పకడ్బందీగా కౌంటింగ్‌ | Telangana Lok Sabha Elections Result Full Security | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా కౌంటింగ్‌

Published Wed, May 22 2019 7:54 AM | Last Updated on Wed, May 22 2019 7:54 AM

Telangana Lok Sabha Elections Result Full Security - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ కర్ణన్, పక్కన పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ను ఈ నెల 23వ తేదీన పకడ్బందీగా చేపట్టనున్నట్లు ఖమ్మం పార్లమెంటరీ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో ఖమ్మం మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఈవీఎంల కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుందన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఖమ్మం నియోజకవర్గానికి 23 రౌండ్స్, పాలేరుకు 20, మధిర 19, వైరా 17, సత్తుపల్లి 20, కొత్తగూడెం 18, అశ్వారావుపేట నియోజకవర్గానికి 14 రౌండ్లుగా నిర్ణయించామని చెప్పారు.

ఒక్కో టేబుల్‌కు అభ్యర్థికొకరు చొప్పున  ఏజెంట్‌ కూడా లెక్కింపులో ఉంటారని, లెక్కింపు కోసం 127 మంది కౌంటింగ్‌ అబ్జర్వర్లు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు 128 మంది, మైక్రో అబ్జర్వర్లు 128 మంది ఉంటారని తెలిపారు. ఈవీఎంల కౌంటింగ్‌ అనంతరం ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించనున్నట్లు వివరించారు. ఒక వేళ ఏమైనా తేడా వస్తే చివరిగా వీవీ ప్యాట్ల స్లిప్పుల ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1683 ఉండగా.. 830 మంది ఓట్లు వేశారని, సర్వీస్‌ ఓటర్లు 715కి 431మంది ఓట్లు వేశారని  పేర్కొన్నారు. కాగా, కౌంటింగ్‌ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులకు సంబంధించిన ఫోన్ల అనుమతి లేదని స్పష్టం చేశారు.

జిల్లాలో 15,13,094 మంది ఓటర్లు ఉండగా 11,38,130 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 75.22 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఫలితాలను రౌండ్ల వారీగా తెలియజేస్తామని, అంతిమ ఫలితం మాత్రం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఐదు వీవీ ప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు అనంతరం మాత్రమే ప్రకటించనున్నట్లు వివరించారు. సువిధ వెబ్‌ సర్వీస్‌ ద్వారా ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును పటిష్టంగా చేపట్టనుండగా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నామని, 400 మంది పోలీస్‌ సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తుగా ఉంటారని పేర్కొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రం ప్రాంగణాన్ని 6 సెక్టార్లుగా విభజించి మూడంచెల భద్రత కల్పించామని, కౌంటింగ్‌ కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్స్, స్మార్ట్‌ చేతి గడియారాలు వంటి వస్తువులు అనుమతించబోమని సీపీ తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో షామియానాలు, మైకులు, వాహనాలను అనుమతించేది లేదని, కౌంటింగ్‌ కేంద్రంలో ప్రవేశించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను తప్పనిసరిగా పాటించి ప్రతిఒక్కరూ సహకరించాలని సీపీ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement