140 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో పది పోలీస్ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి వాటిలోంచి మూడు ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కమిషనరేట్ పరిధిలోని గుడుంబా పోలీస్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి. శనివారం మధ్యప్రదేశ్ టెకన్పూర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులో ప్రారంభమైన ఆలిండియా డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ పోలీస్ స్టేషన్లకు ట్రోఫీలను అందజేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంజగుట్ట ఇన్స్పెక్టర్ రవీందర్ అవార్డును స్వీకరించారు. టెక్నాలజీ, స్మార్ట్ పోలీసింగ్‌లో తెలంగాణ దూసుకెళ్తోందని రాజ్‌నాథ్‌సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించినట్టు తెలిసింది. -
కరన్‌కోట్ ఉత్తమ పోలీస్‌స్టేషన్: డీఐజీ
తాండూర్‌రూరల్: రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలంలోని కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌ను డీఐజీ అకున్ సబర్వాల్ మంగళవారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల పెరేడ్‌ను తిలకించారు. రాష్ట్రంలోని ఏడు ఉత్తమ పోలీస్స్టేషన్లలో కరన్‌కోట్ కూడా ఒకటని చెప్పారు. స్టేషన్ నిర్వహణ, క్రమశిక్షణ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల్లో సిబ్బంది పనితీరును మెచ్చుకున్నారు. అనంతరం ఆయన రికార్డులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.