లోక్‌సభ ఓట్ల కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు | Telangana Lok Sabha Elections Counting Arrangements | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఓట్ల కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు

Published Sun, May 19 2019 9:29 AM | Last Updated on Sun, May 19 2019 9:29 AM

Telangana Lok Sabha Elections Counting Arrangements - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : లోక్‌ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 23వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. దీంతో అటు అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లకు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడం పూర్తయ్యింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా కౌంటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డు చేయనున్నారు. ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందితే వెబ్‌ కాస్టింగ్‌ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ లో క్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 11వ తేదీన పోలింగ్‌ జరగగా 15,85,433 మంది ఓటర్లకు గాను.. 11,75,129 మంది ఓ టర్లు (74.12 శాతం )తమ ఓట్లు హక్కు వినియోగించుకున్నారు.మిర్యాలగూడ రోడ్డులోని దుప్పలపల్లిలోని వేర్‌హౌస్‌ గోదాముల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం
ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. పార్టీల ఏజెంట్లు అంతా 6.30 గంటల వరకే కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకుంటారు. వారి సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూమ్‌ల సీల్‌ను తీస్తారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి కౌంటింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకొస్తారు. అదంతా వీడియో రికార్డింగ్‌ జరుగుతుంది. కాగా, 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు.

అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు
నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఒక్కో ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ఆర్‌ఓ టేబుల్‌ వద్దనే లెక్కిస్తారు. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల వారీగా 14 టేబుళ్లలో ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌తో పాటు ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్‌ ఉంటారు. వీడియో రికార్డింగ్‌తో పాటు మైక్రో అబ్జర్వర్‌ కూడా ఓట్ల లెక్కింపు వద్ద ఉండి పరిశీలిస్తారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొత్తం 1990 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పోలైన ఓట్లను మొత్తంగా 144రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న పోలింగ్‌ స్టేషన్ల ఆధారంగా కౌంటింగ్‌ కొనసాగుతుంది.

దేవరకొండ నియోజకవర్గంలో 308 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 22 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుండగా, నాగార్జున సాగర్‌లో 293 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అవి 21 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 256 పోలింగ్‌ స్టేషన్లు 19 రౌండ్లలో, హజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని 302 పోలింగ్‌ స్టేషన్లు 22 రౌండ్లలో, కోదాడలోని 286 పోలింగ్‌ స్టేషన్లు 21 రౌండ్లలో, సూర్యాపేటలో 264 పోలింగ్‌ స్టేషన్లు 19 రౌండ్లలో పూర్తవుతుండగా నల్లగొండ నియోజకవర్గంలో 281 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 20 రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తికానుంది. అంటే ఒక గంటలో 3 నుంచి 4 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయినా.. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
 
ఈవీఎంల తర్వాత వీవీప్యాట్ల లెక్కింపు

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించనున్నారు. అవి కూడా డ్రా పద్ధతిన ఎంపిక చేసి వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు. ఆతర్వాత కౌంటింగ్‌ పూర్తవుతుంది. 

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని  కలెక్టర్‌ డాక్టర్‌గౌరవ్‌ ఉప్పల్‌ అధికారులను ఆదేశించారు.  శనివారం దుప్పలపల్లి గోదామును జాయింట్‌ కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌తో కలిసి సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. ఈనెల 23న కౌంటింగ్‌ నిర్వహించనున్నందున సత్వరం ఏర్పాట్లు చేయాలని, ఈ నెల 21న ఈసీఐ డ్రెస్‌ రిహార్సల్స్‌ నాటికి కౌంటింగ్‌ హాల్‌లలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారి గదిలో పోస్టల్‌ బ్యాలెట్, ఈటీపీబీఎస్, సర్వీస్‌ ఓటర్ల లెక్కింపు ఏర్పాట్లపై చర్చించారు.

నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌ హాల్‌లు పర్యటించి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చిస్తూ, ఏజెంట్లు, కౌంటింగ్‌ సిబ్బందికి వేర్వేరుగా దారులు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.  కౌం టింగ్‌ సెంటర్‌ పెయిడ్‌ క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. పారి శుద్ధ్యం, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్‌ హాల్‌ వారీగా ఏర్పాట్లు జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షించాలని, మౌలిక వసతులు రిపోర్టింగ్, ఇతరత్రా జిల్లా రెవెన్యూ అధికా రి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారివెంట డీఆర్‌ఓ రవీంద్రనాథ్, ఆర్‌డీఓ జగదీశ్‌రెడ్డి, సర్వే ఏడీ శ్రీనివాసులు, పంచాయతీ రాజ్‌ డీఈ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.  

 సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షించాలి
నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ ఎన్నికల కౌం టింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షణ చేయాలని  కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ కా ర్యాలయంలో ఉదయాదిత్య భవన్‌లో కౌంటింగ్‌ ప్రక్రియపై పరిశీలనకు నియమించిన 140మంది సూక్ష్మ పరిశీలకులకు నియమించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్‌ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు ధనంజయ్‌ దేవాంగన్‌ నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, ఎల్‌ఎస్‌కెన్‌ అదనపు పరిశీలకులు నల్లగొండ, కోదా డ, సూర్యాపేట అసెంబ్లీ  నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌ పరిశీలిస్తారని వివరించారు. ఎన్నికల పరిశీలకుల తరఫున సూక్ష్మ పరిశీలకులుగా నియమించిన బ్యాంక్, ఎల్‌ఐసీ, ఇతర ఉద్యోగులు కౌం టింగ్‌ రోజున బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, నల్లగొం డ ఎల్‌డీఎం సూర్యం, సూర్యాపేట ఎల్‌డీఎం శ్రీనివాస్, జేడీఏ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.  

కౌంటింగ్‌ కేంద్రం వద్ద విజిటింగ్‌ సంతకం చేస్తున్న కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement