భార్యాబిడ్డలను కడతేర్చిన కసాయి
తాగుడుకు బానిసైన వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవ పడుతూ వేధించేవాడు. బాధలు పడలేక భార్య పుట్టింటికి వెళ్లి బిడ్డల్ని పోషించుకుంటోంది. భార్య దగ్గరకువెళ్లి తాను మారిపోయూనని, ఇకపై బాగా చూసుకుంటానని నమ్మబలికాడు. అత్తమామలు తొలుత సంశయించినా కూతురికి సర్దిచెప్పి అల్లుడి వెంట సాగనంపారు. పదిరోజులు గడవలేదు. నిద్రిస్తున్న భార్యా బిడ్డల్ని తాడుతో గొంతు బిగించి కర్కశంగా చంపేశాడు. ఆపై తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చింతలపాలెం గ్రామంలో మంగళవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
* తాడుతో గొంతు బిగించి ఒకరి తర్వాత మరొకరి హత్య
* తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం
* ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నిందితుడు
* కనిగిరి నగర పంచాయతీ చింతలపాలెంలో ఘటన
కనిగిరి (ప్రకాశం జిల్లా) : కనిగిరి నగర పంచాయతీ చింతలపాలేనికి చెందిన తమ్మినేని శ్రీనివాసులరెడ్డి(అయోధ్య)కి సుబ్బులుతో మొదటి వివాహమైంది. ఇద్దరు పిల్లలు నాగార్జున, ప్రవళిక పుట్టిన తర్వాత 15 ఏళ్ల క్రితం సుబ్బులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత పదేళ్ల క్రితం బాపట్ల మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన అప్పిరెడ్డి ద్వితీయ కుమార్తె ఆదిలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు.
వీరికి గణేష్(7), భవాని(5) పుట్టారు. భర్త వేధింపులు తాళలేక ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్లి ఉంటుంది. శ్రీనివాసులరెడ్డి 20 రోజుల క్రితం మర్రిపూడి వెళ్లాడు. భార్యా పిల్లలను ఇకపై జాగ్రత్తగా చూసుకుంటానని అత్త, మామలను నమ్మించాడు. కూతురు సంసారం కోసం ఈనెల 20న అల్లుడితో చింతలపాలేనికి సాగనంపారు. బ్యాంకులో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు, నగదును కూడా ఆదిలక్ష్మి వెంట తీసుకె ళ్లింది.
కర్కశంగా కడతేర్చాడు..
సోమవారం రాత్రి సుమారు 10 గంటల తర్వాత శ్రీనివాసులరెడ్డి ఇంటికి వచ్చాడు. భార్య ఆదిలక్ష్మి ఇంటి మిద్దెపై పడుకొంది. ఇద్దరు పిల్లలు నాయనమ్మ పిచ్చమ్మ దగ్గర కింద పడుకున్నారు. పెద్ద కుమార్తె ప్రవళిక(వికలాంగురాలు) కూడా ఇంట్లో కిందనే పడుకుంది. పథకం ప్రకారం తెల్లవారు జామున మిద్దెపైకి వె ళ్లి నిద్రిస్తున్న భార్య గొంతుకు తాడు బిగించి చంపాడు. ఆ తర్వాత కుమార్తె భవాని, కుమారుడు గణేష్‌ను ఒక్కొక్కరిని మిద్దెపైకి తీసు కెళ్లి గొంతు బిగించి కడతేర్చాడు.
ఆ తర్వాత బీపీ, మత్తుమాత్రలు కలిపి మింగేశాడు. రోజు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసే పిన్నమ్మ, ఆడుకునే పిల్లలు కిందకు రాక పోవడంతో మిద్దె పైకి వెళ్లి చూసింది. అక్కడి దృశ్యాలు చూసి భయపడి కేకలు పెట్టుకుంటూ కిందికి వచ్చింది. ఇరుగు పొరుగు వారు వె ళ్లి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు తీసుకెళ్లారు.
ఆదిలక్ష్మి బంధువుల ఆందోళన..
ఘటన విషయం తెలుసుకున్న ఆదిలక్ష్మి బంధువులు హుటాహుటిన చింతలపాలెం చేరుకున్నారు. ఈ హత్యల్లో శ్రీనివాసులరెడ్డితో పాటు అతని బంధువుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. చివరకు సీఐ యు.సుధాకర్‌రావు నచ్చజెప్పి మృతదేహాలను కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెడువ్యసనాలకు బానిసైన శ్రీనివాసులరెడ్డి భార్యాపిల్లలను హతమార్చినట్లు తెలుస్తోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు.
సూసైడ్ నోట్ లభ్యం..
ఆస్పత్రి పాలైన శ్రీనివాసులరెడ్డి వద్ద ఓ సూసైడ్ నోట్ దొరికింది. అందులో కొందరికి తాను బకాయి ఉన్నట్లు రాసి, వాటిని తీర్చమంటూ తల్లిదండ్రులకు సూచించాడు. భార్యాబిడ్డలను చంపి, తానూ చనిపోతున్నట్టు పేర్కొన్నాడు. మొదటి భార్య పిల్లలను బాగా చదువుకోమని, తమ చావుకు ఎవరూ కారకులు కాదని పేర్కొన్నాడు. లేఖలో ఉదహరించిన అప్పులు మొత్తం కలిపినా లక్షన్నర రూపాయలు కూడా లేవు. ఇల్లు, పొలం ఉన్న శ్రీనివాసులరెడ్డి ఈ మాత్రం బాకీకే చనిపోవాల్సిన అవసరం లేదని, ఈ ఘటనకు బలమైన కారణం ఏదో ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.