డిచ్‌పల్లి: రేపు నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు, కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్రానికి రానున్నారు.
గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. కేంద్రం ఆవరణలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు, అధికారుల రాకపోకలకు, వాహనాల పార్కింగ్ లకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కెటాయించిన మార్గంలోనే కౌంటింగ్ కేంద్రంలోని రాకపోకలు సాగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి 185 అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో కౌంటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సిబ్బందికి, ఏజెంట్లకు, బందోబస్తు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ, అడిషనల్ ఎస్పీ శ్రీధర్‌రెడ్డి సమన్వయంలో నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాసకుమార్, ఎన్‌ఐబీ ఏసీపీ రాజారత్నం, సీసీఎస్ ఏసీపీ స్వామి, ఆర్మూర్ ఏసీపీ రాములు, ఏఆర్ ఏసీపీ మహేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. సుమారు 900 మంది సిబ్బంది బందోబస్తు విధులు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment