కలెక్టరేట్, న్యూస్‌లైన్: వినియెగాదారులకు చమురు కంపెనీలు ఇచ్చిన వెసులుబాటును డీలర్లు తమకు అనుకూలంగా మలుచుకుని నిర్ణీత రుసుము కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నేరుగా విని యోగదారుల ఖాతాలలోకి పంపించాలని నిర్ణయించింది. వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
దీంతో జిల్లాలో ఉన్న మూడు లక్షల మంది విని యోగాదారులు తమ తమ బ్యాంకు ఖాతా, ఆధార్ సంఖ్యలను డీలర్లకు అందజేస్తున్నారు. ఇక్కడే డీలర్లు తమ చేతివాటం చూపుతున్నారు. నిన్నమొన్నటి వరకు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా సిలిండర్ తీసుకునే అవకాశం ఉండేది. నగదు బదిలీ పథకం అమలు అయితే కనెక్షన్ ఎవరి పేరిట ఉంటే వారి ఖాతాలోకే సబ్సిడీ బదిలీ అవుతుంది. లేకపోతే తప్పనిసరిగా నాన్ సబ్సిడీ సిలిండర్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఈ పరిస్థితిని తప్పించడానికి చమురు కంపెనీలు వినియోగదారులకు కొంత వెసులుబాటును కల్పించాయి. నిర్ధిష్ట రుసుమును చెల్లించి ఇతరుల పేరిట ఉన్న కనెక్షన్‌ను తమ పేరు మీదికి మార్చుకోనే అవకాశం ఇచ్చాయి. నగదు బదిలీ పథకం గడువు సమీపిస్తుండడంతో వినియోగదారులు పేరు మార్పిడి కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు.
ఇష్టానుసారంగా
కాగా, డీలర్లు నిబంధనల పేరిట, చమురు కంపెనీలు నిర్ణయించిన రేటు కాకుండా, వారికి తోచిన రీతిలో వసూళ్లు ప్రారంభించారు. తండ్రి పేరు మీద ఉన్న కనెక్షన్ కొడుకు పేరిట మార్చుకోవడానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని ఏజెన్సీలు ఇందుకోసం రూ. 1500 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నాయి. ఇతరుల పేరు నుంచి మార్చుకోవడానికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కానీ, రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు. బాండ్ పేపరు పోతే రూ. 1300 డీడీ కట్టాలి. కానీ రూ.1700 నుంచి రూ. 2400 వరకు వసూలు చేస్తున్నారు. దీపం పథకం లబ్ధిదారులు చనిపోతే పేరు మార్చుకోవడానికి రూ.1700 వరకు వసూలు చేస్తున్నారు. 25 రూపాయల పాస్ పుస్తకానికి వంద రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కనెక్షన్ మార్పిడికి సంబంధించిన వివరాలతో కూడిన బోర్డులను ఏజెన్సీలు తమ కార్యాలయాలలో తప్పక ఏర్పాటు చేయాలి. కానీ, జిల్లాలో ఎక్కడా ఇలాంటి బోర్డులు పెట్టిన దాఖలాలు లేవు. పేరు మార్పిడి కోసం మనిషికో రేటును నిర్ణయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
వసూల్ రాజాలు.. ‘ఆధార్’ పేరిట దోపిడీ పర్వం
Published Mon, Nov 25 2013 6:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement