మూడో పెళ్లికి భర్త సిద్ధపడటంతో కోర్టులోనే..
తణుకు(పశ్చిమ గోదావరి): భర్త మూడో పెళ్లికి సిద్ధపడటంతో మనస్తాపం చెందిన ఓ మహిళ కోర్టు ఆవరణలో ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితురాలుతెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన తోట వరలక్ష్మికి తణుకు ఆంధ్రా షుగర్స్ కర్మాగారంలో పని చేస్తున్న తోట సుబ్బారావుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అప్పటికే అతడికి తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన బిందు అనే మహిళతో వివాహమైంది.
ఆమెను వదిలేసిన సుబ్బారావు వరలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొంత కాలంగా వరలక్ష్మి పుట్టింట్లో ఉంటోంది. కాగా సుబ్బారావు మరో మహిళను వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమెకు తెలియడంతో మంగళవారం తణుకు వచ్చింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా సుబ్బారావు సోదరురుడు లక్ష్మీనారాయణ ఆమెను కోర్టు ఆవరణలో అడ్డుకున్నాడు. ఈ దశలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ ‘సుబ్బారావు నీతో కాపురం చేయడు.. నీకు చేతనైంది చేసుకో’ అని తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురైన వరలక్ష్మి తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగేసింది. అపస్మారక స్థితికి చేరుకున్నఆమెను 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.