గెలిచేదెవరు.. ఓడేదెవరు? | Telangana Lok Sabha Elections Counting Arrangements | Sakshi
Sakshi News home page

గెలిచేదెవరు.. ఓడేదెవరు?

Published Sat, May 18 2019 11:49 AM | Last Updated on Sat, May 18 2019 11:49 AM

Telangana Lok Sabha Elections Counting Arrangements - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఓ వైపు లోక్‌సభ... మరోవైపు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తోంది. ఏప్రిల్‌ 11వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగగా.. 43 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా జరిగిన విషయం విదితమే.

ఇందులో వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఆ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆరు జెడ్పీలు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ సర్వశక్తులొడ్డగా.. 27న వెలువడే ఫలితాలతో ఎవరి ఆశలు ఎంత మేరకు ఫలించాయనేది బయటపడనుంది. మూడు రోజుల వ్యవధిలో అటు పార్లమెంట్, ఇటు ప్రాదేశిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నాయకులతో పాటు ఇటు ఓటర్లలో చర్చలు మొదలయ్యాయి.

బరిలో 3,166 మంది
వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ పార్లమెంట్‌ స్థానాల్లో పార్టీలు, స్వతంత్రులు కలిపి 29మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఆరు జిల్లాల పరిధిలోని 70 జెడ్పీటీసీ స్థానాలకు 403 మంది, 780 ఎంపీటీసీ స్థానాలకు 2,734 మంది రంగంలో ఉన్నారు. అంటే మొత్తంగా విజయం కోసం 3,166 మంది నిరీక్షిస్తున్నారు. ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాల్లో ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలవనున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితం కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భారీగానే ఆశల్ని పెట్టుకున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల జోరును ఇక్కడ కూడా చూపిస్తామనే ధీమాతో గులాబీ దళంలో ఉండగా.. ఫలితం తమకు అనుకూలంగా వస్తుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. ఇక వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి జయశంకర్, ములుగు జిల్లాల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరులో 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోగా 70 జెడ్పీటీసీ, 762 ఎంపీటీసీ స్థానాల్లో తామే గెలుస్తామంటూ 3,137 మంది అభ్యర్థులు ఎవరికి వారు చెబుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉన్నా.. అక్కడక్కడా స్వతంత్రులు గెలుపు బాటలో పయనించే అవకాశముందనే ప్రచారంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది.

అందరిలోనూ ఆశలే
ఈనెల 23, 27.. ఈ రెండు తేదీలపైనే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బోలెడు ఆశల్ని పెట్టుకున్నారు. అటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ఇటు ప్రాదేశిక సమరంలో తలపడిన అభ్యర్థులంతా గెలుపు తమదేనన్న ఆశల లోకంలో విహరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయి.. మెజార్టీ ఎంత రావొచ్చంటూ లెక్కలేసుకుంటున్నారు. పార్టీల ఉనికిని కీలకంగా పరిగణించే ఈ ఫలితాల తీరుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమనే చెబుతున్నారు.

కాగా రాబోయే ఐదేళ్లపాటు జిల్లాలో తమదైన ఉనికి సాగించాలనుకునే పార్టీలకు ఈ రెండు ఎన్నికల ఫలితాలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ జోరుకు అనుకున్న స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ శక్తివంచన లేకుండా చేసిన కృషి ఏ మేరకు ఫలితమిస్తుందోననేది వేచిచూడాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో గులాబీ పార్టీలో సరికొత్త ఉత్సాహం నెలకొనగా.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపు కోసం ప్రయత్నించింది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వచ్చే సరికి అన్ని పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి.  

చకచకా ఏర్పాట్లు
అభ్యర్థుల అంచనాలను పక్కన పెడితే.. ఇంకోపక్క అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఏనుమాముల మార్కెట్‌లో, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం ఈవీఎంలను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భద్రపరిచారు. ఆయా కేంద్రాల్లో 24 గంటల భద్రత కొనసాగుతుండగా.. 23వ తేదీన జరిగే లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా శుక్రవారం ఏనుమాములలో వరంగల్‌ లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి, అర్బన్‌ కలెక్టర్‌  ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, మహబూబాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శివలింగయ్య ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని సూచించిన వారు.. కౌంటింగ్‌ హాళ్లలో బారికేడ్లు, ఫెన్సింగ్‌ను పరిశీలించారు అధికారులకు సూచనలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement