nizamabad collectorate
-
కలెక్టరేట్ వద్ద కలకలం..
సాక్షి, నిజామాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిషేధిత సిమి అనుబంధ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులుగా భావిస్తున్న ముగ్గురిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. నిజామాబాద్‌లో సమావేశం నిర్వహించేందుకు అనుమతి కోసం సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అరెస్టుచేసి విచారణ చేపట్టగా నిషేధిత సంస్థ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై ఒకటవ టౌన్ పోలీసులను సంప్రదించగా వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అరెస్టయిన వారిలో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాజిద్, నిజామాబాద్‌కు చెందిన షాదుల్ల ఉన్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ఐ సంస్థ రాష్ట్ర నాయకుడు ఇటీవల జగిత్యాల్లో ఓ వర్గం వారితో సమావేశం నిర్వహించగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఏర్పాట్లు ముమ్మరం
డిచ్పల్లి: రేపు నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు, కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్రానికి రానున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. కేంద్రం ఆవరణలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు, అధికారుల రాకపోకలకు, వాహనాల పార్కింగ్ లకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కెటాయించిన మార్గంలోనే కౌంటింగ్ కేంద్రంలోని రాకపోకలు సాగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి 185 అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో కౌంటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సిబ్బందికి, ఏజెంట్లకు, బందోబస్తు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ, అడిషనల్ ఎస్పీ శ్రీధర్‌రెడ్డి సమన్వయంలో నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాసకుమార్, ఎన్ఐబీ ఏసీపీ రాజారత్నం, సీసీఎస్ ఏసీపీ స్వామి, ఆర్మూర్ ఏసీపీ రాములు, ఏఆర్ ఏసీపీ మహేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. సుమారు 900 మంది సిబ్బంది బందోబస్తు విధులు పాల్గొంటున్నారు. -
‘కొడ్’ పాటించండి
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎన్నికల నియ మావళికి సంబంధించి ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసినందున, అందుకనుగుణంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమీక్షి సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా ఖచ్చితత్వంతో, నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల కాలం కాబట్టి ఎన్నికల పనులకు సంబంధించి అధికారులు ప్రతి విషయానికి వెంటనే స్పందించాలని, ప్రధాన కార్యస్థానాల్లోనే ఉండాలని, ఈ సమయం అత్యంత ముఖ్యమైనదన్నారు. అదే విధంగా ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు దరఖాస్తులు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో తీసుకున్నవి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. చనిపోయిన వారు, పూర్తిగా అందుబాటులో లేని వారు, రెండు పేర్లున్న వారికి నోటీసులు జారీ చేసినందున ఈ నెల 30లోగా అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. వయసు తప్పుగా నమోదైనవి ఉంటే సరి చేసి అర్హులను జాబితాలో ఉంచాలన్నారు. పేదలకు పంపిణీ చేసిన భూముల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమస్యగా మారిన భూములకు సంబంధించి ఆరు శాఖల అధికారులు సంయుక్త సర్వే జరిపి నివేదికలు అందించాలని, అర్హులకు న్యాయం జరిగేలా, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వర్తింపజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, తహశీల్ధార్లు, రెవెన్యూ ,అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఈవీఎంలొచ్చాయ్..
సాక్షి ప్రతినిధి నిజామాబాద్: ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలుండటంతో జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు చక చక ఏర్పాట్లు చేస్తోంది. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను చేపట్టిన ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణకు అవసరమైన చర్యలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాకు ఆదివారం కొత్త ఈవీఎంలు వచ్చాయి. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నుంచి 1,890 వీవీ ప్యాట్లు, 1,750 కంట్రోల్ యూనిట్లు, 2,240 బ్యాలెట్ యూనిట్లు జిల్లా కేంద్రంలోని ఎన్నికల సంఘం గోదాముకు చేరుకున్నాయి. వీటిని అధికారులు సరిచూసుకుని గోదాముల్లో భద్రపరిచారు. పోలీసుశాఖ ఇక్కడ భద్రతను మరింత పెంచింది. కొత్తగా వచ్చిన ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రామ్మోహన్రావు పరిశీలించారు. పొలింగ్‌లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు ఎన్నికల సంఘం ఈసారి వీవీ పీఏటీ (ఓటరు వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) యూనిట్లను సపోర్టు చేయగల ఈవీఎంలను వినియోగించాలని నిర్ణయించిన విషయం విదితమే. జిల్లాలో ఉన్న పాత ఈవీఎంలు వీవీ ప్యాట్లకు సపోర్టు చేయవు. దీంతో పాత ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్ యూనిట్లకు సపోర్టు చేయగల అప్డేటెడ్ ఈవీఎంలను వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలో ఉన్న పాత ఈవీఎంలను హైదరాబాద్‌లోని ఈసీఐఎల్, బెంగళూరులోని బీఈఎల్ సంస్థలకు పంపాలని రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి ఆదేశాలందాయి. దీంతో గత ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల పోలింగ్ కోసం వి నియోగించిన 20,826 పాత ఈవీఎంలను ఈసీఐఎల్, బీఈఎల్‌లకు పంపుతున్నారు. ఇటీవల 3,400 పాత ఈవీఎంలను ఆయా సంస్థలకు పం పారు. మిగిలినవి కూడా విడతల వారీగా పంపనున్నారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్ యూనిట్లు సపోర్టు చేయగల అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పిస్తున్నారు. తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,142 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చే యాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఎన్నికలకు అ వసరమైన యూనిట్లు సమకూర్చుకుంటున్నారు. ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు: కలెక్టర్ ఓటరు జాబితాలో పేరు లేని వారు పేరు నమోదు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే గడువు ఉందని, 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రామ్మోహన్రావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు ద్వారానే మంచి అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే, ఇప్పటికే ఓటరు కార్డు ఉన్నవారు జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని, నివాస ప్రాంతం, చిరునామా, నియోజక వర్గాలు వంటి వాటిల్లో ఏమైనా మార్పులుంటే సరిచేయించుకోవాలని తెలిపారు. మరణించిన వారు, డూప్లికేట్ పేర్లుంటే తొలగించుకోవాలని కోరారు. ఓటర్ల వివరాలను ఠీఠీఠీ. nఠిటp. జీn వెబ్సైట్లో సరిచేసుకోవాలని సూచించారు. -
కలెక్టరేట్లో దంపతుల ఆత్మహత్యాయత్నం
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు రావద్దని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వీరికి చెప్పారు. ఎలాంటి తప్పు చేయని తమను ఎందుకు తొలగించారని పాఠశాల హెచ్ఎంతో పాటు మండలాధికారికి, గ్రామ సర్పంచ్‌ను అడిగినా వారు పట్టించుకోలేదు. పైగా గ్రామంలో ఈ కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడవద్దని గ్రామ బహిష్కరణ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవీందర్ రెడ్డి ప్రగతి భవన్ లోపల ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుండగా బయట దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ డబ్బాను తీసి ఒంటిపై పోసుకున్నారు. అగ్గిపెట్ట తీసుకుని నిప్పు పెట్టుకునే సమయానికి అక్కడున్న మహిళా కానిస్టేబుళ్లు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ వద్దకు వీరిని తీసుకెళ్లగా తమ ఆవేదనను విన్నవించారు. ఇన్చార్జి కలెక్టర్ ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్‌ను విచారణకు ఆదేశించారు. -
వసూల్ రాజాలు.. ‘ఆధార్’ పేరిట దోపిడీ పర్వం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: వినియెగాదారులకు చమురు కంపెనీలు ఇచ్చిన వెసులుబాటును డీలర్లు తమకు అనుకూలంగా మలుచుకుని నిర్ణీత రుసుము కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నేరుగా విని యోగదారుల ఖాతాలలోకి పంపించాలని నిర్ణయించింది. వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు. దీంతో జిల్లాలో ఉన్న మూడు లక్షల మంది విని యోగాదారులు తమ తమ బ్యాంకు ఖాతా, ఆధార్ సంఖ్యలను డీలర్లకు అందజేస్తున్నారు. ఇక్కడే డీలర్లు తమ చేతివాటం చూపుతున్నారు. నిన్నమొన్నటి వరకు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా సిలిండర్ తీసుకునే అవకాశం ఉండేది. నగదు బదిలీ పథకం అమలు అయితే కనెక్షన్ ఎవరి పేరిట ఉంటే వారి ఖాతాలోకే సబ్సిడీ బదిలీ అవుతుంది. లేకపోతే తప్పనిసరిగా నాన్ సబ్సిడీ సిలిండర్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఈ పరిస్థితిని తప్పించడానికి చమురు కంపెనీలు వినియోగదారులకు కొంత వెసులుబాటును కల్పించాయి. నిర్ధిష్ట రుసుమును చెల్లించి ఇతరుల పేరిట ఉన్న కనెక్షన్‌ను తమ పేరు మీదికి మార్చుకోనే అవకాశం ఇచ్చాయి. నగదు బదిలీ పథకం గడువు సమీపిస్తుండడంతో వినియోగదారులు పేరు మార్పిడి కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇష్టానుసారంగా కాగా, డీలర్లు నిబంధనల పేరిట, చమురు కంపెనీలు నిర్ణయించిన రేటు కాకుండా, వారికి తోచిన రీతిలో వసూళ్లు ప్రారంభించారు. తండ్రి పేరు మీద ఉన్న కనెక్షన్ కొడుకు పేరిట మార్చుకోవడానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని ఏజెన్సీలు ఇందుకోసం రూ. 1500 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నాయి. ఇతరుల పేరు నుంచి మార్చుకోవడానికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కానీ, రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు. బాండ్ పేపరు పోతే రూ. 1300 డీడీ కట్టాలి. కానీ రూ.1700 నుంచి రూ. 2400 వరకు వసూలు చేస్తున్నారు. దీపం పథకం లబ్ధిదారులు చనిపోతే పేరు మార్చుకోవడానికి రూ.1700 వరకు వసూలు చేస్తున్నారు. 25 రూపాయల పాస్ పుస్తకానికి వంద రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కనెక్షన్ మార్పిడికి సంబంధించిన వివరాలతో కూడిన బోర్డులను ఏజెన్సీలు తమ కార్యాలయాలలో తప్పక ఏర్పాటు చేయాలి. కానీ, జిల్లాలో ఎక్కడా ఇలాంటి బోర్డులు పెట్టిన దాఖలాలు లేవు. పేరు మార్పిడి కోసం మనిషికో రేటును నిర్ణయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.