ఇందూరు(నిజామాబాద్ అర్బన్): మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు రావద్దని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వీరికి చెప్పారు.
ఎలాంటి తప్పు చేయని తమను ఎందుకు తొలగించారని పాఠశాల హెచ్‌ఎంతో పాటు మండలాధికారికి, గ్రామ సర్పంచ్‌ను అడిగినా వారు పట్టించుకోలేదు. పైగా గ్రామంలో ఈ కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడవద్దని గ్రామ బహిష్కరణ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్ రెడ్డి ప్రగతి భవన్ లోపల ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుండగా బయట దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ డబ్బాను తీసి ఒంటిపై పోసుకున్నారు. అగ్గిపెట్ట తీసుకుని నిప్పు పెట్టుకునే సమయానికి అక్కడున్న మహిళా కానిస్టేబుళ్లు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ వద్దకు వీరిని తీసుకెళ్లగా తమ ఆవేదనను విన్నవించారు. ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్మూర్ ఆర్‌డీఓ శ్రీనివాస్‌ను విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment