ఐజ్వాల్: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. డిసెంబర్ 3న జరిగే మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దాదాపు 4000 మంది సిబ్బంది పాల్గొంటారని మిజోరం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మధుప్ వ్యాస్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల విభాగం సర్వం సిద్ధం చేసింది. కౌంటింగ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని, రాష్ట్రవ్యాప్తంగా 13 కౌంటింగ్ కేంద్రాలు, 40 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశామని సీఈవో పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలను భద్రంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 కౌంటింగ్ హాళ్లలో 399 ఈవీఎం టేబుల్స్, 56 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని మిజోరం అదనపు సీఈవో హెచ్ లియాంజెలా తెలిపారు. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా 80.66 శాతం ఓటింగ్ నమోదైంది.
పటిష్ట భద్రత
రాష్ట్రంలో డిసెంబర్ 3న జరిగే ఓట్ల కౌంటింగ్‌కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మిజోరాం డీజీపీ అనిల్ శుక్లా చెప్పారు. అన్ని ఓటింగ్ యంత్రాలు వివిధ జిల్లాల్లో భద్రంగా ఉన్నాయని, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. భద్రత కోసం సీఏపీఎఫ్, ఇతర కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయి. అదనంగా ఐఆర్‌బీఎన్, మిజోరం సాయుధ పోలీసులను కూడా మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment