కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్భందీగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్‌హాల్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరుగా దారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నందున.. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 5.45 గంటలలోగా కౌంటింగ్ కేంద్రానికి రావాలని సూచించారు. ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్‌రూంలు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరువబడుతాయని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి తెలపాలని అన్నారు.
ఏజెంట్ల సెల్‌ఫోన్లు లోనికి అనుమతించబడవు...
ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్ల సెల్‌ఫోన్లు లెక్కింపు కేంద్రాల్లోనికి అనుమతించడం లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కౌంటింగ్ కేంద్ర వద్ద ఏజెంట్లు సెల్‌ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ సెల్‌ఫోన్లను తీసుకురావద్దని సూచించారు. లెక్కింపు కేంద్రాల సందర్శనలో సీపీ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, ఎన్నికల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు, కరీంనగర్ ఆర్‌డీవో ఆనంద్‌కుమార్, హుజూరాబాద్ ఆర్‌డీవో చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment