జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. మరోవైపు బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఏయే వర్గాలు ఎవరిని ఆదరించాయి.. గ్రామీణ , అర్బన్ ప్రాంత ఓటర్లు ఎవరికి బాసటగా నిలిచారు.. మైనారిటీలు ఎవరికి మద్దతు పలికారు..యువత ఎటువైపు ఉంది, పింఛనుదారుల ఓట్లు ఎవరికి పడ్డాయి.. తదితర అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ షురువైంది. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడింది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. ఎవరు విజయం సాధిస్తారనేది బుధవారం ఓట్ల లెక్కింపు అనంతరం తేలనుంది. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉండగా, విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై ఇటు రాజకీయవర్గాల్లో సర్వత్రా చర్చ సాగుతోంది.
ఏయే వర్గాలు ఎవరిని ఆదరించాయి... గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు.. పట్టణ, నగర ఓటర్లు ఎవరికి బాసటగా నిలిచారు. మైనారిటీలు ఎవరికి మద్దతు పలికారు..యువత ఏ అభ్యర్థికి బాసటగా నిలిచింది. పింఛనుదారుల మద్దతు ఎవరికి దక్కింది.. ఇలా ఎవరివారే లెక్కలేసుకుంటున్నారు. రాజకీయ వర్గాలతో పాటు, సామాన్య ఓటర్లు సైతం అభ్యర్థుల గెలుపు, ఓటములపై చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు. మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. దీంతో ఈ నియోజకవర్గం ఫలితంపై స్థానిక ఓటర్లతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు..
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిం చేం దుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని ఓట్లను డిచ్‌పల్లిలోని సీఎంసీ మెడికల్ కళాశాలలో లెక్కించనున్నారు. అలాగే కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల కౌంటింగ్ కోసం జగిత్యాలలో వీఆర్‌కే సొసైటీ భవనం లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఫలితం వెల్లడించడానికి ఎక్కువ సమయం పట్టనుంది.
ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి రౌండ్‌లోనూ ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు టేబుళ్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా వీలైనంత తొందరగా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపగా, నిర్ణయం రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment