‘ప్రాదేశిక’ కౌంటింగ్‌కు ఏర్పాట్లు  | Teachers ZPTC And MPTC Counting Arrangements | Sakshi
Sakshi News home page

‘ప్రాదేశిక’ కౌంటింగ్‌కు ఏర్పాట్లు 

Published Mon, May 20 2019 8:03 AM | Last Updated on Mon, May 20 2019 8:03 AM

Teachers ZPTC And MPTC Counting Arrangements - Sakshi

ఎన్నికలు సిబ్బందికి శిక్షణ ఇస్నున్న కలెక్టరు

పాలమూరు: స్థానిక సంస్థల సమరంలో మొదటి అంకం ముగిసింది. ఇక ఓట్లను లెక్కించే ప్రక్రియకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గ్రామాన్ని యూనిట్‌గా ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లు, మండలం యూనిట్‌గా జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే అవసరమైన సిబ్బందిని గుర్తించారు. వారికి శనివారం నుంచి ఆయా రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తున్నారు. మొత్తంగా ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు.

అదృష్టం ఎవరికి వరించెనో.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు విజయబావుటా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేశారు. మొదటి దశలో 24 జెడ్పీటీసీ స్థానాలకు 106 మంది, 294 ఎంపీటీసీ స్థానాలకు 949 మంది, రెండో దశలో 26 జెడ్పీటీసీ స్థానాలకు 102 మంది, 287 ఎంపీటీసీ స్థానాలకు 906 మంది పోటీ పడ్డారు. ఈనెల 14న నిర్వహించిన మూడో దశ ఎన్నికల్లో 21 జెడ్పీటీసీ స్థానాల్లో 88మంది, 209ఎంపీటీసీ స్థానాల్లో 647మంది పోటీ పడ్డారు.

మిగిలింది లెక్కింపే.. 
పోలింగ్‌ ప్రక్రియ మూడు దశల్లో పూర్తవ్వగా ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలింది. ఈ మేరకు మండలం యూనిట్‌గా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంపీటీసీ స్థానాలను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు ఒక మండలంలో పది స్థానాలుంటే 20 టేబుళ్లుంటాయి. మొదట పెట్టెల్లోని బ్యాలెట్‌ పత్రాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా వేరుచేసి 25 చొప్పున కట్టలు కడతారు. జెడ్పీటీసీ పత్రాలన్నీ ఒక చోటుకు చేరుస్తారు. మొదట ఎంపీటీసీ ఓట్లు లెక్కించి ఫలితాలు  వెల్లడిస్తారు. తర్వాత అన్ని టేబుళ్ల వారు జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును ఆర్వోలు పరిశీలిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేవనుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటించి విజేతకు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.
 
కలెక్టర్‌ ఆదేశాల మేరకు..   
పోలైన ఓట్లతో నిండిన బ్యాలెట్‌ పెట్టెలు స్ట్రాంగ్‌ రూంలలో భద్రంగా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో వాటికి అనుసంధానంగానే లెక్కింపు కేంద్రాలు ఉండేలా ఐదు జిల్లాల పరిధిలో కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి వద్ద అవసరమైన బారికేడ్లు, టేబుళ్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. వీటిని ఐదు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో లైజనింగ్‌ అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు ఈ పనులు సాగుతున్నాయి.

మొదలైన శిక్షణ తరగతులు  
ఇప్పటికే అన్ని జిల్లాల్లో లెక్కింపు సిబ్బంది గుర్తింపు ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రక్రియ పరిశీలించే ఆర్వోలు, ఎంపీడీఓలు ఇప్పటికే విధుల్లో ఉన్నారు. వారితోపాటు లెక్కింపును పర్యవేక్షించేందుకు సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లను నియమించారు. వీరందరికి శనివారం నుంచి ఆయా రెవెన్యూ డివిజన్లల్లో శిక్షణ ప్రారంభించారు. దీనిపై ఇదివరకే రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ నాగిరెడ్డి జిల్లా అధికారులతో ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శిక్షణలో చెప్పాల్సిన అంశాలు, లెక్కింపు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement