కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:
నగదు బదిలీ పథకం అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జాయింట్ కలెక్టర్ కన్నబాబు హెచ్చరించారు. ఈనెల 1వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం క్ఫారెన్స్ హాల్‌లో గ్యాస్ డీలర్లు, సీఎస్‌డీటీలు, ఏఎస్‌ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వినియోగదారుల నుంచి సేకరించిన ఆధార్, బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ నంబర్లు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అలసత్వం వహిస్తున్న గ్యాస్ డీలర్లకు నోటీసులు ఇచ్చి సస్పెన్షన్‌కు సిఫారసు చేయాలని డీఎస్‌ఓను ఆదేశించారు. నాలుగు రోజుల్లో అంటే ఈనెల 6వ తేదీలోగా సేకరించిన వివరాలను 100 శాతం ఎస్‌ఆర్‌డీహెచ్ సైట్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా 5,54,724 గ్యాస్ వినియోగదారులు ఉన్నారని, ఇందులో 4,35,425 మంది నుంచి ఆధార్ యుఐడీ, లేదా ఈఐడీ, బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ నంబరు సేకరించామన్నారు. అయితే వీటిని ఆన్‌లైన్‌లో ఎస్‌ఆర్‌డీహెచ్‌సైట్‌లో నమోదు(ఫీడింగ్) చేయాల్సి ఉందని, అప్పుడే అనుసంధానానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
ఇప్పటి వరకు 29,99,647 మందికి చెందిన వివరాలు మాత్రమే నమోదు చేశారని, మిగిలిన వాటిని నాలుగు రోజుల్లో ఫీడింగ్ చేయకపోతే చర్యలకు బాధ్యులవుతారని తెలిపారు. కోడుమూరు ఎస్‌ఎన్‌ఆర్ గ్యాస్ ఏజెన్సీ, కర్నూలు నిర్మల, సదానందీశ్వర గ్యాస్ ఏజెన్సీలు, ఆళ్లగడ్డలోని హేమాంజలీ, నేహా గ్యాస్ ఏజెన్సీలు, ఎమ్మిగనూరు భాస్కర్ గ్యాస్, ఆదోనిలోని ఆదోని గ్యాస్, పత్తికొండలోని సూర్యభరత్ గ్యాస్, మంత్రాలయంలోని ఎస్‌ఆర్‌ఎస్ గ్యాస్ ఏజెన్సీలు వివరాలను నమోదు చేయడంలో వెనుకబడి ఉన్నాయన్నారు.
వీటికి వెంటనే నోటీసులు ఇవ్వాలని, అదే విధంగా సంబంధిత సీఎస్‌డీటీ, ఏఎస్‌ఓలకు మెమోలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంకా 1,19,299 మంది నుంచి ఆధార్, యుఐడీ లేదా ఈఐడీ బ్యాంకు అకౌంట్ నంబర్, సెల్‌ఫోన్ నంబరు వివరాలు సత్వరం సేకరించాలన్నారు. గ్యాస్ డీలర్లు డోర్ టు డోర్ తిరిగి ఈ వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చినందున గ్యాస్ డీలర్లు, సీఎస్‌డీటీలు, ఏఎస్‌ఓలు జవాబుదారీ తనంతో పని చేయాలన్నారు. ఇప్పటి వరకు ఆధార్‌తో గ్యాస్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, సెల్‌ఫోన్ నంబర్లను అనుసంధానం చేసింది 1.40 లక్షలు మాత్రమేనని వివరించారు. అనుసంధానం పూర్తయిన వారి వివరాలను వెంటనే ఎల్‌డీఎంకు ఇవ్వాలని ఆదేశించారు. ఖాతాలు ప్రారంభించడానికి బ్యాంకర్లు సహకరించడం లేదని జేసీ దృష్టికి పలువురు గ్యాస్ డీలర్లు తెచ్చారు. దీనిపై స్పందిస్తూ గ్యాస్ వినియోగదారుల చేత యుద్ధ ప్రాతిపదికగా ఆదేశాలు ఇవ్వాలని ఎల్‌డీఎంను కోరారు. సమావేశంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఎల్‌డీఎం అండవార్, భారత్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్ శివ ప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌ఓలు పాల్గొన్నారు.
‘నగదు బదిలీ’పై నిర్లక్ష్యం తగదు
Published Fri, Jan 3 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement