హనుమంతునిపాడు పోలీస్‌స్టేషన్
హనుమంతునిపాడు / ఒంగోలు టౌన్:
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్‌స్టేషన్. 9 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల అభిప్రాయాలను సేకరించి 2022 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డీజీపీ చేతుల మీదుగా ఎస్పీ మల్లికా గర్గ్, ఎస్‌ఐ కృష్ణ పావని, సిబ్బంది పురస్కారాన్ని అందుకున్నారు.
మండల కేంద్రానికి దూరంగా ఉన్నా..
1927వ సంవత్సరం బ్రిటీషు పాలనలో కొండ శివారు గ్రామమైన నందనవనంలో పోలీస్‌సేష్టన్‌ను ఏర్పాటు చేశారు. 1984లో మండలాలు ఏర్పాటైన తర్వాత దీనిని హనుమంతునిపాడు మండల కేంద్రానికి మార్చారు. అయితే పురాతన భవనంలో తుపాకులు, ఇతర సామగ్రికి, సిబ్బందికి నక్సల్స్ నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2004లో కనిగిరి పాత పోలీస్‌స్టేషన్‌లోకి మార్చారు. దాదాపు పదేళ్లకుపైగా మండల కేంద్రానికి దూరంగా నియోజకవర్గ కేంద్రంలో హెచ్‌ఎంపాడు పీఎస్ కొనసాగుతోంది. స్టేషన్ పరిధిలో 23 గ్రామ పంచాయతీల్లో 14 సచివాలయాల కింద 62 హ్యాబిటేషన్ గ్రామాలున్నాయి.
కనిగిరిలోని పోలీస్‌స్టేషన్ భవనం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిబ్బంది మండలానికి దూరంగా ఉన్నా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించారు. ఉన్నతాధికారుల సూచనలతో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ శక్తిమేర సేవలందించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి సెభాష్ అనిపించుకున్నారు. గతేడాది ఆగస్టు 28వ తేదీన కేంద్ర బృందం సర్వే చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కేంద్ర బృందం ద్వారా ప్రశంసలందుకుని పురస్కారానికి అర్హత సాధించారు.
శ్రమకు గుర్తింపు లభించింది
హనుమంతునిపాడు పోలీసు స్టేషన్‌కు ఉత్తమ పోలీసు స్టేషన్‌గా కేంద్ర హోం శాఖ నుంచి అవార్డు రావడం ప్రకాశం జిల్లా పోలీసుల శ్రమకు తగిన గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాను. ముఖ్యంగా హనుమంతునిపాడులో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన కృష్ణ పావని నిబద్ధత కలిగిన అధికారి. ఆమె పనితీరు చాలా బాగుంది. ఆమెతో పాటుగా అక్కడ పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయడంతోనే ప్రజల, ప్రభుత్వ ప్రశంసలు పొందారు.
– ఎస్పీ మలికా గర్గ్
మరింత స్ఫూర్తినినిచ్చింది
ఈ అవార్డు నాకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఎస్పీ మలికా గర్గ్ ఇచ్చిన మద్దతు, సూచనలు, సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించడం, ప్రజలతో సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా బాధితులకు న్యాయం చేయడానికి శక్తిమేర ప్రయత్నించడం మా పోలీసు స్టేషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ విషయాన్ని మండల ప్రజలు కేంద్ర హోం శాఖ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అవార్డు రావడానికి సహచర పోలీసు సిబ్బంది, మండల ప్రజల తోడ్పాటును ఎప్పటికీ మరచిపోలేను.
– కృష్ణ పావని, ఎస్‌ఐ
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకున్న అంశాలు:
● నేరాల నియంత్రణ
● లా అండ్ ఆర్డర్ నిర్వహణ
● చట్టాల అమలు
● కేసుల దర్యాప్తు, విశ్లేషణ
● కోర్టు సమన్లు, కోర్టు మానిటరింగ్
● ప్రోయాక్టివ్ పోలీసింగ్
● కమ్యూనిటీ ఎంగేజ్మెంట్
● పెట్రోలింగ్ నిర్వహణ
● పచ్చదనం, పరిశుభ్రత
Comments
Please login to add a commentAdd a comment