Gas Dealers
-
ఆధార్ సీడింగ్‌కు స్పెషల్ డ్రైవ్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని తక్షణం గ్యాస్ డీలర్లకు అంద జేయాలని జేసీ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. వాటి వివరాలు సేకణలో నిర్లక్ష్యం వహిస్తున్న రైల్వే, కోరమండల్, పోలీస్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం రాత్రి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీల పరిధిలో వచ్చే జనవరి 3,4,5 తేదీల్లో సీడింగ్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారం నమోదుకు ఈ అవకాశాన్ని గ్యాస్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీలర్లు తమ పరిధిలోని వినియోగదారుల నుంచి సమాచారం సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, వారికి సహకరించాలన్నారు. ఆధార్ ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారి కోసం విశాఖ నగర పరిధిలో 21 ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాలకు వెళ్లి ఆధార్ నమోదు చేయించుకుంటేనే వారం రోజుల్లో నంబర్లు కేటాయిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఇంటింటికి వెళ్లి ఈసమాచారం సేకరించే కార్యక్రమం చేపడతారన్నారు. జనవరి మొదటివారం లోగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ ప్రక్రియ నూరుశాతం పూర్తి కావాలన్నారు. ఆధార్,బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కాకుంటే ఏప్రిల్ ఒకటి తర్వాత వారికి గ్యాస్ సరఫరా నిలిపివేసే అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకులు తమ వద్దకు గ్యాస్ డీలర్లు తీసుకు వచ్చే దరఖాస్తులను స్వీకరించి సమాచారం నమోదు చేయాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖాధికారులు రవితేజ నాయక్, శాంతకుమారి పాల్గొన్నారు. -
గ్యాస్ డీలర్ల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: ఈ నెల 25 నుంచి తలపెట్టిన సమ్మెను వంట గ్యాస్ డీలర్లు వాయిదా వేసుకున్నారు. డీలర్ల సమస్యలపై చర్చలు జరపడానికి ఆయిల్ కంపెనీలు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఆలిండియా ఎల్పీజీ పంపిణీ దారుల సమాఖ్య, ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు సంయుక్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పంపిణీలో కొరత ఏర్పడిన సందర్భాల్లో తీసుకునే క్రమశిక్షణ చర్యలను నిరసిస్తూ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గ్యాస్ డీలర్ల సంఘాలు, ఆయిల్ కంపెనీల మధ్య చర్చల కోసం సంయుక్త ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులోడీలర్ల సంఘాలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఉంటారు. వచ్చే నెల 31 లోపు నివేదిక సమర్పించనున్నారు. -
‘నగదు బదిలీ’పై నిర్లక్ష్యం తగదు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జాయింట్ కలెక్టర్ కన్నబాబు హెచ్చరించారు. ఈనెల 1వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం క్ఫారెన్స్ హాల్లో గ్యాస్ డీలర్లు, సీఎస్డీటీలు, ఏఎస్‌ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వినియోగదారుల నుంచి సేకరించిన ఆధార్, బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ నంబర్లు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అలసత్వం వహిస్తున్న గ్యాస్ డీలర్లకు నోటీసులు ఇచ్చి సస్పెన్షన్‌కు సిఫారసు చేయాలని డీఎస్ఓను ఆదేశించారు. నాలుగు రోజుల్లో అంటే ఈనెల 6వ తేదీలోగా సేకరించిన వివరాలను 100 శాతం ఎస్ఆర్డీహెచ్ సైట్లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా 5,54,724 గ్యాస్ వినియోగదారులు ఉన్నారని, ఇందులో 4,35,425 మంది నుంచి ఆధార్ యుఐడీ, లేదా ఈఐడీ, బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ నంబరు సేకరించామన్నారు. అయితే వీటిని ఆన్లైన్లో ఎస్ఆర్డీహెచ్సైట్లో నమోదు(ఫీడింగ్) చేయాల్సి ఉందని, అప్పుడే అనుసంధానానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 29,99,647 మందికి చెందిన వివరాలు మాత్రమే నమోదు చేశారని, మిగిలిన వాటిని నాలుగు రోజుల్లో ఫీడింగ్ చేయకపోతే చర్యలకు బాధ్యులవుతారని తెలిపారు. కోడుమూరు ఎస్ఎన్ఆర్ గ్యాస్ ఏజెన్సీ, కర్నూలు నిర్మల, సదానందీశ్వర గ్యాస్ ఏజెన్సీలు, ఆళ్లగడ్డలోని హేమాంజలీ, నేహా గ్యాస్ ఏజెన్సీలు, ఎమ్మిగనూరు భాస్కర్ గ్యాస్, ఆదోనిలోని ఆదోని గ్యాస్, పత్తికొండలోని సూర్యభరత్ గ్యాస్, మంత్రాలయంలోని ఎస్ఆర్ఎస్ గ్యాస్ ఏజెన్సీలు వివరాలను నమోదు చేయడంలో వెనుకబడి ఉన్నాయన్నారు. వీటికి వెంటనే నోటీసులు ఇవ్వాలని, అదే విధంగా సంబంధిత సీఎస్‌డీటీ, ఏఎస్‌ఓలకు మెమోలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంకా 1,19,299 మంది నుంచి ఆధార్, యుఐడీ లేదా ఈఐడీ బ్యాంకు అకౌంట్ నంబర్, సెల్‌ఫోన్ నంబరు వివరాలు సత్వరం సేకరించాలన్నారు. గ్యాస్ డీలర్లు డోర్ టు డోర్ తిరిగి ఈ వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చినందున గ్యాస్ డీలర్లు, సీఎస్డీటీలు, ఏఎస్ఓలు జవాబుదారీ తనంతో పని చేయాలన్నారు. ఇప్పటి వరకు ఆధార్‌తో గ్యాస్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, సెల్‌ఫోన్ నంబర్లను అనుసంధానం చేసింది 1.40 లక్షలు మాత్రమేనని వివరించారు. అనుసంధానం పూర్తయిన వారి వివరాలను వెంటనే ఎల్డీఎంకు ఇవ్వాలని ఆదేశించారు. ఖాతాలు ప్రారంభించడానికి బ్యాంకర్లు సహకరించడం లేదని జేసీ దృష్టికి పలువురు గ్యాస్ డీలర్లు తెచ్చారు. దీనిపై స్పందిస్తూ గ్యాస్ వినియోగదారుల చేత యుద్ధ ప్రాతిపదికగా ఆదేశాలు ఇవ్వాలని ఎల్డీఎంను కోరారు. సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎల్డీఎం అండవార్, భారత్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్ శివ ప్రసాద్‌రెడ్డి, ఏఎస్ఓలు పాల్గొన్నారు. -
వసూల్ రాజాలు.. ‘ఆధార్’ పేరిట దోపిడీ పర్వం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: వినియెగాదారులకు చమురు కంపెనీలు ఇచ్చిన వెసులుబాటును డీలర్లు తమకు అనుకూలంగా మలుచుకుని నిర్ణీత రుసుము కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నేరుగా విని యోగదారుల ఖాతాలలోకి పంపించాలని నిర్ణయించింది. వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు. దీంతో జిల్లాలో ఉన్న మూడు లక్షల మంది విని యోగాదారులు తమ తమ బ్యాంకు ఖాతా, ఆధార్ సంఖ్యలను డీలర్లకు అందజేస్తున్నారు. ఇక్కడే డీలర్లు తమ చేతివాటం చూపుతున్నారు. నిన్నమొన్నటి వరకు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా సిలిండర్ తీసుకునే అవకాశం ఉండేది. నగదు బదిలీ పథకం అమలు అయితే కనెక్షన్ ఎవరి పేరిట ఉంటే వారి ఖాతాలోకే సబ్సిడీ బదిలీ అవుతుంది. లేకపోతే తప్పనిసరిగా నాన్ సబ్సిడీ సిలిండర్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఈ పరిస్థితిని తప్పించడానికి చమురు కంపెనీలు వినియోగదారులకు కొంత వెసులుబాటును కల్పించాయి. నిర్ధిష్ట రుసుమును చెల్లించి ఇతరుల పేరిట ఉన్న కనెక్షన్‌ను తమ పేరు మీదికి మార్చుకోనే అవకాశం ఇచ్చాయి. నగదు బదిలీ పథకం గడువు సమీపిస్తుండడంతో వినియోగదారులు పేరు మార్పిడి కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇష్టానుసారంగా కాగా, డీలర్లు నిబంధనల పేరిట, చమురు కంపెనీలు నిర్ణయించిన రేటు కాకుండా, వారికి తోచిన రీతిలో వసూళ్లు ప్రారంభించారు. తండ్రి పేరు మీద ఉన్న కనెక్షన్ కొడుకు పేరిట మార్చుకోవడానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని ఏజెన్సీలు ఇందుకోసం రూ. 1500 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నాయి. ఇతరుల పేరు నుంచి మార్చుకోవడానికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కానీ, రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు. బాండ్ పేపరు పోతే రూ. 1300 డీడీ కట్టాలి. కానీ రూ.1700 నుంచి రూ. 2400 వరకు వసూలు చేస్తున్నారు. దీపం పథకం లబ్ధిదారులు చనిపోతే పేరు మార్చుకోవడానికి రూ.1700 వరకు వసూలు చేస్తున్నారు. 25 రూపాయల పాస్ పుస్తకానికి వంద రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కనెక్షన్ మార్పిడికి సంబంధించిన వివరాలతో కూడిన బోర్డులను ఏజెన్సీలు తమ కార్యాలయాలలో తప్పక ఏర్పాటు చేయాలి. కానీ, జిల్లాలో ఎక్కడా ఇలాంటి బోర్డులు పెట్టిన దాఖలాలు లేవు. పేరు మార్పిడి కోసం మనిషికో రేటును నిర్ణయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.